కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు ముగిసి ఫలితాలు కూడా వెలువడ్డాయి. ఇక్కడ సుమారు 2.6 లక్షల మంది ఓటర్లు ఏ పార్టీకి ఓటేయలేదు. నోటా మీటను నొక్కారు. 

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. కర్ణాటక ప్రజల తీర్పు ఈ సారి హంగ్ రూపంలో కాకుండా స్పష్టంగా వచ్చింది. అయితే, ఈ తీర్పుతో సంబంధం లేకుండా కొందరు ఓటర్లు ఉన్నారు. అంటే.. వారు అభ్యర్థులెవరికీ ఓటేయలేదు. నోటా (నన్ ఆఫ్ ది ఎబో అంటే పైన పేర్కొన్న అభ్యర్థుల్లో ఎవరూ కారు) మీటను నొక్కారు. సుమారు 2.6 లక్షల మంది ఓటర్లు నోటాను ఎంచుకున్నారు.

మే 10వ తేదీన జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 3.84 కోట్ల మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇందులో 2,59,278 మంది ఓటర్లు నోటా ఆప్షన్ ఎంచుకున్నారు. అంటే 0.7 శాతం మంది నోటా మీటనే నొక్కారు. బుధవారం మధ్యాహ్నం 3.30 గంటల వరకు అందుబాటులోకి వచ్చిన డేటా ప్రకారం ఈ విషయం వెల్లడైంది.

హిమాచల్ ప్రదేశ్ మినహాయించి 2019 నుంచి కాంగ్రెస్ ఒక్క రాష్ట్ర అసెంబ్లీలోనూ విజయం సాధించలేదు. ఇప్పుడు కర్ణాటకలో విజయపతాకాన్ని ఎగరేసింది. కాగా, బీజేపీకి ఈ రాష్ట్రం కీలకమైంది. దక్షిణాదిలో బీజేపీ అధికారంలో ఉన్న ఏకైక రాష్ట్రం కర్ణాటకనే.

Also Read: కర్ణాటకలో కాంగ్రెస్ విజయం.. విపక్షాలకు సారథ్యం వహించడానికి ‘చేతి’కి బలం.. ప్రతిపక్ష శిబిరంలో ఉత్సాహం

కాంగ్రెస్‌కు వొక్కలిగ, లింగాయత్‌ల నుంచి ఓట్లు ఆశించిన మేర పడ్డట్టు తెలుస్తున్నది. వీరి రీజియన్‌లతోపాటు షెడ్యూల్డ్ క్యాస్ట్స్, షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఏరియాల్లోనూ కాంగ్రెస్‌కు మంచి ఓట్లు వచ్చాయి.