సోనియా గాంధీని వేధించిన కేసులో బీజేపీ ఎంపీలపై లోక్‌సభ స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు కాంగ్రెస్ సభ్యులు. బీజేపీ సభ్యుల ప్రవర్తనను ప్రివిలేజ్ కమిటీ దృష్టికి తీసుకెళ్లడంలో చొరవ తీసుకోవాలని కాంగ్రెస్ ఎంపీలు ఓం బిర్లాను కోరారు.

అధిర్ రంజన్ చౌదరి ‘రాష్ట్రపత్ని’ వ్యాఖ్యలు గురువారం పార్లమెంట్‌ను కుదిపేసిన సంగతి తెలిసిందే. దీంతో బీజేపీ, కాంగ్రెస్ సభ్యుల మధ్య మాటల యుద్ధం నడిచింది. సభలోనే ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు. ఇదే సమయంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ పట్ల బీజేపీ ఎంపీలు అనుచితంగా ప్రవర్తించారంటూ కాంగ్రెస్ సభా పక్షనేత అధిర్ రంజన్ చౌదరి, ఆ పార్టీ ఎంపీలు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు. ఈ విషయాన్ని ప్రివిలేజ్ కమిటీ దృష్టికి తీసుకెళ్లాలని వారు లేఖలో కోరారు. 

అసలేం జరిగిందంటే:

గురువారం లోక్‌సభ వాయిదా పడిన తర్వాత పలువురు బీజేపీ ఎంపీలు సోనియా వద్దకు వెళ్లి బిగ్గరగా నినాదాలు చేశారు. దీంతో అయోమయానికి గురైన సోనియాకు ఏం జరుగుతుందో అర్ధం కాలేదు. విషయం తెలుసుకునేందుకు బీజేపీ ఎంపీ రమాదేవితో మాట్లాడుతుండగా.. కొందరు బీజేపీ ఎంపీలు, కేంద్ర మంత్రులు సోనియాకు వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో పాటు భయపెట్టారని లేఖలో కాంగ్రెస్ ఎంపీలు ఫిర్యాదు చేశారు. ఈ పరిణామాలతో అప్రమత్తమైన కాంగ్రెస్ మహిళా ఎంపీలు, ఇతర విపక్ష సభ్యులు సోనియా గాంధీని అక్కడి నుంచి తీసుకొచ్చేశారని, లేదంటే బీజేపీ ఎంపీలు దాడికి దిగేవారని లేఖలో పేర్కొన్నారు. బీజేపీ సభ్యుల ప్రవర్తనను ప్రివిలేజ్ కమిటీ దృష్టికి తీసుకెళ్లడంలో చొరవ తీసుకోవాలని కాంగ్రెస్ ఎంపీలు ఓం బిర్లాను కోరారు. 

మరోవైపు.. కాంగ్రెస్ (congress) నేత అధిర్ రంజన్ చౌదరికి (Adhir Ranjan Chowdhury) జాతీయ మహిళా కమీషన్‌ (National Commission for Women ) నోటీసులు జారీ చేసింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను ఈ నోటీసులు ఇచ్చింది. ‘‘ రాష్ట్రపత్ని’’ వ్యాఖ్యలకు గాను లిఖితపూర్వకంగా వివరణ ఇవ్వాలని ఎన్‌సీడబ్ల్యూ (ncw) ఆదేశించింది. ఇందుకు ఆగస్ట్ 3 ఉదయం 11.30 గంటల వరకు గడువు విధించింది. మరోవైపు ఈ వ్యవహారంపై కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి (sonia gandhi) కూడా మహిళా కమీషన్ లేఖ రాసింది. ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని.. అధిర్ రంజన్ చౌదరి చేసిన అవమానకరమైన వ్యాఖ్యలపై తగిన చర్యలు తీసుకోవాలని కోరింది. ఎన్‌సీడబ్ల్యూతో పాటు 13 రాష్ట్ర మహిళా కమీషన్‌లు కూడా ఎంపీ అధిర్ రంజన్ చౌదరి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. 

Also REad:‘రాష్ట్రపత్ని’ వ్యాఖ్యలు.. అధిర్ రంజన్‌కు జాతీయ మహిళా కమీషన్ నోటీసులు

ఇకపోతే... రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని ‘రాష్ట్రపత్ని’గా పేర్కొన్నందుకు తన తప్పును అంగీకరిస్తున్నాని కాంగ్రెస్ సీనియర్ నేత అధిర్ రంజన్ చౌదరి అన్నారు. తాను రాష్ట్రపతికి క్షమాపణలు చెబుతానని అన్నారు. తాను బెంగాలీ వాడినని, హిందీ అలవాటు లేదని తెలిపారు. రాష్ట్రపతిని తాను స్వయంగా కలిసి క్షమించాలని కోరుతానని అన్నారు. కానీ ఈ 'పఖండీలకు' (కపటవాదులకు) క్షమాపణ చెప్పబోనని ఆయ‌న‌ను విమ‌ర్శించేవారిని ఉద్దేశించి అన్నారు.