హుండీలో మోడీ వేసింది 21 రూపాయలేనన్న ప్రియాంకా గాంధీ.. వీడియోతో సహా కౌంటరిచ్చిన బీజేపీ

ప్రధాని నరేంద్ర మోడీపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ చేసిన విమర్శలకు రాజస్థాన్ బీజేపీ విభాగం గట్టి కౌంటర్ ఇచ్చింది . కాంగ్రెస్‌ను అబద్ధాల దుకాణంగా అభివర్ణిస్తూ, ప్రియాంక గాంధీని బంటీ-బాబ్లీ పాత్రలో బాబ్లీగా పేర్కొంది బీజేపీ 

congress leader priyanka gandhi allegation on pm narendra modi in dausa bjp rajasthan posted reality check ksp

రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలో హోరాహోరీగా తలపడుతున్నాయి. ఈసారి అధికారాన్ని అందుకోవాలని బీజేపీ.. అధికారాన్ని నిలబెట్టుకోవాలని కాంగ్రెస్ పార్టీలు వ్యూహ ప్రతివ్యూహాలు రచిస్తున్నాయి. ఎన్నికల ప్రచారంలో అగ్రనేతలు నిలవడంతో విమర్శలు , ప్రతి విమర్శలు చోటు చేసుకుంటున్నాయి. కాంగ్రెస్ తరపున ప్రియాంకా గాంధీ బాధ్యతను భుజానికెత్తుకున్నారు. గత కొన్ని రోజులుగా ఆమె రాష్ట్రంలో సుడిగాలి పర్యటన చేస్తున్నారు. తాజాగా దౌసాలోని సిక్రాయ్‌లో జరిగిన బహిరంగ సభలో ప్రధాని మోడీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు ప్రియాంకా గాంధీ. 

‘‘నేను టీవీలో చూశాను.. ఇది నిజమో కాదో తెలియదు. దేవ్ నారాయణ్ జీ ఆలయానికి వెళ్లి మోడీ విరాళం ఇచ్చారు. 6 నెలల తర్వాత హుండీలో ఆయన వేసిన ఎన్వలప్ తెరిచారు. ఆ కవరులో 21 రూపాయలు కనిపించాయి’’ అంటూ ఆమె వ్యాఖ్యానించారు. దీనికి రాజస్థాన్ బీజేపీ తన ట్విట్టర్ హ్యాండిల్‌లో రియాలిటీ చెక్‌ను పోస్ట్ చేయడం ద్వారా ప్రియాంక గాంధీకి కౌంటరిచ్చింది. కాంగ్రెస్‌ను అబద్ధాల దుకాణంగా అభివర్ణిస్తూ, ప్రియాంక గాంధీని బంటీ-బాబ్లీ పాత్రలో బాబ్లీగా పేర్కొంది బీజేపీ.

 

 

ఇంకా ప్రియాంకా గాంధీ ఏమన్నారంటే.. మోడీ ఇక్కడికి వచ్చి అభివృద్ధిపై పూర్తి విరుద్ధంగా మాట్లాడుతున్నారని ప్రియాంక దుయ్యబట్టారు. పండిట్ జవహర్ లాల్ నెహ్రూ రూపకల్పన చేసిన పంట కాలువల నెట్‌వర్క్‌ను ఆమె గుర్తుచేశారు. దేశంలో 60కి పైగా ప్రాజెక్ట్‌లను ఆయన రూపొందించారని.. వీటిలో అతిపెద్దది ఇందిరా గాంధీ కాలువ అని ప్రియాంకా గాంధీ పేర్కొన్నారు. ఇందిరా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రిలు ఈ పనిని మరింత ముందుకు తీసుకెళ్లారని ఆమె వెల్లడించారు. 

ఓపీఎస్ విషయంలో కేంద్రంలోని మోడీ ప్రభుత్వంపై ప్రియాంక విమర్శలు గుప్పించారు. బీజేపీ నేతలు తొలుత తమ అహాన్ని పెంచుకునేందుకు, ఆ తర్వాత పారిశ్రామికవేత్తలుగా వున్న స్నేహితుల కోసం పనిచేస్తున్నారని ప్రియాంక ఆరోపించారు. దేశ ప్రధాని ఒక్కో విమానాన్ని రూ.8 వేల కోట్లతో కొనుగోలు చేస్తున్నారని.. 27 వేల కోట్లతో భవనాన్ని నిర్మిస్తున్నారని ఆమె ఎద్దేవా చేశారు. కానీ ఓపీఎస్ కోసం డబ్బులు లేవంటున్నారని.. దేశంలోని సంపదనంతా తన మిత్రులకే ఇచ్చారని ప్రియాంకా గాంధీ ఆరోపించారు. 

గడిచిన 45 ఏళ్లలో ఇప్పుడే నిరుద్యోగం తారా స్థాయికి చేరిందని.. మరి ఈ ప్రభుత్వం ఎలాంటి పథకం తీసుకొస్తుందని ఆమె ప్రశ్నించారు. తనను యూపీలో తెల్లవారుజామున 4 గంటలకు అరెస్ట్ చేశారని ప్రియాంకా గాంధీ గుర్తుచేశారు. ఎన్నికలు వచ్చినప్పుడల్లా ఈ వ్యక్తులు (బీజేపీ నాయకులు) మతం, కులం గురించి మాట్లాడతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవి హృదయం, భావోద్వేగాలకు సంబంధించినవని.. దీనిని భారతీయులెవరూ కాదనలేరని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో ఇలాంటి మాటలు ఎందుకు చెబుతారు.. ఈ సమయంలో మీ అభివృద్ధి గురించి ఎందుకు మాట్లాడటం లేదు.. ఓపీఎస్ డబ్బులు ఎందుకు చెల్లించడం లేదని ప్రియాంకా గాంధీ ఆరోపించారు. 

దేశంలోని ప్రభుత్వ రంగ కంపెనీలను చౌకగా కట్టబెట్టారని ఆమె దుయ్యబట్టారు. రాజస్థాన్ ప్రభుత్వం ద్రవ్యోల్బణం సహాయక చర్యలను ఏర్పాటు చేస్తుంటే.. కేంద్ర ప్రభుత్వం ద్రవ్యోల్బణాన్ని విపరీతంగా పెంచిందని ప్రియాంకా గాంధీ దుయ్యబట్టారు. ఇండోనేషియా నుంచి బొగ్గును కొనుగోలు చేస్తారని.. మోడీ స్నేహితుడు దానిని తీసుకొచ్చి ఇక్కడ ఎక్కువ ధరకు అమ్ముతాడని ఆమె ఆరోపించారు. పెరుగుతున్న కరెంట్ బిల్లులతో పారిశ్రామికవేత్తలందరి జేబులు నిండుతున్నాయని ప్రియాంకా గాంధీ దుయ్యబట్టారు. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios