దశాబ్ధాల న్యాయపోరాటం ఫలించి అయోధ్యలో రామమందిర నిర్మాణానికి అన్ని ఆటంకాలు తొలగిపోయాయి. ఈ నేపథ్యంలో ఆగస్టు 5న ప్రధాని నరేంద్రమోడీ రామ మందిర నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు.

ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ రాముడిని కొనియాడారు. అయోధ్య అంశంపై పార్టీ వైఖరికి సంకేతంగా రాముడు అందరివాడని, అందరి హృదయాల్లో రాముడు ఉన్నాడంటూ ఆమె ట్వీట్ చేశారు.

Also Read:అయోధ్య భూమి పూజ: న్యాయపోరాటం చేసిన ముస్లింకి మొదటి ఆహ్వానం

అయోధ్యలోని రామజన్మభూమిలో బుధవారం జరిగే భూమిపూజ కార్యక్రమం జాతీయ ఐక్యతను చాటే సాంస్కృతిక సమ్మేళనంగా నిలిచిపోతుందని ప్రియాంక వ్యాఖ్యానించారు.

నిరాడంబరత, ధైర్యం, సహనం, త్యాగం, అంకిత భావాలకు ప్రతీక అయిన శ్రీరాముడు అందరితో ఉంటాడని ఆమె ట్వీట్‌లో అన్నారు. ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా పగ్గాలు చేపట్టిన ప్రియాంక .. దేశంలోనే అతిపెద్ద రాష్ట్రంలో పార్టీకి పూర్వవైభవం తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.

Also Read:ముస్లిం యువతి రామ భక్తి.. టాటూగా వేయించుకొని..

మరోవైపు రామమందిర నిర్మాణ భూమి పూజకు కాంగ్రెస్‌కు ఆహ్వానం పంపకపోవడం చర్చనీయాంశమైంది. అయోధ్యలోని వివాదాస్పద స్థలంలో రామ మందిర నిర్మాణానికి అనుకూలంగా తీర్పు వచ్చిన సమయంలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ స్వాగతిస్తూ తీర్మానం చేసిన సంగతి తెలిసిందే.