శతాబ్దాలుగా అపరిష్కృతంగా ఉన్న అయోధ్య వివాదానికి పరిష్కారం దొరికిన విషయం తెలిసిందే. అయోధ్య రామ మందిర నిర్మాణానికి ఏర్పాట్లు వేగంగా చేస్తున్నారు. ఎల్లుండి, అంటే ఈ నెల 5వ తేదీన రామ మందిర నిర్మాణానికి భూమిపూజకు నిర్వహించనున్న విషయం తెలిసిందే. 

ఈ కార్యక్రమం ప్రధాని నరేంద్ర మోడీ చేతులమీదగా జరగనుంది. అయోధ్య రామమందిర నిర్మాణం కోసం జరిగే భూమిపూజ సందర్భంగా హిందూ, ముస్లింల మధ్య సోదరభావాన్ని పెంపొందించే అరుదైన సన్నివేశం చోటుచేసుకుంది. ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా బాబ్రీ మసీదు కోసం న్యాయపోరాటం చేసిన ఇక్బాల్ అన్సారీకి ఇవాళ తొలి ఆహ్వానం అందింది. 

అయోధ్య రామజన్మభూమి వివాదంపై ముస్లింల తరపున బలంగా గళం వినిపించిన వారిలో అన్సారీ ఒకరు. కాగా భూమిపూజ కోసం తనను ఆహ్వానించడం పట్ల అన్సారీ హర్షం వ్యక్తం చేశారు. ‘‘నాకు తొలి ఆహ్వానం అందాలన్నది సాక్షాత్తూ శ్రీరాముడి ఆకాంక్ష అని భావిస్తున్నాను. అందుకే దీన్ని మనస్పూర్తిగా స్వీకరిస్తున్నాను..’’ అని అన్సారీ వ్యాఖ్యానించారు

అసదుద్దీన్ ఒవైసీకి సైతం ఆహ్వాన పత్రిక వెళ్లినట్టు సమాచారం. బీజేపీ అధికార ప్రతినిధి కృష్ణసాగర్ రావు ఆయనకు ఆహ్వాన పత్రిక అందజేసినట్టు తెలియవస్తుంది. 

దాదాపుగా 200 మంది ప్రముఖులకు ఈ ఆహ్వాన పత్రికలను పంపనున్నట్టుగా తెలియవస్తుంది. పసుపు రంగు బ్యాక్ గ్రౌండ్ పై ఎర్ర రంగులో ముద్రించిన అక్షరాలతో చాలా చూడముచ్చటగా ఉంది ఈ కార్డు. ఈ కార్యక్రమానికి ప్రధానితో పాటుగా, ముఖ్య బీజేపీ నాయకులూ, కొన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు సైతం హాజరవ్వనున్నారు. 

యూపీ సీఎం యోగి ముందుగానే అయోధ్యకు వెళ్లి అక్కడ ఏర్పాట్లను పరిశీలించనున్నారు. 161 ఫీట్ల ఎత్తుతో మూడున్నర సంవత్సరాల్లో ఈ భవ్యమైన రామ మందిర నిర్మాణం జరగనుంది. 

ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీతో పాటు పలువురు ముఖ్యమంత్రులు, వీఐపీలు హాజరవుతున్న నేపథ్యంలో భూమి పూజకు రెండు రోజుల ముందు, ఆ రోజు అయోధ్యలో చేపట్టబోయే భద్రతా చర్యలపై నగర డీఐజీ దీపక్‌కుమార్ రెండు రోజుల కింద మాట్లాడారు. 

ప్రోటోకాల్‌ను అనుసరించడంతో పాటు కోవిడ్ వారియర్లను సైతం అందుబాటులో ఉంచుతున్నట్లు తెలిపారు. వీఐపీలు వచ్చే రూట్లను డ్రోన్ల సాయంతో నిరంతరం పర్యవేక్షిస్తామని.. నగరంలోని ప్రజలకు ఎలాంటి పరిమితులు విధించలేదని, కరోనాను దృష్టిలో వుంచుకుని బయటకు రావొద్దని డీఐజీ ప్రజలను కోరారు. 

బయటి వ్యక్తులను నగరంలోకి అనుమతించమని.. ఐదుగురి కంటే ఎక్కువ మంది ఒకే చోట గుమిగూడకుండా చర్యలు చేపడుతున్నట్లు ఓ పోలీస్ అధికారి వెల్లడించారు. కరోనా టెస్టుల్లో నెగిటివ్ వచ్చిన, 45 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న వారిని మాత్రమే ప్రధానికి సెక్యూరిటీగా ఉంచనున్నట్లు తెలిపారు.