Asianet News TeluguAsianet News Telugu

రాఫేల్ అవినీతి ఆరోపణలు.. కాంగ్రెస్‌పై బీజేపీ అటాక్

రాఫేల్ దుమారం మరోసారి చెలరేగింది. ఫ్రెంచ్ మీడియా సంస్థ కథనం ఇప్పుడు కాంగ్రెస్, బీజేపీల మధ్య మరోసారి ఆరోపణ పర్వానికి తెరలేపింది. కాంగ్రెస్ హయాంలోనే ముడుపులు అందాయని బీజేపీ విమర్శలు చేస్తున్నది. కాగా, ఆ ఆరోపణలపై దర్యాప్తు చేయడానికి సీబీఐ సిద్ధపడలేదని, ఇది మోడీ ప్రభుత్వానికి, సీబీఐకి మధ్య ఉన్న చీకటి ఒప్పందానికి వెల్లడిస్తున్నదని కాంగ్రెస్ ఆరోపిస్తున్నది.

congress bjp alleges corruption over rafale jets deal
Author
New Delhi, First Published Nov 9, 2021, 3:15 PM IST

న్యూఢిల్లీ: Rafale అవినీతి ఆరోపణలు మరోసారి దేశ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. 2019 సార్వత్రిక ఎన్నికల్లో Congress ప్రధానంగా రాఫేల్ ‘కుంభకోణం’ చుట్టే క్యాంపెయిన్ నడిపింది. BJPపై తీవ్ర ఆరోపణలు చేసింది. ఇప్పటికీ రాఫేల్ గురించి ఏ అవినీతి ఆరోపణలు వచ్చినా కాంగ్రెస్ విడిచిపెట్టడం లేదు. బీజేపీపై ఆరోపణలు చేస్తూనే ఉన్నది. కానీ, ఇటీవలి ఫ్రెంచ్ మీడియా సంస్థ పరిశోధనాత్మక కథనాన్ని ఆసరాగా తీసుకుని బీజేపీ దాడికి దిగింది. కాంగ్రెస్‌పై విరుచుకుపడింది.

French ఏవియేషన్ సంస్థ దసో నుంచి భారత్ 36 యుద్ధవిమానాలు రాఫేల్ జెట్లను కొనుగోలు చేయడానికి 2015లో Deal ఖరారైన సంగతి తెలిసిందే. ఈ యుద్ధ విమానాలు మన దేశానికి బ్యాచ్‌లుగా వస్తున్నాయి. కానీ, ఈ డీల్ మాత్రం కాంగ్రెస్ హయాంలోనే ప్రారంభమైంది. ఈ డీల్ చుట్టూ అనేక విధాల అవినీతి ఆరోపణలు వచ్చాయి. వీటిని ఫ్రెంచ్ మీడియా సంస్థ మీడియాపార్ట్ పరిశోధిస్తూ కథనాలు వెలువరిస్తున్నది. ఇటీవలే మరో సంచలన కథనాన్ని మీడియాపార్ట్ వెలువరించింది. ఇందులో కీలక ఆరోపణలు చేసింది.

Also Read: రాఫేల్‌ డీల్‌లో మరో సంచలనం.. ‘ఆ ముడుపులపై ఆధారాలున్నా సీబీఐ దర్యాప్తు చేయలేదు’

భారత్ యుద్ధ విమానాలు కొనుగోలు చేసే డీల్‌ను ఫ్రాన్స్ దక్కించుకోవడానికి అడ్డదారి తొక్కినట్టు పేర్కొంది. భారత్ నుంచి డీల్ అందుకోవడానికి మధ్య దళారికి సుమారు రూ. 65 కోట్ల ముడుపులు అందించినట్టు ఆ కథనం పేర్కొంది. ఈ ముడుపులు కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అంటే 2007 నుంచి 2012 మధ్యకాలంలో అందాయని వివరించింది. ఇందుకు సంబంధించిన నకిలీ ఇన్వాయిస్‌లూ ఉన్నాయని తెలిపింది. అయితే, ఈ ఇన్వాయిస్‌లు 2018లో సీబీఐకి అందాయని వివరించింది. అంతేకాదు, ఈ రిపోర్టులు సీబీఐకి అందడానికి వారం రోజుల ముందే రాఫేల్ డీల్ అవినీతి ఆరోపణలపై దర్యాప్తు చేయాల్సిందిగా సీబీఐకి ఓ అధికారిక ఫిర్యాదు కూడా అందిందని తెలిపింది. ఫిర్యాదు అందినా, నకిలీ ఇన్వాయిస్‌ల రూపంలో ఆధారాలు ఉన్నప్పటికీ సీబీఐ మిన్నకుండిపోయిందని ఆరోపించింది. ఈ అవినీతి ఆరోపణలపై దర్యాప్తు చేయవద్దనే సీబీఐ నిర్ణయించుకుని ఊరుకుందని తెలిపింది.

Also Read: మోడీ ప్రభుత్వంపై రాహుల్ గాంధీ ఆన్‌లైన్ సర్వే.. ప్రజలకు 4 ప్రశ్నలు

ఈ కథనం తాజాగా దేశ రాజకీయాల్లో మరోసారి ప్రకంపనలు లేపాయి. తాజాగా, బీజేపీ కాంగ్రెస్‌పై విమర్శలు చేసింది. ఐఎన్‌సీ అంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కాదనీ, ఐ నీడ్ కమిషన్ అని అర్థమని బీజేపీ ప్రతినిధి సంబిత్ పాత్రా అన్నారు. యూపీఏ హయాంలో ఏ డీల్ జరిగినా.. అందులో మరో డీల్ ఉండేదని, ఇలా మాట్లాడటం అతిశయమేమీ కాదని ఆరోపించారు. ఇన్ని సంవత్సరాలు రాఫేల్ డీల్‌పై ఎందుకు వదంతులు ప్రచారం చేయడానికి ప్రయత్నించారో రాహుల్ గాంధీ ఇటలీ నుంచి సమాధానమివ్వాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ కూడా సమాధానం చెప్పాలని అన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే రాఫేల్ డీల్ కోసం అవినీతి జరిగిందని ఫ్రెంచ్ మీడియా కథనం వెల్లడిస్తున్నదని తెలిపారు. ఆ సమయంలోనే కమిషన్లు అందాయని వివరించారు. అంతేకాదు, ఆ కథనంలో దళారి పేరు కూడా బయటకు వచ్చిందని పేర్కొన్నారు.

అదే సమయంలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు కూడా ఈ కథనాన్ని పేర్కొంటూ ట్వీట్లు చేశారు. బీజేపీపై తమ విమర్శలను కొనసాగించారు. తాజా మీడియాపార్ట్ కథనం మరోసారి కేంద్రంలోని మోడీ ప్రభుత్వానికి సీబీఐకి మధ్య ఉన్న చీకటి ఒప్పందాన్ని వెల్లడి చేస్తున్నదని ఆరోపణలు చేశారు. రాఫేల్ అవినీతి బాగోతాన్ని పూర్తిగానే సమాధి చేయాలని కేంద్రం భావిస్తున్నదని ఆరోపించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios