Asianet News TeluguAsianet News Telugu

ఉద్రిక్తతలకు దారి తీసిన ‘గ్రహణ భోజనం’..పేడతో, కర్రలతో దాడిచేసి...

గ్రహణ సమయంలో భోజనం విషయంలో ఏర్పడిన వివాదం ఉద్రిక్తతలకు దారి తీసింది. ఓ వర్గం మరో వర్గం వారి మీద పేడతో, కర్రలతో దాడికి దిగారు. 

Clash over consumption of food on Lunar eclipse day in odisha
Author
First Published Nov 9, 2022, 10:19 AM IST

ఒడిశా :  చంద్రగ్రహణంపై ప్రజల్లో ఉన్న అపోహలను, భయాలను తొలగించి పేరుతో ‘మానవతావాది హేతువాది సంస్థ’ (హెచ్ఆర్ఓ) ఒడిశాలోని గంజాం జిల్లా శాఖ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన గ్రహణ సమయంలో భోజనం చేసే ప్రయత్నం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. దీన్ని వ్యతిరేకిస్తూ కొన్ని సంస్థలు ఆందోళనకు దిగడంతో పాటు హెచ్ఆర్ఓ ప్రతినిధులపై దాడులకు పాల్పడ్డాయి. దీంతో పోలీసులు లాఠీలు ఝళిపించి ఆందోళన చేస్తున్ వారిని చెదరగొట్టారు. మధ్యాహ్నం  స్థానిక సిటీ హైస్కూల్ రోడ్డులో  రెండు గంటలకు పైగా అశాంతి వాతావరణం నెలకొంది.

దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. చంద్రగ్రహణం నేపథ్యంలో హెచ్ఆర్ఓ గంజాం జిల్లా శాఖ ఆధ్వర్యంలో మధ్యాహ్నం సిటీ హైస్కూల్ రోడ్డులోని చారవాక్ భవన్ వద్ద ప్రజా చైతన్య కార్యక్రమాన్ని నిర్వహించింది. ప్రజలతో సామూహిక భోజనాలను ఏర్పాట్లు చేసింది. ప్రఫుల్ల సామంత్రాయ్, ఈటిరావు, కె.నందేశు సేనాపతి, బాలచంద్ర షడంగి, జమ్మల సురేష్, అబనీ గయా, కిషోర్ మిశ్ర, మధుసూదన్ సెఠి, బృందావన ఖొటెయి,  శంకర సాహూ, ప్రతాప్ ప్రధాన్, పార్వతి తదితరులు ఇందులో పాల్గొన్నారు. 

రేపే చంద్ర గ్రహణం.. ఆ రోజు ఏం తినాలి? ఏం తినకూడదో తెలుసుకోండి..

హెచ్ ఆర్ వో చేపట్టిన కార్యక్రమాన్ని గంజాం జిల్లా బ్రాహ్మణ పురోహిత సమితి, బజరంగ్ దళ్, విశ్వహిందూ పరిషత్  తదితర సంస్థలు వ్యతిరేకించాయి. ఒక సంస్థ ఆధ్వర్యంలో రామలింగం ట్యాంక్ రోడ్డులోని ఎత్తైన హనుమాన్ విగ్రహం వద్ద ప్రదర్శన జరుపగా.. మరికొందరు చారవాక్ భవన్ సమీపాన రహదారిపై బైఠాయించి తమ నిరసన వ్యక్తం చేశారు. ఆయా సంస్థల ప్రతినిధులు రెండు వైపుల నుంచి చారవాక్ భవన్ వద్దకు ఒక్కసారిగా కర్రలతో చేరుకుని వాగ్వాదానికి దిగారు. చారవాక్ భవన్ ముందు క్లాత్ పెండాల్ ను తొలగించి తోపులాటకు దిగారు. 

దేశవ్యాప్తంగా విడిచిన చంద్ర గ్రహణం.. భక్తుల పుణ్య స్నానాలు, శుద్ధి తర్వాత తెరచుకోనున్న ఆలయాలు

కొందరు హెచ్ఆర్ఓ ప్రతినిధులపై పేడతో దాడి చేశారు. దీంతో పరిస్థితి నియంత్రించేందుకు పోలీసులు లాఠీలు ఝళిపించి వారిని చెదరగొట్టారు. అయినప్పటికీ మళ్లీ ఆయా సంస్థల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో చారవాక్ భవన్ వద్దకు చేరుకుని వ్యతిరేక నినాదాలు చేశారు. చివరకు పోలీసులు హెచ్ఆర్ఓ ప్రతినిధులకు నచ్చజెప్పి, వారిని భద్రత మధ్య అక్కడి నుంచి పోలీసు వాహనాల్లో తరలించడంతో పరిస్థితి సాధారణ స్థితికి చేరుకుంది. గ్రహణ భోజనాన్ని బలవంతంగా అడ్డుకోవడం, దాడీ దారుణమని హెచ్ఆర్వో ప్రతినిధులు విలేకరుల వద్ద పేర్కొన్నారు. ముందు జాగ్రత్తగా చారవాక్ భవన్ వద్ద పోలీసు భద్రత ఏర్పాటు చేశారు. అదనపు ఎస్పి అసీమ్ పండా,  బ్రహ్మపుర ఎస్గీపీఓ రాజీవ్ లోచన్ పండా, పెద్ద బజారు, టౌన్ ఠాణాల ఐఐసీలు ప్రశాంత భూపతి, సురేష్ త్రిపాఠి ఇతర అధికారులు శాంతి భద్రతలను పర్యవేక్షించారు.

Follow Us:
Download App:
  • android
  • ios