దేశ రాజధాని డిల్లీ మరోసారి పోలీసుల ఆధీనంలోకి వెళ్లిపొయింది. సిజెపి ఆందోళనల నేపథ్యంలో నేడు (శనివారం) ఉద్రిక్త పరిస్థితులకు ఆస్కారం ఉంది… అందుకే ముందస్తు అరెస్టులు కొనసాగుతున్నాయి.

దేశ రాజధాని ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ (CJP) చేపట్టిన నిరసన మరోసారి ఉద్రిక్తతకు దారితీసింది. ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ అక్టోబర్ 10న అంటే ఇవాళ (శనివారం) జంతర్ మంతర్ వద్ద ఆందోళనకు సిజెపి పిలుపునిచ్చింది. అయితే ఈ నిరసనకు ఢిల్లీ పోలీసులు అనుమతి నిరాకరించడంతో రాజధానిలో భద్రతను కట్టుదిట్టం చేశారు. మరోవైపు నిరసనకు సపోర్ట్ తెలిపిన ప్రముఖ యూట్యూబర్ ధ్రువ్ రాఠీని గురుగ్రామ్‌లోని ఆయన నివాసం నుంచి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సిజెపి లీడర్ అభిజిత్ దీప్కేను కూడా అరెస్ట్ చేశారు. ఈ పరిణామాలతో ఢిల్లీలో రాజకీయంగా ఉత్కంఠ నెలకొంది.

జంతర్ మంతర్ నిరసనకు నో పర్మిషన్

ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (Special Intensive Revision – SIR) ప్రక్రియపై సిజెపి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. ఈ ప్రక్రియలో పెద్ద సంఖ్యలో ఓటర్ల పేర్లు తొలగించడంపై అనుమానాలు ఉన్నాయని, దీనిపై ఎన్నికల సంఘం జవాబుదారీతనంతో వ్యవహరించాలని నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు. దీనికి బాధ్యత వహిస్తూ ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తోంది.

అయితే సిజెపి నిరసనకు అనుమతి ఇవ్వలేమని ఢిల్లీ పోలీసులు స్పష్టం చేశారు. ముందస్తుగా అనుమతి కోసం దరఖాస్తు చేయాల్సిన గడువును పాటించలేదని, గతంలో జరిగిన ఆందోళన సందర్భంగా శాంతిభద్రతల సమస్యలు తలెత్తిన విషయాన్ని కూడా అధికారులు ప్రస్తావించారు. అందుకే అనుమతి నిరాకరించామని... ప్రజలు గుమిగూడితే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. CJP నాయకులు మాత్రం శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు తమకు ఉందని పేర్కొంటూ వెనక్కి తగ్గేది లేదని ప్రకటించారు.

ధ్రువ్ రాఠీని అదుపులోకి తీసుకున్న పోలీసులు

CJP నిరసనకు సపోర్ట్ తెలిపిన ప్రముఖ యూట్యూబర్ ధ్రువ్ రాఠీని పోలీసులు అదుపులోకి తీసుకోవడం చర్చనీయాంశమైంది. గురుగ్రామ్‌లోని ఆయన నివాసానికి వెళ్లిన పోలీసులు శనివారం ఉదయమే ఆయనను అదుపులోకి తీసుకున్నారు. నిరసనలో పాల్గొనే ఉద్దేశంతో ఆయన ఢిల్లీకి వచ్చినట్లు తెలుస్తోంది.

ఢిల్లీలో భారీ భద్రత.. 

సిజెపి నిరసన నేపథ్యంలో ఢిల్లీలో పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ఢిల్లీ పోలీసులతో పాటు పారామిలిటరీ బలగాలు కలిపి 35 వేల మందికి పైగా భద్రతా సిబ్బందిని మోహరించారు. ప్రధాన రహదారులు, రైల్వే స్టేషన్లు, కీలక ప్రభుత్వ ప్రాంతాల్లో తనిఖీలు పెంచారు. నిరసనకారులు జంతర్ మంతర్ వైపు వెళ్లకుండా అడ్డుకునేందుకు బారికేడ్లు ఏర్పాటు చేశారు.

జంతర్ మంతర్‌తో పాటు పార్లమెంట్, ఇండియా గేట్ పరిసరాల్లోనూ భద్రతను పెంచారు. అనుమతి లేని ప్రాంతాల్లో గుమిగూడే వారిని అదుపులోకి తీసుకునే చర్యలు చేపట్టారు. నిరసనకు పెద్ద సంఖ్యలో యువత, విద్యార్థులు తరలివచ్చే అవకాశం ఉందన్న అంచనాతో పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఇవాళ ఉదయం ఢిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

 మెట్రో స్టేషన్ల మూసివేత

నిరసన నేపథ్యంలో ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ తొలుత 57 మెట్రో స్టేషన్ల ప్రవేశ, నిష్క్రమణ ద్వారాలను మూసివేయనున్నట్లు ప్రకటించింది. అయితే సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని ప్రజా రవాణాను పూర్తిగా నిలిపివేయకుండా, అవసరమైన నియంత్రణలతో కొనసాగించాలని సూచించింది. ఆ తర్వాత మూసివేతకు సంబంధించిన జాబితాను 45 స్టేషన్లకు తగ్గించారు. అక్టోబర్ 10న సాయంత్రం 6 గంటల వరకు ఈ స్టేషన్లలో ప్రవేశ, నిష్క్రమణలపై ఆంక్షలు కొనసాగనున్నట్లు సమాచారం.

కేంద్ర ఢిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో మొబైల్ ఇంటర్నెట్ సేవలపై కూడా తాత్కాలిక ఆంక్షలు విధించారు. రహదారులపై వాహనాల రాకపోకలను మళ్లించే ఏర్పాట్లు చేశారు. రైల్వే సేవలపైనా ఆంక్షలు విధించడంతో ప్రయాణికులకు ఇబ్బందులు ఎదురయ్యాయి. అయితే ప్రజలకు అనవసర అసౌకర్యం కలగకుండా రైలు, మెట్రో సేవలను నియంత్రిత పద్ధతిలో కొనసాగించాలని సుప్రీంకోర్టు ఆదేశించడం ఈ పరిణామాల్లో కీలకంగా మారింది.

అభిజీత్ దీప్కేను అరెస్ట్?

CJP వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే సహా పార్టీ నాయకులు నిరసనలో పాల్గొనేందుకు బయలుదేరారు. ఈ క్రమంలోనే ఆయనను విమానంలోనే పోలీసులు అరెస్ట్ చేశారు. నాటకీయ పరిణామాల మధ్య ఆయన్ని కస్టడీలోకి తీసుకున్నారు.

నిరసనకు అనుమతి నిరాకరించినప్పటికీ ఆందోళన కొనసాగిస్తామని పార్టీ నాయకులు ప్రకటించారు. మరోవైపు నిరసనకారుల కదలికలను నియంత్రించేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో మరింత మందిని అదుపులోకి తీసుకునే అవకాశాలపై ఉత్కంఠ నెలకొంది.

మొత్తంగా జ్ఞానేశ్ కుమార్ రాజీనామా డిమాండ్‌తో ప్రారంభమైన CJP ఆందోళన ఇప్పుడు ఓటర్ల జాబితాల సవరణ, ఎన్నికల సంఘం జవాబుదారీతనం, శాంతియుత నిరసన హక్కు వంటి అంశాల చుట్టూ దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఢిల్లీలో నిరసన ఎలా ముందుకు సాగుతుంది, CJP తదుపరి కార్యాచరణ ఏమిటన్నది ఆసక్తికరంగా మారింది.