CJI Gavai: సుప్రీంకోర్టులో సోమ‌వారం షాకింగ్ సంఘ‌ట‌న జ‌రిగింది. ప్ర‌ధాన న్యాయ‌మూర్తి భూష‌ణ్ గవాయ్‌పైకి ఓ వ్య‌క్తి వ‌స్తువును విసిరేందుకు ప్ర‌య‌త్నించాడు. ఆ త‌ర్వాత ఏం జ‌రిగిందంటే.? 

సుప్రీంకోర్టులో సోమవారం ఉదయం షాకింగ్‌ ఘటన జరిగింది. ప్రధాన న్యాయమూర్తి భూషణ్ గవాయ్ (CJI BR Gavai) ముందు ఒక వ్యక్తి వస్తువు విసరడానికి ప్రయత్నించాడు. కోర్టులో వాద ప్ర‌తివాద‌న‌లు జరుగుతున్న సమయంలో ఆ వ్యక్తి నినాదాలు చేస్తూ నిలబడ్డాడు. వెంటనే భద్రతా సిబ్బంది అతన్ని బయటకు తీసుకెళ్లారు.

ఈ సంఘటన వల్ల విచారణ కొద్దిసేపు ఆగినా, త్వరగానే తిరిగి ప్రారంభమైంది. అక్కడ ఉన్న న్యాయవాదుల ప్రకారం ఆ వ్యక్తి “సనాతన ధర్మాన్ని అవమానిస్తే భారత్‌ సహించదు” అంటూ నినాదాలు చేశాడని తెలుస్తోంది. కొందరు అతను చెప్పు విసరడానికి ప్రయత్నించాడని, మరికొందరు కాగితం రోల్‌లాంటి వస్తువును విసరబోయాడని చెప్పుకొచ్చారు.

ఆ వ్యక్తి న్యాయవాది గౌను ధరించి వచ్చినట్లు తెలిసింది. అయినా కూడా సీజేఐ గవాయ్ ప్రశాంతంగా వ్యవహరించారు. ఎలాంటి ఆందోళన చెంద‌కుండా.. “మనకి దృష్టి మళ్లకూడదు. మేము దృష్టి మళ్లించుకోలేదు” అంటూ తదుపరి కేసు వాదనలు కొనసాగించమని న్యాయవాదులకు సూచించారు.