Indian Railways: భారత్ నుంచి విదేశాలకు రైళ్లు వెళ్తాయా.? ఇవి ఎక్కాలంటే వీసా కావాలా.?
Indian Railways: భారత్ నుంచి అంతర్జాతీయ ప్రయాణాలు చేయడానికి ఎక్కువగా విమానాలను ఉపయోగిస్తుంటామని తెలిసిందే. అయితే భారత్ నుంచి కొన్ని దేశాలకు రైలు మార్గం కూడా అందుబాటులో ఉందని మీకు తెలుసా.? ఇంతకీ ఆ రూట్లు ఏవంటే.?

నేపాల్‌కు రైలు ప్రయాణం
భారతదేశం, నేపాల్ మధ్య రైలు సర్వీసులు చాలాకాలంగా నడుస్తున్నాయి.
* బీహార్‌లోని జయనగర్ స్టేషన్ నుంచి నేరుగా నేపాల్‌లోని జనక్‌పూర్ కుర్తా స్టేషన్ వరకు రైలు వెళ్తుంది.
* రాక్సౌల్ జంక్షన్ కూడా నేపాల్ ప్రవేశానికి కీలక ద్వారం.
* ఈ మార్గాల్లో ప్రతిరోజూ వేలాది మంది ప్రయాణిస్తారు.
* ముఖ్యంగా, భారతీయులకు నేపాల్‌కు వెళ్లడానికి పాస్‌పోర్ట్ లేదా వీసా అవసరం లేదు. ప్రయాణికులు ఫోటో ఐడీ కార్డు చూపిస్తే సరిపోతుంది.
బంగ్లాదేశ్‌కు రైలు కనెక్టివిటీ
భారతదేశం, బంగ్లాదేశ్ మధ్య రెండు రైళ్లు నడుస్తున్నాయి.
మైత్రీ ఎక్స్‌ప్రెస్: కోల్‌కతా – ఢాకా మధ్య వారానికి ఆరు రోజులు నడుస్తుంది. దాదాపు 375 కిలోమీటర్ల దూరాన్ని తొమ్మిది గంటల్లో కవర్ చేస్తుంది.
బంధన్ ఎక్స్‌ప్రెస్: కోల్‌కతా – ఖుల్నా మధ్య వారానికి ఒకసారి నడుస్తుంది. అయితే, బంగ్లాదేశ్‌లో ఉద్రిక్తతల కారణంగా ప్రస్తుతం ఈ సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేశారు. సాధారణంగా ఈ ప్రయాణానికి వీసా తప్పనిసరి.
పాకిస్తాన్‌కి కూడా..
ఒకప్పుడు భారతదేశం – పాకిస్తాన్ మధ్య రెండు ముఖ్యమైన రైళ్లు నడిచేవి.
సమ్జౌతా ఎక్స్‌ప్రెస్: ఢిల్లీ – అట్టారి నుంచి లాహోర్ వరకు ఈ రైలు అందుబాటులో ఉండేది.
థార్ లింక్ ఎక్స్‌ప్రెస్: జోధ్‌పూర్ నుంచి కరాచీ వరకు కూడా ఒక రైలు సర్వీస్ ఉండేది.
అయితే 2019లో భారత్-పాకిస్తాన్ మధ్య సంబంధాలు క్షీణించడంతో ఈ రెండు రైలు సర్వీసులను నిలిపివేశారు.
భూటాన్‌కు మొదటిసారిగా రైలు ప్రాజెక్టు
భూటాన్ ఇప్పటివరకు భారత రైలు నెట్‌వర్క్‌లో లేని దేశం. కానీ, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం రెండు ప్రధాన రైలు ప్రాజెక్టులను ఆమోదించింది.
కోక్రాఝర్ (అస్సాం) – గెలెఫు (భూటాన్) : 69 కిలోమీటర్ల ప్రయాణం ఉంటుంది.
బనార్హట్ (పశ్చిమ బెంగాల్) – సామ్త్సే (భూటాన్): 20 కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంటుంది.
ఈ మార్గాల్లో ప్యాసింజర్, సరుకు రవాణా రైళ్లు నడుస్తాయి. ఇది భూటాన్‌తో మొదటిసారిగా ప్రత్యక్ష రైలు కనెక్టివిటీ అవుతుంది.
భవిష్యత్తులో కొత్త దేశాలతో కనెక్టివిటీ
భారత రైల్వేలు రాబోయే రోజుల్లో మరికొన్ని దేశాలతో రైలు సర్వీసులు ప్రారంభించే ప్రణాళికలు చేస్తున్నాయి. వీటిలో ప్రధానంగా..
* మణిపూర్ నుంచి మయన్మార్, వియత్నాం వరకు రైలు మార్గం ప్రతిపాదించారు.
* న్యూఢిల్లీ నుంచి చైనాలోని కున్మింగ్ వరకు హై-స్పీడ్ రైలు ప్రాజెక్ట్ గురించి చర్చలు జరిగాయి. ఇది కార్యరూపం దాల్చితే గూడ్స్ రవాణా మరింత మెరుగవుతుంది.
* థాయిలాండ్, మలేషియా, సింగపూర్‌లతో రైలు కనెక్టివిటీపై పరిశీలనలు జరుగుతున్నాయి. ఒకవేళ ఈ మార్గాలు అందుబాటులోకి వస్తే ప్రయాణ ఖర్చు తగ్గుతుంది. అయితే వీటికి పాస్‌పోర్ట్, వీసా తప్పనిసరి చేస్తారు.