ఛత్తీస్‌గడ్‌లో ఓ గిరిజన నేత చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. మణిపూర్‌లో ఇద్దరు గిరిజన మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటనను నిరసిస్తూ ఆదివారం ఓ కార్యక్రమం చేశారు. అందులో గిరిజన నేత సుర్జు టేకం మాట్లాడుతూ.. ‘ఎన్నికల్లో గిరిజన ప్రాంతాల్లో బీజేపీ వాళ్లు వస్తే నరికేయండి.. నగ్నంగా వెనక్కి పంపించేయండి’ అంటూ కామెంట్ చేశాడు. 

రాయ్‌పూర్: ఛత్తీస్‌గడ్‌లో ఓ గిరిజన నేత వివాదాస్పద వ్యాఖ్యలతో రాజకీయ దుమారం రేగింది. మణిపూర్‌లో ఇద్దరు కుకీ తెగ గిరిజన మహిళలు ఇద్దరినీ నగ్నంగా ఊరేగించిన ఘటనను నిరసిస్తూ ఆదివాసీ సమాజ్, కాంగ్రెస్‌లు ఆదివారం ఓ ఆందోళన కార్యక్రమం చేశాయి. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇంద్రాషా మాండవీ సమక్షంలోనే గిరిజన నేత సుర్జు టేకం మాట్లాడుతూ.. ‘ఎన్నికల వేళ గిరిజన ప్రాంతాల్లోకి బీజేపీ వాళ్లు వస్తే నరికేయండి, నగ్నంగా వారిని వెనక్కి పంపించండి’ అంటూ కామెంట్ చేశారు. ఈ కామెంట్ చేస్తున్న వీడియోలో కాంగ్రెస్ ఎమ్మెల్యే కూడా కనిపించారు. దీంతో బీజేపీ కాంగ్రెస్ పై విరుచుకుపడింది.

కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని రావణ కాష్టం చేయాలని చూస్తున్నదని బీజేపీ విమర్శించింది. ఆ వ్యాఖ్యలు ఓ ఆవేదన, ఆగ్రహావేశంలో చేశారని కాంగ్రెస్ పేర్కొంది. ఈ వ్యాఖ్యలను సీఎం భుపేశ్ భగేల ఖండించారు. చట్ట ప్రకారం వారిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. 

Also Read: ఒకే వేదికపై శరద్ పవార్, ప్రధాని మోడీ.. ఆత్మీయ పలకరింపు, విపక్ష కూటమిలో ఆందోళన

టేకం వ్యాఖ్యలు చేసిన తర్వాత కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇంద్రషా మాండవీ మాట్లాడారు. టేకంపై ప్రశంసలు కురిపిస్తూ ఆయన రాజ్యాంగాన్ని గౌరవిస్తారని, ఆచరిస్తారని పేర్కొన్నారు. అయితే, కాంగ్రెస్ ఎమ్మెల్యే సమక్షంలో టేకం చేసిన వ్యాఖ్యల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అరున్ సావో మాట్లాడుతూ బీజేపీ నేతలపై బహిరంగంగా అలాంటి వ్యాఖ్యలు చేయడం రాష్ట్రంలో శాంతి భద్రతలు ఆవిరయ్యాయనే విషయాన్ని వెల్లడిస్తున్నదని అన్నారు. దేశ ద్రోహ కార్యకలాపాల్లో ప్రమేయం ఉన్నదన అభియోగాలతో జైలుపాలైన టేకం ఇలాంటి వ్యాఖ్యలు ఎలా చేయగలుగుతారంటే.. కాంగ్రెస్ ఎమ్మెల్యే మాండవీ, సీఎం భగేల్ రక్షించడానికి ఉన్నారు కదా! అంటూ మండిపడ్డారు.