టెర్రస్ నుంచి ప్రపంచ కప్ వరకు అద్భుత ప్రయాణం.. ఎవరీ ప్రతీకా రావల్?
Pratika Rawal Journey : భారత జట్టు మహిళా వన్డే ప్రపంచ కప్ 2025 ట్రోఫీని గెలుచుకోవడంలో ఢిల్లీ యంగ్ క్రికెటర్ ప్రతికా రావల్ కీలక పాత్ర పోషించింది. టెర్రస్ నుంచి ప్రపంచ క్రికెట్ రికార్డుల వరకు సాగిన ఆమె ప్రయాణం ఎంతోమందికి స్ఫూర్తినిస్తోంది.

క్రికెట్ కుటుంబం నుంచి భారత్ గర్వించదగ్గ ప్లేయర్ గా ఎదిగిన ప్రతీకా రావల్
2025 మహిళల వన్డే ప్రపంచకప్‌లో టీమిండియా విజయంలో ప్రతీకా రావల్ కీలక శక్తిగా నిలిచింది. ఆమె ఓపెనర్‌గా చేసిన ఇన్నింగ్స్ లు భారత్‌కు కొత్త రికార్డులను అందించడమే కాకుండా, మహిళా క్రికెట్ చరిత్రలో స్ఫూర్తిదాయక అధ్యాయంగా నిలిచాయి.
ప్రతీకా 2000 సెప్టెంబర్ 1న ఢిల్లీలో జన్మించింది. ఆమె కుటుంబం క్రికెట్‌తో బలమైన అనుబంధం కలిగి ఉంది. ఆమె తండ్రి ప్రదీప్ రావల్, డీడీసీఏ (Delhi & District Cricket Association)కు బీసీసీఐ సర్టిఫైడ్ లెవల్-II అంపైర్. చిన్నతనం నుంచే తండ్రి మార్గదర్శకత్వంలో ప్రతీకా క్రికెట్ నేర్చుకుంది.
క్రికెట్ తో పాటు చదువులోనూ ప్రతిభ కనబరిచిన ప్రతీకా 12వ తరగతి సీబీఎస్‌ఈ పరీక్షల్లో 92.5% మార్కులు సాధించింది. సైకాలజీ లో డిగ్రీ పూర్తిచేసింది. ఆమె తండ్రి ఇంటి టెర్రస్‌ను ప్రాక్టీస్ గ్రౌండ్‌గా మార్చి, ప్రతిరోజూ వందలాది బంతులను ఎదుర్కొనేలా శిక్షణ ఇచ్చారు. ఈ క్రమంలో ప్రతీకా తన టెక్నిక్, ఓపికగా బంతులను ఎదుర్కొంటూ పరుగులు రాబట్టే నైపుణ్యం సాధించింది.
క్రికెటర్ మారడంలో ప్రతీకా రావల్ కు ఎదురైన సవాళ్లు ఏమిటి?
ప్రతీకా మొదట చేరిన క్రికెట్ అకాడమీలో ఆమె మాత్రమే అమ్మాయి. మిగిలినవారందరూ అబ్బాయిలే. దీంతో ఆమె మానసికంగా, శారీరకంగా ఆరంభంలో ఇబ్బందులు పడింది. కానీ, తనపై వచ్చిన విమర్శలు, ఎద్దేవాలు ఆమెను వెనక్కి తగ్గించలేకపోయాయి. చదువుతో పాటు క్రికెట్ ప్రాక్టీస్‌ను సమతుల్యం చేస్తూ ముందుకెళ్లింది.
కోవిడ్ లాక్‌డౌన్ సమయంలో కుటుంబం కష్టాలు ఎదుర్కొన్నప్పటికీ ఆమె ప్రాక్టీస్ ఆపలేదు. 2025 మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) వేలంలో చోటు దక్కకపోయినా, అంతర్జాతీయ స్థాయిలో తాను నిరూపించుకోవడమే లక్ష్యంగా ముందుకు సాగింది. భారత జట్టుకు కీలక ప్లేయర్ గా ఎదిగింది.
భారత జట్టులో ప్రతికా రికార్డులు
ప్రతీకా రావల్ అద్భుతమైన ఆటతో భారత జట్టులో కీరోల్ ప్లే చేస్తూ అనేక విజయాలు అందించింది. రికార్డుల మోత మోగించింది.
• కేవలం 8 ఇన్నింగ్స్‌ల్లోనే 500 వన్డే పరుగులు పూర్తి చేసి వేగంగా ఈ ఘనత సాధించిన షార్లెట్ ఎడ్వర్డ్స్ రికార్డును బద్దలు కొట్టింది.
• ఐర్లాండ్‌పై 154 పరుగుల బిగ్ ఇన్నింగ్స్ తో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును గెలుచుకుంది. అలాగే, ఈ సిరీస్ లో అద్బుతమైన ఆటతో మ్యాన్ ఆఫ్ ది సిరీస్ గా నిలిచింది.
• మొత్తం 24 వన్డేల్లో 50.45 సగటుతో 1110 పరుగులు చేసింది. ఇందులో 2 సెంచరీలు, 7 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
• మహిళల వన్డేలో మొదటి 6 మ్యాచ్‌ల్లో అత్యధిక 444 పరుగులు చేసిన రికార్డు ప్రతీకా రావల్ సాధించింది.
2025 మహిళల వరల్డ్ కప్‌లో ప్రతీకా రావల్ కీలక పాత్ర
ప్రతీకా రావల్ ప్రపంచకప్ 2025లో భారత జట్టుకు అద్భుతమైన ఆరంభాలు అందించింది. 6 ఇన్నింగ్స్‌ల్లో 308 పరుగులు చేసింది. 51.33 సగటుతో తన బ్యాటింగ్ ను కొనసాగించింది. న్యూజీలాండ్‌పై 122 పరుగుల సెంచరీ నాక్ తో వరల్డ్ కప్ లో వ్యక్తిగతంగా అత్యధిక పరుగులు సాధించింది.
అయితే, చివరి లీగ్ మ్యాచ్‌లో గాయం కారణంగా సెమీఫైనల్, ఫైనల్ మిస్ అయ్యింది. భారత్ ట్రోఫీ గెలిచిన తరువాత ప్రతీకా రావల్ వీల్‌చెయిర్‌లో జట్టుతో కలిసి వేడుకల్లో పాల్గొని అందరి మనసులు గెలుచుకుంది. 2025 ప్రపంచకప్ గ్రూప్ దశలో భారత్ తరపున అత్యధిక పరుగులు చేసిన ప్లయర్ గా నిలిచింది. ప్రతికా రావల్ చూపిన క్రమశిక్షణ, పట్టుదల, ప్రొఫెషనల్ వైఖరి వల్ల భారత క్రికెట్‌లో స్ఫూర్తిదాయక ప్లేయర్ గా నిలిచింది.