సారాంశం
క్యాబ్ డ్రైవర్ అకౌంట్ లో రూ. 9,000 కోట్లు జమ అయిన ఘటన వెలుగు చూసిన కొన్ని రోజుల తర్వాత, సదరు బ్యాంక్ సీఈఓ ఎస్ కృష్ణన్ తన పదవికి రాజీనామా చేశారు.
తమిళనాడు : తమిళనాడు మర్కంటైల్ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో ఎస్ కృష్ణన్ రాజీనామా చేశారు. గతవారం సంచలనం రేపిన చెన్నైలోని ఒక క్యాబ్ డ్రైవర్ బ్యాంక్ అకౌంట్ లో పొరపాటున రూ. 9,000 కోట్లను జమ అయ్యాయి. ఈ ఘటన వెలుగులోకి వచ్చి వైరల్ గా మారింది. ఆ తరువాత బ్యాంక్ ఆ డబ్బును తిరిగి తీసేసుకుంది. ఈ ఘటన జరిగిన కొన్ని రోజుల తర్వాత.. తాజాగా కృష్ణన్ ఆ పదవికి రాజీనామా చేశారు.
వ్యక్తిగత కారణాల వల్లే రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లు కృష్ణన్ తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. "నా పదవీకాలంలో ఇంకా మూడోవంతు కాలం ఉంది. అయినప్పటికీ వ్యక్తిగత కారణాల వల్ల, నేను బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నాను" అని కృష్ణన్ రాజీనామా లేఖలో పేర్కొన్నారు.
కారు డ్రైవర్ కి పట్టిన అదృష్టం.. అకౌంట్ లో రూ.9వేల కోట్లు జమా.. కానీ అంతలోనే....
కృష్ణన్ సెప్టెంబర్ 2022లో బ్యాంక్ అధిపతిగా బాధ్యతలు స్వీకరించారు. తూత్తుకుడిలోని బ్యాంకు డైరెక్టర్ల బోర్డు గురువారం సమావేశమై ఆయన రాజీనామాను ఆమోదించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ)కి పంపింది. "ఆర్‌బిఐ నుండి మార్గదర్శకాలు/సలహాలు అందే వరకు ఎస్ కృష్ణన్ ఎండీ, సీఈఓగా కొనసాగుతారు. దీనిమీద తొందర్లోనే నిర్ణయం తెలియజేస్తాం" అని బ్యాంక్ ఒక ప్రకటనలో తెలిపింది.
తమిళనాడు మర్కంటైల్ బ్యాంక్ ఖాతాదారుడైన క్యాబ్ డ్రైవర్‌కు రూ.9,000 కోట్లను తప్పుగా జమ చేసిన వారం తర్వాత ఈ పరిణామం చోటు చేసుకుంది.మొదట్లో, క్యాబ్ డ్రైవర్ అది స్కామ్ అనుకున్నాడు. నిజమో, కాదో తెలుసుకోవడానికి తన స్నేహితుడికి రూ. 21,000 మొత్తాన్ని బదిలీ చేశాడు. లావాదేవీ సజావుగా సాగింది. అరగంట వ్యవధిలో, బ్యాంకు అతని ఖాతా నుండి మిగిలిన మొత్తాన్ని డెబిట్ చేసింది.