విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ కాంపిటీటివ్ ఎగ్జామ్‌లో కొందరు చీటింగ్‌కు పాల్పడ్డారు. క్యాండిడేట్లు కాకుండా వారి తరఫున వేరే వారు పరీక్షా కేంద్రంలో ఎగ్జామ్ రాశారు. హర్యానాలోని జిండ్, హిసార్, ఇతర జిల్లాలకు చెందినవారు ఈ నేరానికి పాల్పడ్డారు. ఇప్పటి వరకు ఈ కేసులో కేరళ పోలీసులు ఎనిమిది మందిని అరెస్టు చేశారు. 

న్యూఢిల్లీ: విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ కాంపిటీషన్ ఎగ్జామ్స్ ఇటీవలే జరిగాయి. ఇందులో కూడా చీటింగ్ జరిగినట్టు పోలీసులు గుర్తించారు. దీంతో కేసు ఫైల్ చేసి నిందితులను అరెస్టు చేస్తున్నారు. తాజాగా హర్యానా నుంచి ముగ్గురు నిందితులను కేరళ పోలీసులు అరెస్టు చేశారు. శనివారం ఈ విషయాన్ని అధికారులు వెల్లడించారు.

విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ (వీఎస్‌ఎస్‌సీ) తిరువనంతపురంలో ఉన్నది. ఇది ఇస్రోకు అనుబంధ సంస్థ. లాంచ్ వెహికిల్ డిజైన్, డెవలప్‌మెంట్ ఇక్కడే జరుగుతుంది.

కేరళ పోలీసుల ప్రకారం అరెస్టు చేసిన ఈ వ్యక్తులు పరీక్షా కేంద్రంలో వేరే అభ్యర్థుల తరఫున కూర్చున్నారు. పరీక్షా కేంద్రంలో చీటింగ్‌కు పాల్పడ్డారు. ‘ఈ నెల 20వ తేదీన విక్రమ్ సారాభాయ్ స్పేస్ స్టడీస్ నిర్వహించిన పరీక్షలో వీరు చీటింగ్‌కు పాల్పడ్డారు. పరీక్ష రాయాల్సిన అభ్యర్థుల తరఫున వేరే వ్యక్తులు రాశారు. కొందరు ఈ కొశ్చన్ పేపర్‌ను కాపీ చేశారు. షర్ట్ కింద దాచిపెట్టిన కొన్ని డివైజ్‌లతో ఈ కొశ్చన్ పేపర్‌ను కాపీ చేశారు. కొన్ని అప్లికేషన్లతో వాటిని బయటికి పంపించారు. చెవిలోపల దాచి పెట్టిన హెడ్‌సెట్స్ ద్వారా ఆ ప్రశ్నలకు సమాధానాలు విన్నారు.’ అని ఓ పోలీసు అధికారి తెలిపారు.

Also Read: ఎస్సై ఇంట్లో భారీగా డ్రగ్స్... హైదరాబాద్ లో సైబర్ క్రైమ్ పోలీస్ అరెస్ట్

దర్యాప్తు చేసిన తర్వాత పోలీసులకు నిందితులు హర్యానాలోని జిండ్, హిసార్‌, ఇతర జిల్లాల నుంచి వచ్చి ఈ నేరానికి పాల్పడినట్టు తెలిసింది. ‘కొన్ని ఇన్‌పుట్లతో ఈ రోజు ముగ్గురిని అరెస్టు చేశాం’ అని పోలీసులు తెలిపారు. ఇప్పటి వరకు మొత్తం ఎనిమిది మందిని అరెస్టు చేశారు. ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతున్నది. మరింత సమాచారం తెలియాల్సి ఉన్నది.