చంద్రుడిపై భారత్ విజయవంతంగా అడుగుపెట్టిన నేపథ్యంలో చంద్రుడిపై హక్కులు, వనరులపై అధికారాల మీద చర్చ తెరమీదికి వస్తోంది. 

ఢిల్లీ : చంద్రయాన్ 3 విజయవంతమైన నేపథ్యంలో అనేక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రపంచ దేశాలన్నింటికీ చందమామపై ఆసక్తి ఎక్కువే. అక్కడ ఏముందో అని తెలుసుకోవాలన్న ఉత్సుకతతో వ్యోమనౌకలను పంపుతుంటారు. ఈ నేపథ్యంలోనే ఖగోళంలోని చందమామ, అక్కడి వనరులపై ఎవరికి హక్కులు ఉంటాయి అనే ప్రశ్న తలెత్తుతోంది. అంతర్జాతీయ చట్టాల్లో దీని వివరణ స్పష్టంగా ఉంది. అందరాని చందమామ అందుతున్న వేళలో అక్కడున్న వనరులు మానవాళి మొత్తానికి చెందుతాయని ఈ చట్టాలు చెబుతున్నాయి.

1966లో ఐక్యరాజ్యసమితి అంతరిక్ష పరిశోధనలకు సంబంధించి ఔటర్ స్పేస్ ట్రీటీని తీసుకొచ్చింది. ఈ ఔటర్ స్పేస్ ట్రీటీ ప్రకారం చందమామ, ఇతర ఖగోళ వస్తువుల మీద సార్వభౌమాధికారాన్ని ఏ దేశమూ ప్రకటించుకోకూడదు. ఖగోళ అన్వేషణ అనేది అన్ని దేశాల ప్రయోజనం కోసమే జరగాలి. అయితే ఈ ఐరాస ఒప్పందంలో ప్రభుత్వాల ప్రస్తావన మాత్రమే ఉంది. చందమామ మీద ఏ ప్రాంతంలోనైనా హక్కులను ప్రకటించుకోవచ్చా అన్నదానిమీద స్పష్టత లేదు.

Chandrayaan3: ‘దక్షిణ ధ్రువాన్ని ఎందుకు ఎంచుకున్నామంటే’.. చంద్రయాన్3 ప్రధాన లక్ష్యాన్ని వెల్లడించిన ఇస్రో చీఫ్

ఇది కాస్త వివాదాస్పదంగా ఉండడంతో 1979లో మూన్ అగ్రిమెంట్ తెర మీదకి వచ్చింది. ఈ అగ్రిమెంట్ ప్రకారం చందమామను తమ ఆస్తిగా ఏ అంతర్జాతీయ సంస్థలు, ప్రభుత్వ సంస్థలు, ప్రభుత్వ సంస్థలు, వ్యక్తులు ప్రకటించుకోవడానికి వీల్లేదు. భూములు కబ్జా చేసినట్టుగా చందమామను ఆక్రమించుకుని కాలనీలు ఏర్పాటు చేసుకుని…చందమామ మాదే అనడానికి వీల్లేదు.

ఈ ప్రకారమే చందమామ సమస్త మానవాళి సొత్తని, చందమామ మీద ఉన్న సహజ వనరులు మానవాళి అందరి ఉమ్మడి సొత్తు ఒప్పందం 1984లో అమరులోకి వచ్చింది. అయితే, ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే… ఇప్పటికే చందమామ మీదికి ల్యాండర్లు పంపిన అమెరికా, చైనా, రష్యాలు ఇప్పటికీ ఈ ఒప్పందానికి ఆమోదం తెలపలేదు.

2020లో అంతరిక్ష ఒప్పందానికి కొనసాగింపుగా ఆర్టెమిస్ ఒప్పందాన్ని అమెరికా ప్రతిపాదించింది. ఈ ఒప్పందంలో జపాన్, కెనడా, ఐరోపా దేశాలు భాగస్వాములుగా ఉన్నాయి. చందమామపై ప్రయోగాలను సురక్షితంగా చేపట్టడం దీని ఉద్దేశం. ఇటీవలే భారత్ కూడా ఇందులో చేరింది.