కేంద్ర ప్రభుత్వం కొత్త శిక్షా స్మృతులను తెచ్చే ప్రయత్నం చేస్తున్నది. ప్రస్తుత శిక్షా స్మృతులైన ఐపీసీ, సీఆర్‌పీసీ, ఎవిడెన్స్ యాక్ట్ వంటి వాటి స్థానాల్లో కొత్తవాటిని తీసుకురావడానికి శుక్రవారం లోక్ సభలో మూడు బిల్లుల ప్రవేశపెట్టారు.
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం మూడు సంచలన బిల్లులను తీసుకువచ్చింది. శిక్షా స్మృతులను మారుస్తూ మూడు బిల్లులను శుక్రవారం లోక్ సభలో ప్రవేశపెట్టింది. ఇండియన్ పీనల్ కోడ్, క్రిమినల్ పీనల్ కోడ్, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్‌లను మార్చడానికి భారతీయ న్యాయ సంహిత బిల్లు 2023, భారతీయ నాగరిక్ సురక్షా సంహిత బిల్లు 2023, భారతీయ సాక్ష్య బిల్లు 2023లను మోడీ ప్రభుత్వం ముందుకు తెచ్చింది.
163 ఏళ్ల ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ ), 126 ఏళ్ల క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (సీఆర్‌పీసీ), 151 ఏళ్ల ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్‌లను రద్దు చేసే మూడు బిల్లులను కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రవేశపెట్టారు. ఈ బిల్లులు బ్రిటీషర్లు ఆనవాళ్లను చెరిపేసి.. మరింత ప్రజా కేంద్రకంగా ఉంటాయని వివరించారు. ప్రజల హక్కులు కాపాడటమే ప్రధాన లక్ష్యంగా ఈ బిల్లులు ఉంటాయని తెలిపారు.
‘మన క్రిమినల్ జస్టిస్ సిస్టమ్‌ను ఈ బిల్లులు మారుస్తాయనే హామీ నేను ఇవ్వగలను. ఇక్కడ లక్ష్యం శిక్షించడం కాదు, న్యాయం చేకూర్చడమే ప్రధానం. నేరాలను ఆపే సెంటిమెంట్ తయారు చేయడం కోసం పనిష్మెంట్‌లు ఇస్తారు’ అని అమిత్ షా అన్నారు. బ్రిటీషర్లు రూపొందించిన చట్టాల్లో బానిస ఆనవాళ్లు కనిపిస్తాయని, వారి పాలనను ఎదురించినవారిని శిక్షించడమే లక్ష్యంగా వాటిని తయారు చేశారని అమిత్ షా పేర్కొన్నారు.
ఈ బిల్లులను పరీక్షించడానికి పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి పంపిస్తామని అమిత్ షా తెలిపారు. మహిళలు, పిల్లలపై నేరాలు, హత్యలు, ప్రభుత్వ వ్యతిరేక నేరాలకు తాము ఎక్కవ ప్రాధాన్యత ఇచ్చినట్టు వివరించారు.
Also Read: విపక్షాలు ఇండియా పేరు వాడకుండా ఆదేశించండి.. పిటిషన్ పై సుప్రీంకోర్టు ఏమందంటే?
దేశద్రోహం చట్టం తొలగిస్తూ కొత్త బిల్లులను కేంద్రం ప్రవేశపెట్టింది. అందులోని చాలా భాగాలు వదిలేసినా.. ఉరి శిక్షను మాత్రం కేంద్రం తీసుకుంది. కొత్త బిల్లుల్లో చిన్న చిన్న చోరీలు, చిన్న నేరాలైతే కమ్యూనిటీకి సేవ చేసే శిక్ష వేయాలని బిల్లులో ప్రతిపాదనలు ఉన్నాయి. అలాగే.. వేర్పాటువాదం, సాయుధ తిరుగుబాటు, అధికారాన్ని కూలగొట్టే కార్యకలాపాలు, వేర్పాటువాద చర్యలు, దేశ సార్వభౌమత్వాన్ని, సమైక్యతను, సమగ్రతకు ముప్పు తెచ్చే పనులకు జీవిత కాల ఖైదు శిక్ష పడతుంది. అంతేకాదు, ఈ కొత్త శిక్షా స్మృతులు టెర్రరిస్టు చర్యలనూ నిర్వచించాయి.
