విపక్షాలు తమ కూటమికి ఇండియా పేరును ఉపయోగించుకోవద్దని ఆదేశించాలని కోరుతూ సుప్రీంకోర్టులో ఓ పిటిషన్ ఫైల్ అయింది. ఇది ప్రజలు తప్పుదోవ పట్టించేలా ఉన్నదని పిటిషనర్ పేర్కొన్నారు. ఈ పిటిషన్ పై సుప్రీంకోర్టు ధర్మాసనం మండిపడింది. పిటిషన్ డిస్మిస్ చేసింది. 

న్యూఢిల్లీ: 26 ప్రతిపక్ష పార్టీలు కలిసి కొత్త కూటమిగా ఏర్పడ్డ సంగతి తెలిసిందే. ఈ కూటమికి ఇండియన్ నేషనల్ డెవలప్‌మెంటల్ ఇంక్లూజివ్ అలయెన్స్ అని పేరు పెట్టుకున్నారు. షార్ట్‌గా ఈ పేరును ఇండియా అనే అక్రోనిమ్‌తో పిలుస్తున్నారు. అయితే, ఈ విపక్షాల కూటమి పై దాడి చేయడానికి, తీవ్ర విమర్శలు చేయడానికి ఇండియా పేరు బలమైన అడ్డంకిగా ఉన్నది. ఈ తరుణంలో విపక్షాలు ఇండియా పేరును వినియోగించకుండా ఆదేశాలు జారీ చేయాలని సుప్రీంకోర్టులో ఓ పిటిషన్ ఫైల్ అయింది. ఈ పిటిషన్ పై జస్టిస్ ఎస్ కే కౌల్ సారథ్యంలోని ధర్మాసనం విచారిస్తూ పిటిషనర్ పై మండిపడింది.

ఈ పిటిషన్ కేవలం పబ్లిసిటీ కోసమే దాఖలైందని ధర్మాసనం పేర్కొంది. ‘మీరు ఎవరు? మీరు కోరుకునే ప్రయోజనం ఏమిటీ? ఎన్నికల నిబంధనల ఉల్లంఘన జరిగిందని అనిపిస్తే ఎన్నికల కమిషన్‌ను ఆశ్రయించండి. మీరు కేవలం పబ్లిసిటీ కావాలనుకుంటున్నారు. పూర్తిగా పబ్లిసిటీ కోసమే ఇది’ అని జస్టిస్ కౌల్ పిటిషనర్ పై ఆగ్రహించారు.

అయితే, పిటిషనర్ తనను సమర్థించుకునే ప్రయత్నం చేశారు. తనకు పబ్లిసిటీనే కావాలనుకుంటే మీడియాకు ఇది వరకే ఇంటర్వ్యూలు ఇచ్చేవాడినని అన్నారు. కానీ, తాను అలా చేయలేదని తెలిపారు. ఇండియా పేరును పెట్టుకోవడం నైతికతకు భిన్నంగా ఉంటుందనే పిటిషనర్ వాదనపై స్పందిస్తూ.. తాము రాజకీయాల్లో నైతికతను నిర్దారించలేం అని ధర్మాసనం పేర్కొంది. ఇలాంటి విషయాలపై ప్రజలు తమ సమయాన్ని వృథా చేసుకోవడం బాధాకరమని చెప్పింది.

Also Read: Har Ghar Tiranga : ప్రతీ ఇంటిపై జాతీయ పతాకాన్ని ఎగురవేయండి.. సెల్ఫీ అప్‌లోడ్ చేయండి: దేశ ప్రజలకు మోడీ పిలుపు

ఈ పిటిషన్‌ను పరిగణనలోకి తీసుకోవాలని తాము అనుకోవడం లేదని, అయితే, పిటిషనర్ ఇప్పటికే ఎన్నికల సంఘం ముందు దరఖాస్తు పెట్టినందును ఈ అంశంలో జోక్యం చేసుకోవబోవడం లేదని ధర్మాసనం వివరించింది. తమ పిటిషన్‌ను ఉపసంహరించాలని పిటిషనర్ కోరిన తరువాత కోర్టు ఆ పిటిషన్‌ను డిస్మిస్ చేసింది.