తమిళనాడు తీవ్రవాదులకు అడ్డాగా మారింది : కేంద్ర మంత్రి సంచలన వ్యాఖ్యలు

First Published 23, Jun 2018, 4:33 PM IST
central minister radhakrishnan shocking comments on tamilnadu
Highlights

తమిళనాడులో బిజెపి ఏకైక ఎంపీగా కొనసాగుతున్న రాధాకృష్ణన్... 

తమిళనాడు రాష్ట్రం అసాంఘిక శక్తులకు అడ్డాగా మారిందని కేంద్ర మంత్రి పోన్ రాధాకృష్ణన్ సంచలన ఆరోపణలు చేశారు. దేశంలో పేట్రేగిపోతున్న ఉగ్రవాదులకు,నక్సలైట్లకు తమిళనాడు ఆశ్రయం కల్పిస్తోందని అన్నారు. ఇంత జరుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం వారి ఏరివేతకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదంటూ విమర్శించారు.

ఇతర దేశాలనుండి భారత్ లోకి అక్రమంగా చొరబడ్డ తీవ్రవాదులు దక్షిణ భారతదేశంలోని తమిళనాడు తమకు సురక్షితమైన ప్రాంతంగా భావిస్తున్నారని ఆయన అన్నారు. ఇక దేశంలో నక్సలైట్లు కూడా తమిళనాడునే తమ నివాసానికి వాడుకుంటున్నారని అన్నారు. తాను ఎప్పటినుండో ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెలుతున్నా తన మాట పట్టించుకోవడం లేదన్నారు. 

 జనావాసాలకు దూరంగా వుండే  కొండప్రాంతాల్లో నక్సలైట్ల శిక్షణా శిబిరాలు యధేచ్చగా జరుగుతున్నట్లు రాధాకృష్ణన్ తెలిపారు. వీరిపై రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదంటూ ఆయన ప్రశ్నించారు. నక్సలైట్లు, మావోయిస్టులు, ముస్లిం తీవ్రవాదులు కొన్ని మీడియా సంస్థల్లోకి చొరబడి దాడులకు దిగాయని, దీంతో ప్రస్తుతం రాష్ట్రంలోని శాంతిభద్రతలు ఏ స్థాయిలో దిగజారాయో అర్థమవుతుందని మంత్రి విమర్శించారు.

అందువల్ల రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడాలని లేనిపక్షంలో ప్రభుత్వానికి అధికారంలో కొనసాగే హక్కులేదని రాధా కృష్ణన్ పేర్కొన్నారు. అయితే బిజెపి నుండి తమిళనాడులో ఏకైక ఎంపీగా కొనసాగుతున్న సోన్ రాధాకృష్ణన్ సొంత రాష్ట్రంపైనే విమర్శలకు దిగడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.

loader