కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల ధర తగ్గించిన కేంద్ర ప్రభుత్వం
కమర్షియల్ గ్యాస్ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల ధరపై రూ. 100 తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ తగ్గిన ధరలు నేటి నుంచి అందుబాటులోకి రానున్నాయి.
గ్యాస్ సిలిండర్ల ధరలు అమాంతం పెరిగిపోతున్నాయి. దీంతో వినియోగదారులు ఇబ్బంది పడుతున్నారు. అయితే కొత్త ఏడాది కానుకగా కమర్షియల్ గ్యాస్ సిలిండర్లు ఉపయోగించే వారికి కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల ధరలు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం నేటి నుంచి అమల్లోకి రానున్నట్టు చెప్పింది.
మే నుంచి ధరల్లో పెరుగుదల..
పెట్రోల్, డీజిల్ తో పాటు గ్యాస్ సిలిండర్ ధరలు గతేడాది మే నుంచి వరుసగా పెరుగుకుంటూ వస్తున్నాయి. అయితే ఆ సమయంలో ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు ముగిసిపోయాయి. ఇక ఎన్నికలు ఇప్పట్లో లేవనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ధరలు పెంచుతోందని ఆరోపణలు వచ్చాయి. ఎన్నికలు ముగిసిన ఆరు నెలల్లోపే గ్యాస్ ధర నాలుగువందల కంటే ఎక్కువగా పెంచింది. దీంతో అందరూ ఇబ్బంది పడ్డారు. పెరిగిన నిత్యవసర వస్తువులతో పాటు ఈ పెట్రోల్, డీజిల్ గ్యాస్ ధరలు కూడా ఎక్కువవడంతో చాలా ఆందోళన చెందారు. ఈ విషయంలో సామాన్యుల నుంచి, ప్రతిపక్షాల నుంచి ఎన్నో విమర్శలు వచ్చాయి. అయినా కేంద్ర ప్రభుత్వం మాత్రం ధరలను తగ్గించేలా నిర్ణయం తీసుకోలేదు. ఇప్పుడు యూపీతో పాటు మరో నాలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు సమీపిస్తుండటంతో సామాన్యులకు ఉపషమనం కలిగించే నిర్ణయం తీసుకుందని నాయకులు ఆరోపిస్తున్నారు.
రూ.100 తగ్గింపు..
గ్యాస్ సిలిండర్ల ధర తగ్గించినా ఇవి సాధారణ వినియోగదారులకు వర్తించదు. కేవలం కమర్షియల్ వినియోగదారుకే వర్తిస్తుంది. అంటే హోటల్, రెస్టారెంట్, బేకరీ వంటి వాటికి, ఇంటి అవసరాలకు కాకుండా ఇతర వ్యాపారాల వినియోగానికి వాడే గ్యాస్ సిలిండర్లన్నీ కమర్షియల్ జాబితా కిందకే వస్తాయి. వీటికి సబ్సిడీ వర్తించదు. ప్రస్తుతం ఈ కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల ధరపై రూ.100 తగ్గించింది. అంటే నేటి నుంచి ఢిల్లీ పట్టణంలో రూ.2004, కోల్‌కత్తా పట్టణంలో రూ. 2,075లకు చెన్నై పట్టణంలో రూ.2134 కు గ్యాస్ సిలిండర్ లభించనుంది. ఇది ఎంతో కొంత వ్యాపారస్తులకు ఊరటనిచ్చే అంశం. ఈ గ్యాస్ సిలిండర్ల ధరలు దీపావళి తరువాత పెంచారు.
ఉత్తరాఖండ్ ఎలక్షన్స్.. కాంగ్రెస్ దూకుడు.. 45 మంది అభ్యర్థుల ఖరారు !
జార్ఖండ్ లో పెట్రోల్ పై రూ.25 తగ్గింపు..
కేంద్ర ప్రభుత్వం ఈరోజు నుంచి కమర్షియల్ గ్యాస్ ధరలు తగ్గించిన విధంగానే మూడు రోజుల క్రితం జార్ఖండ్ ప్రభుత్వం కూడా పెట్రోల్ రేట్లను తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. లీటర్ పెట్రోల్ పై రూ.25 తగ్గింపు చేస్తామని చెప్పింది. అయితే అది సబ్సిడీ రూపంలో అందజేయనున్నట్టు తెలిపింది. అది కూడా కేవలం టూ వీలర్ వినియోగదారులకే అని స్పష్టం చేసింది. ప్రతీ టూ వీలర్ వినియోగదారుడు నెలకు 10 లీటర్ల పెట్రోల్ పై ఈ సబ్సిడీ పొందవచ్చు. ఈ స్కీమ్ జనవరి 26 నుంచి అమల్లోకి తీసుకొస్తామని చెప్పింది. ఇది చాలా మంది పేద వారికి ఉపయోగపడనుంది. అయితే ఈ సబ్సిడీ ఏ విధంగా ఇస్తారనే అంశంపై కూడా ఆ రాష్ట్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ఇప్పడు గ్యాస్ సబ్సిడీ ఎలా అయితే నగదు బదిలీ విధానం ద్వారా అందజేస్తున్నారో ఈ పెట్రోల్ సబ్సిడీ కూడా అదే పద్దతిలో అమలు చేస్తామని చెప్పింది. ముందుగా టూ వీలర్ వినియోగదారుడు బంక్ లో పెట్రోల్ పోయించుకోవాలి. తరువాత ఆ సబ్సిడీ నేరుగా బైక్ ఓనర్ అకౌంట్లో జమ అవుతుంది.