కరోనా పాజిటివ్ వచ్చిన నా కొడుకును హాస్పిటల్‌లో అక్రమంగా నిర్బంధించారు.. ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన తల్లి

విదేశాల నుంచి వచ్చిన తన కొడుకుకు కరోనా పాజిటివ్ వచ్చిందని, అప్పటి నుంచి ఆయనను ఢిల్లీ హాస్పిటల్‌లో అక్రమంగా నిర్బంధించారని ఓ తల్లి ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. ఒమిక్రాన్ పాజిటివ్ వచ్చినట్టు రిపోర్టు కూడా ఇవ్వలేదని, మళ్లీ టెస్టు కూడా చేయడం లేదని ఆరోపించింది. దీనిపై హైకోర్టు స్పందించి వెంటనే టెస్టు చేయాలని, జీనోమ్ సీక్వెన్సింగ్ రిపోర్టు కూడా అందించాలని ఆదేశించింది.
 

my son illegally detained at hospital.. mother says in high court

న్యూఢిల్లీ: కరోనా పాజిటివ్(Coronavirus Positive) వచ్చిన తన కుమారుడిని ఢిల్లీ హాస్పిటల్‌(Delhi Hospital)లో అక్రమంగా నిర్బంధించార(Illegally Detained)ని ఆ తల్లి ఢిల్లీ హైకోర్టు(Delhi High Court)ను ఆశ్రయించింది. డిసెంబర్ 24వ తేదీ నుంచి ఇంకా నిర్బంధంలోనే ఉంచారని, తమకు జీనోమ్ సీక్వెన్సింగ్ రిపోర్టు కూడా అందించలేదని తల్లి ఆరోపించింది. మరోసారి అయినా.. ఆర్టీపీసీఆర్ టెస్టు చేయడం లేదని తెలిపింది. ఇవేమీ చేయకుండా.. తమ కొడుకును హాస్పిటల్‌కే పరిమితం చేస్తున్నారని పేర్కొంది. తమ కొడుకు మైల్డ్ కొవిడ్ ఉన్నదని, కానీ, ప్రైవేట్ హాస్పిటల్ మళ్లీ టెస్టు చేయడం లేదని ఆరోపించింది. దీనిపై ఢిల్లీ హైకోర్టు స్పందించి ఆదేశాలు జారీ చేసింది.

విదేశాల నుంచి వచ్చిన తన 18 ఏళ్ల కొడుకు ఢిల్లీలో ల్యాండ్ కాగానే టెస్టు చేయగా కరోనా పాజిటివ్ వచ్చిందని ఆ తల్లి తెలిపింది. ఆ తర్వాత ఆయనను ఎల్ఎన్‌జేపీ హాస్పిటల్‌లో ఐసొలేషన్‌లో ఉంచారు. తర్వాతి రోజే ఆయనను ఎల్ఎన్‌జేపీ హాస్పిటల్ నుంచి ప్రైవేట్ హాస్పిటల్ ఫోర్టిస్ ఆస్పత్రికి తరలించారు. వైద్యులకు సూచనలకు భిన్నంగా వారు ఆ పేషెంట్‌ను ఫోర్టిస్‌కు తీసుకువెళ్లారు. అక్కడ కూడా తమ కొడుకుకు మళ్లీ టెస్టు చేయడం లేదని, జీనోమ్ సీక్వెన్సింగ్ టెస్టు రిపోర్టు కూడా తమకు అందజేయలేదని తెలిపారు. తమ కొడుకును అక్రమంగా నిర్బంధించారని ఆమె ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఆ టీనేజ్ కుర్రాడికి ఒమిక్రాన్ పాజిటివ్ వచ్చిందని ఢిల్లీ ప్రభుత్వం తరఫున వాదిస్తున్న న్యాయవాది అరుణ్ పన్వార్ తెలిపారు. మరి ఆ రిపోర్టును పేషెంట్‌కు ఎందుకు అందించలేదని న్యాయమూర్తి అను మల్హోత్రా అడిగారు. డిసెంబర్ 29 వివరాల ప్రకారం ఆ యువకుడికి ఒమిక్రాన్ పాజిటివ్ వచ్చినట్టు కేంద్రం తరఫు అడ్వకేట్ భారతి రాజు చెప్పారు. రిపోర్టును ఢిల్లీ ప్రభుత్వానికి చేర్చామని, ఆ తర్వాత విషయం ఆ ప్రభుత్వమే చూసుకుంటుందని వివరించారు.

Also Read: నేటి నుంచి పిల్ల‌ల కోవిడ్ వ్యాక్సినేష‌న్ రిజిస్ట్రేష‌న్స్‌- సెంట్ర‌ల్ హెల్త్ మినిస్ట‌ర్

పేషెంట్‌ను అర్ధంతరంగా ఎల్ఎన్‌జేపీ నుంచి ఫోర్టిస్ హాస్పిటల్‌కు మెడికల్ సూచనలకు విరుద్ధంగా తీసుకువెళ్లారని, కాబట్టి, ఆ రిపోర్టు సకాలంలో వారికి చేరి ఉండకపోవచ్చని అడ్వకేట్ పవార్ అన్నారు. ఢిల్లీ ప్రభుత్వం దగ్గర జీనోమ్ సీక్వెన్సింగ్ రిపోర్ట్ లేదని, బహుశా ఫోర్టిస్ హాస్పిటల్ దగ్గరకు రిపోర్ట్ చేరి ఉండవచ్చని తెలిపారు. వెంటనే ఆ పేషెంట్‌కు ఆర్టీపీసీఆర్ టెస్టు చేయాలని, జీనోమ్ సీక్వెన్సింగ్ రిపోర్టు రహస్య పత్రమేమీ కాదని, వెంటనే అందించాలని అధికారులకు ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. ఆ రిపోర్టును తమకు సమర్పించాలని ఫోర్టిస్ హాస్పిటల్, కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు పంపింది. ఢిల్లీ ప్రభుత్వం గుండా ఆ రిపోర్టును మెయిల్ ద్వారా పేషెంట్‌కు పంపాలనీ ఆదేశించింది.

విదేశాల నుంచి వచ్చే వారికి ఒమిక్రాన్ పాజిటివ్ అని తేలితే.. కఠినమైన ఐసొలేషన్ నిబంధనలు పాటించాలని ఆదేశాలు ఉన్నాయని ఢిల్లీ ప్రభుత్వ కౌన్సెల్ వెల్లడించారు. ఆర్టీపీసీఆర్ టెస్టు రిపోర్ట్ నెగెటివ్ వచ్చేదాకా ఈ నిబంధనలతోనే ఐసొలేషన్‌లో ఉంచాల్సి ఉంటుందని వివరించారు. హాస్పిటల్‌లో ఐసొలేషన్‌లో ఉంచడమంటే.. అక్రమంగా నిర్బంధించడం కాదని ఢిల్లీ తరఫు న్యాయవాది వాదించారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios