Asianet News TeluguAsianet News Telugu

సోనియా కుటుంబం కోసం పదేళ్ల నాటి కార్లు: బుల్లెట్ ప్రూఫ్ కోసం నిరీక్షణ

సోనియా కుటుంబానికి జడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ కింద పదేళ్ల నాటి టాటా సఫారీ ఎస్‌యూవీలు కేటాయించడంపై కాంగ్రెస్ శ్రేణులు మండిపడుతున్నాయి

Center Allotted 10 Years Old TATA Safari SUV for sonia gandhi family
Author
New Delhi, First Published Nov 20, 2019, 4:37 PM IST

కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ కుటుంబసభ్యులకు కేంద్ర ప్రభుత్వం కొద్దిరోజుల క్రితం స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్(ఎస్పీజీ) భద్రతను ఉపసంహరించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వారికి కేటాయించిన వాహనాలపై విమర్శలు వస్తున్నాయి.

సోనియా కుటుంబానికి జడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ కింద పదేళ్ల నాటి టాటా సఫారీ ఎస్‌యూవీలు కేటాయించడంపై కాంగ్రెస్ శ్రేణులు మండిపడుతున్నాయి. ఇవి బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు కావు.

ఎస్పీజీ కేటగిరీ కింద గతంలో సోనియా, ప్రియాంకు రేంజ్ రోవర్, రాహుల్ గాంధీకి ఫార్చునర్ కార్లు ఉండేవి. దీంతో పాటు వీరి పర్యటన జరిగే ప్రాంతాలకు ముందుగానే చేరుకుని ఆ ప్రదేశాన్ని ఎస్పీజీ కమాండోలు తనిఖీ చేసేవారు.

అయితే జడ్ ప్లస్ కేటగిరీ కింద సోనియా కుటుంబసభ్యులకు 100 మంది సీఆర్‌పీఎఫ్ సైనికులు రక్షణగా నిలవనున్నారు. కాగా.. వీరికి బుల్లెట్ ప్రూఫ్ వాహనాలను కేటాయించాలని సీఆర్‌పీఎఫ్ అధికారులు ఇప్పటికే ఎస్‌పీజీని కోరినప్పటికీ ఇంకా వారి నుంచి సమాధానం రాలేదని తెలుస్తోంది. 

Also Read:సోనియా కుటుంబానికి మోడీ షాక్: ఎస్పీజీ భద్రత తొలగింపు

కొద్దిరోజుల క్రితం కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీతో సహా ఆమె కుమారుడు రాహుల్ గాంధీ, కుమార్తె ప్రియాంక గాంధీ వాద్రాలకు ఎస్పీజీ భద్రతను తొలగించింది. దీనికి బదులుగా జడ్‌ప్లస్ క్యాటగిరీ భద్రతను కొనసాగించాలని కేంద్రం నిర్ణయించింది.

దీనికి సంబంధించి ఎస్పీజీ చట్టాన్ని సవరించేందుకు మోడీ ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. దీంతో ప్రధాని నరేంద్రమోడీ మాత్రమే ఎస్పీజీ సెక్యూరిటీ కలిగివున్న వ్యక్తిగా నిలవనున్నారు.

1984లో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీని సొంత అంగరక్షకులే కాల్చి చంపడంతో.. 1985లో నాటి రాజీవ్ సర్కార్ ఎస్పీజీని ఏర్పాటు చేసింది. 1991లో రాజీవ్ గాంధీ దారుణహత్య జరిగిన నాటి నుంచి గాంధీ కుటుంబానికి ఎస్పీజీ స్థాయి భద్రతను కల్పిస్తున్నారు. 

ఈ ప్రత్యేక దళంలో సుశిక్షితులైన 3 వేలమంది దేశ ప్రధాని, మాజీ ప్రధానులు వారి కుటుంబసభ్యులకు రక్షణ కల్పిస్తారు. మనదేశంలో ప్రధాని నరేంద్రమోడీతో పాటు సోనియా, రాహుల్, ప్రియాంకలకు మాత్రమే ఎస్పీజీ భద్రత ఉంది. ఎస్పీజీ భద్రతపై కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహించి.. అవసరం లేనప్పుడు ఆ భద్రతను తొలగిస్తుంది.

Also Read:మహా రాజకీయం: శివసేనకు ఎమ్మెల్యేల తిరుగుబాటు ముప్పు

ప్రస్తుతానికి గాంధీ ఫ్యామిలీకి ఎలాంటి ముప్పు లేదని నిఘా వర్గాల ఇచ్చిన నివేదిక ప్రకారం ఎస్పీజీ భద్రతను తొలగిస్తున్నట్లుగా తెలుస్తోంది. దీనిలో భాగంగా గత ఆగస్టు నెలలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు ఎస్పీజీ భద్రతను ఉపసంహరించారు.

నిఘా వర్గాల సమాచారం ఆధారంగా మన్మోహన్ సింగ్ భద్రతను పున:సమీక్షించిన కేంద్ర హోంశాఖ.. ఆయనకు ఎస్‌పీజీకి బదులు సీఆర్‌పీఎఫ్ భద్రతను కల్పిస్తూ ఆదేశాలు జారీ చేసింది.అయితే మన్మోహన్‌కు జడ్ ప్లస్ సెక్యూరిటీ కొనసాగుతుందని హోంశాఖ వర్గాలు పేర్కొన్నాయి.

Follow Us:
Download App:
  • android
  • ios