ఉత్తరప్రదేశ్ హై స్కూల్, ఇంటర్మీడియెట్ బోర్డు పరీక్షల్లో చీటింగ్ జరగకుండా సీసీటీవీ కెమెరాలు, ఇతర కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయడంతో పరీక్ష రాసే విద్యార్థులు ఎక్కువ మంది డుమ్మా కొడుతున్నారు. ఒక్క మంగళవారం నాడే మ్యాథ్స్ పరీక్ష నాడు 1.7 లక్షల మంది స్టూడెంట్లు ఎగ్జామ్స్ రాయకుండా ఆబ్సెంట్ అయ్యారు.
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో హై స్కూల్, ఇంటర్మీడియెట్ బోర్డు పరీక్షలు జరుగుతున్నాయి. విద్యార్థులు మాల్ ప్రాక్టీస్ చేయకుండా అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. సీసీటీవీ కెమెరాల నెట్‌వర్క్ ఏర్పాటు చేయడం, గట్టి నిఘా వేయడంతో పరీక్షలకూ విద్యార్థులు డుమ్మా కొడుతున్నట్టు అర్థం అవుతున్నది. చీటింగ్‌ను పటిష్టంగా అడ్డుకునే చర్యలు తీసుకుంటూ ఉండటంతో గత వారం నుంచి 6.5 లక్షల మంది విద్యార్థులు పలు పేపర్‌లను రాయకుండా ఆబ్సెంట్ అయ్యారు. మంగళవారం పదో తరగతి మ్యాథ్స్ సబ్జెక్ట్ ఎగ్జామ్ జరిగింది. ఈ ఒక్క పేపర్ రోజే 1.7 లక్షల మంది విద్యార్థులు డుమ్మా కొట్టారంటే అక్కడి పరిస్థితులను అర్థం చేసుకోవచ్చు.
‘ఎడ్యుకేషన్ మాఫియాను అడ్డుకోవడం మేం విజయవంతం అవుతున్నాం. సీసీటీవీ కెమెరాల నెట్‌వర్క్ ఉపయోగించుకుని ప్రభుత్వం పరీక్షా కేంద్రాలపై, సూపరింటెండెంట్లు, రూమ్ ఇన్విజిలేటర్లపై గట్టి నిఘా వేస్తున్నాం’ అని సెకండరీ ఎడ్యుకేషన్ కౌన్సిల్ సెక్రెటరీ దివ్య కాంత్ శుక్లా తెలిపారు.
కఠిన చర్యలు తీసుకోవడం మూలంగానే విద్యార్థులు డుమ్మా కొడుతున్నారనే సంకేతాలు శుక్రవారం నాటి పరీక్షతో వచ్చాయి. ఆ రోజు పదో తరగతి, 12వ తరగతి నుంచి 4.5 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు డుమ్మా కొట్టారు. ఆ రోజు హిందీ పేపర్. ఆ పేపర్ రాయకుండా 4.5 లక్షల మంది విద్యార్థులు ఆబ్సెంట్ అయ్యారు.
12వ తరగతి మ్యాథ్స్ పేపర్ ఎగ్జామ్ రోజున సీసీటీవీలను పరిశీలించడానికి కంట్రోల్ రూమ్‌లో 7,083 మందికి బాధ్యతలు అప్పగించినట్టు హై స్కూల్, ఇంటర్మీడియెట్ ఎడ్యుకేషన్ బోర్డు అధికారులు వెల్లడించారు.
ప్రత్యేకించిన ఫిర్యాదుల ఆధారంగా ఎఫ్ఐఆర్‌లు నమోదు చేసినట్టు అధికారులు వివరించారు. 14 మంది సాల్వర్లు, చాలా మంది నకిలీ అభ్యర్థులు, ఇతరులపై చీటింగ్‌లో ప్రమేయం ఉన్న ఆరోపణలతో కేసు నమోదు చేశారు. మంగళవారం నాటికి 24 మంది విద్యార్థులు (16 మంది పదో తరగతి అబ్బాయిలు, ఏడుగురు పదో తరగతి అమ్మాయిలు, ఒక్క 12వ తరగతి అబ్బాయి) చీటింగ్ చేస్తూ దొరికిపోయారు.
మ్యాథ్స్ పేపర్ నాడు నలుగురు నకిలీ క్యాండిడేట్లు వారణాసిలో పట్టుబడ్డారు.
