ఉద్ధవ్ ఠాక్రే నుంచి శివసేన గుర్తును పొందడంలో సఫలమైన ఏక్‌నాథ్ షిండే ముందుకు ఓ పంచాయితీ వచ్చింది. ప్రస్తుతం ఉద్ధవ్ ఠాక్రేకు కేటాయించిన కాగడా గుర్తునూ తాము పొందడం ఎలాగంటూ బిహార్‌కు చెందిన సమతా పార్టీ షిండేతో భేటీ అయింది. కాగడా గుర్తును తాము పొందడానికి సహకరించాలని కోరింది. 

థానే: మహారాష్ట్రలో శివసేన వర్సెస్ శివసేన ఎపిసోడ్ దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. బాల్ ఠాక్రే స్థాపించిన పార్టీ, ఆ పార్టీ గుర్తు ఇప్పుడు ఉద్ధవ్ ఠాక్రే వద్ద కాకుండా ఏక్‌నాథ్ షిండే వద్దకు చేరాయి. శివసేన పేరు, ఆ పార్టీ గుర్తు విల్లు, బాణం ఏక్‌నాథ్ షిండే వర్గానికే చెందుతాయని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. అలాగే, ఉద్ధవ్ ఠాక్రేకు కాగడా గుర్తునే కొనసాగిస్తున్నట్టు తెలిపింది. తాజాగా, సుప్రీంకోర్టులోనూ షిండేకు అనుకూల నిర్ణయం వచ్చింది.

ఇదంతా ఒక వైపు జరుగుతుండగా ఆసక్తికర విషయం ఒకటి బయటకు వచ్చింది. ఉద్ధవ్ ఠాక్రే నుంచి శివసేన పార్టీ గుర్తును దక్కించుకున్న మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండేను బిహార్‌కు చెందిన సమతా పార్టీ ప్రతినిధులు కలిశారు. ఉద్ధవ్ ఠాక్రే నుంచి తమ పార్టీ గుర్తును చేజిక్కించుకోవడానికి సలహాలు, సూచనలు ఇవ్వాలని, తమకు సహకరించాలని కోరారు. పార్టీ అధ్యక్షుడు ఉదయ్ మండల్ సారథ్యంలోని ప్రతినిధుల బృందం మంగళవారం సాయంత్రం షిండేతో కలిసినట్టు థానేలోని షిండే ఆఫీసు ఓ ప్రకటనలో తెలిపింది.

1994లో బిహార్ సీఎం నితీశ్ కుమార్, దివంగత నేత జార్జ్ ఫెర్నాండేజ్ కలిసి సమతా పార్టీ స్థాపించారు. ఈ పార్టీ ఎన్నికల గుర్తు కాగడ. కానీ, తాజాగా, ఈ కాగడా గుర్తును ఈసీ ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి కేటాయించింది. దీంతో ఈ సింబల్‌ను తాము పొందడానికి సహకరించాలని ఆ పార్టీ నేతలు షిండేను కలవడం గమనార్హం. 

ఠాక్రేకు గతేడాది అక్టోబర్‌లో కాగడా గుర్తు కేటాయించడాన్ని వ్యతిరేకిస్తూ ఈ పార్టీ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. పార్టీ ఎన్నికల గుర్తులను కేటాయించే అధికారం తమకు లేదని కోర్టు ఆ పిటిషన్ కొట్టేసింది.

2004లో సమతా పార్టీని ఈసీ డీరికగ్నైజ్ చేసింది.

Also Read: శివసేన పేరు, గుర్తు వివాదం : షిండేకు ఊరట, ఉద్ధవ్‌కు అక్కడా నిరాశే.. ఈసీ ఆదేశాలపై స్టేకు సుప్రీం నో

గతేడాది కాగడా గుర్తును ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి కేటాయిస్తూ.. ఎన్నికల సంఘం ఈ విధంగా పేర్కొంది. ఈ గుర్తు లిస్టులో ఫ్రీ సింబల్‌గా లేదని, గతంలో రిజర్వ్‌డ్ సింబల్ అని తెలిపింది. ఇప్పుడు డీరికగ్నైజ్‌డ్ (గుర్తింపు కోల్పోయిన) పార్టీకి గతంలో ఎన్నికల గుర్తు అని వివరించింది. అయితే, ఈ సింబల్‌ను ఫ్రీ సింబల్‌గా ప్రకటించాలన్న విజ్ఞప్తి తర్వాత దీన్ని ఠాక్రే వర్గానికి కేటాయిస్తున్నట్టు ఈసీ పేర్కొంది.

పూణె జిల్లాలోని కాస్బా పేఠ్, చించ్వాడ్ అసెంబ్లీ ఉప ఎన్నికలు ఈ నెల 26న పూర్తవుతాయి. అప్పటి వరకు ఉద్ధవ్ ఠాక్రే వర్గం వద్దే గతేడాది కేటాయించిన కాగడా గుర్తు ఉంటుందని ఈసీ తెలిపింది.