ఖలిస్తానీ ఉగ్రవాది హర్‌దీప్ సింగ్ నిజ్జార్‌ను హతమార్చడంలో భారత్ పాత్ర ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో చేసిన ఆరోపణ పెను దుమారం రేపుతోంది.
ఖలిస్తానీ ఉగ్రవాది హర్‌దీప్ సింగ్ నిజ్జార్‌ను హతమార్చడంలో భారత్ పాత్ర ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో చేసిన ఆరోపణ పెను దుమారం రేపుతోంది. భారత్‌పై ఆరోపణలు చేయడమే కాకుండా.. ఒక సీనియర్ భారతీయ దౌత్యవేత్తను కూడా కెనడా బహిష్కరించింది. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో చేసిన ఆరోపణలను భారత్ నేడు ఉదయం ఖండించిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా భారత్‌లోని ఒక కెనడియన్ దౌత్యవేత్తపై బహిష్కరణ వేటు వేసింది. 5 రోజుల్లో దేశం విడిచి వెళ్లాలని కెనడా దౌత్యవేత్తకు భారత్ స్పష్టం చేసింది.
ఈ పరిణామాల నేపథ్యంలో కెనడాకు చెందిన హై కమీషనర్ కెమరూన్ మాకేకు భారత ప్రభుత్వం నోటీసులు ఇచ్చింది. దీంతో కెమరూన్ మాకే ఈరోజు ఢిల్లీలోని సౌత్ బ్లాక్‌లో ఉన్న విదేశాంగ కార్యాలయానికి వచ్చారు. అక్కడ సమావేశం అనంతరం బయటకు వచ్చిన కెమెరూన్ మాకే.. కోపంగా కనిపించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. అందులో కెమెరూన్ మాకే కోపంగా తన కారు వైపు వచ్చారు. ఆ సమయంలో మీడియా మాట్లాడించేందుకు ప్రయత్నించగా.. ఆయన స్పందించలేదు. కారులోకి ఎక్కి గట్టిగా డోర్ వేసుకున్నారు.
Also Raed: భారత్, కెనడాల మధ్య విభేదాలు.. అమెరికా ఏమన్నదంటే?
‘‘భారతదేశంలోని కెనడా హైకమిషనర్‌ను ఈ రోజు పిలిపించి.. భారతదేశంలో ఉన్న ఒక సీనియర్ కెనడా దౌత్యవేత్తను బహిష్కరించాలని భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం గురించి తెలియజేయబడింది’’ అని విదేశాంగ మంత్రిత్వ శాఖ నుండి ఒక ప్రకటన తెలిపింది. భారత్ నుంచి వెళ్లిపోవాలన్న దౌత్యవేత్త ఎవరన్న దానిపై క్లారిటీ లేదు.
‘‘సంబంధిత దౌత్యవేత్తను వచ్చే ఐదు రోజుల్లోగా భారతదేశం విడిచిపెట్టవలసిందిగా కోరబడింది. కెనడియన్ దౌత్యవేత్తలు మా అంతర్గత విషయాలలో జోక్యం చేసుకోవడం, భారత వ్యతిరేక కార్యకలాపాలలో వారి ప్రమేయంపై భారత ప్రభుత్వం పెరుగుతున్న ఆందోళనను ఈ నిర్ణయం ప్రతిబింబిస్తుంది’’ ఆ ప్రకటన పేర్కొంది.
