దేశవ్యాప్తంగా ఆరు రాష్ట్రాల్లో ఏడు స్థానాలకు ఈ రోజు ఉపఎన్నికలు జరుగుతున్నాయి. భిన్న కారణాలతో ఈ బైపోల్స్‌కు ప్రాధాన్యతలు సంతరించుకున్నాయి. అందులోనూ తెలంగాణ, బిహార్ రాష్ట్రాల్లోని ఉపఎన్నికలపైనే ప్రధానంగా దేశ ప్రజల దృష్టి ఉన్నది. నేషనల్ పార్టీ, రీజినల్ పార్టీలకు మధ్య జరుగుతున్న ఈ ఎన్నికలకు సంబంధించిన టాప్ పాయింట్స్ చూద్దాం. 

న్యూఢిల్లీ: ఈ రోజు దేశవ్యాప్తంగా ఆరు రాష్ట్రాల్లో ఏడు స్థానాలకు ఉపఎన్నికలు జరుగుతున్నాయి. ఇందులో తెలంగాణ, బిహర్‌లో జరుగుతున్న బైపోల్స్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఉన్నది. కేసీఆర్ జాతీయ రాజకీయాల ప్రకటన తర్వాత జరుగుతున్న ఉపఎన్నిక కావడం, బిహార్‌లో సీఎం నితీష్ కుమార్ పార్టీ ప్రతిపక్షాలతో చేతులు కలిపిన తర్వాత జరుగుతున్న ఉపఎన్నికలు కావడంతో ఈ రెండు రాష్ట్రాల్లో బైపోల్స్ ప్రతిష్టాత్మకంగా మారాయి.

ముఖ్యంగా ఈ ఉపఎన్నిక నేషనల్ వర్సెస్ రీజినల్ పార్టీల మధ్య టఫ్ ఫైట్‌గా కనిపిస్తున్నది. తెలంగాణ, హర్యానా, ఒడిశా, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రలో ఒక్కో సీటుకు, బిహార్‌లో రెండు స్థానాలకు ఉపఎన్నికలు జరుగుతున్నాయి. తెలంగాణలో టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ, ఒడిశాలో బీజేడీ వర్సెస్ బీజేపీ, యూపీలో సమాజ్‌వాదీ వర్సెస్ బీజేపీ, బిహార్‌లో జేడీయూ ఆర్జేడీల కూటమి వర్సెస్ బీజేపీలుగా పోరు ఉన్నది. హర్యానాలో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్, మహారాష్ట్రలో శివసేన దాదాపు గెలుపు ఖరారుగా చెబుతున్నారు. ఇవి బైపోల్స్ అయినప్పటికీ.. రాష్ట్రాల రాజకీయాల ఆ ఎన్నికల చుట్టే జరుగుతుండటంతో హైప్ పెరిగింది. టాప్ పాయింట్స్ ఓ సారి చూద్దాం.

Also Read: మునుగోడు బై పోల్.. పోలింగ్ జరుగుతున్న వేళ భారీగా నగదు పట్టివేత..

1. తెలంగాణలో రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఫలితంగా ఆయన ప్రాతినిధ్యం వహించిన మునుగోడు నియోజకవర్గానికి ఉపఎన్నిక నిర్వహించాల్సి వచ్చింది. ఇందులో బీజేపీ టికెట్ పై రాజగోపాల్ రెడ్డి, అధికార పార్టీ టీఆర్ఎస్ నుంచి మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి పాల్వయి స్రవంతి బరిలో నిలిచారు.

2. జీహెచ్ఎంసీ ఎన్నికలు, దుబ్బాక, హుజురాబాద్ నియోజకవర్గాల ఉపఎన్నికల్లో సత్ఫలితాలతో బీజేపీ జోష్ మీద ఉన్నది. ఇంతింతై అన్నట్టుగా రాష్ట్రంలో తన స్థానాన్ని పదిలం చేసుకునే ఆరాటంలో ఉన్నది. ఈ తరుణంలో జరుగుతున్న మునుగోడు బైపోల్‌ను బీజేపీ తన ఖాతాలో వేసుకోవాలని తాపత్రయపడుతున్నది. కాగా, ఇటీవలే ప్రాంతీయ పార్టీని జాతీయ పార్టీగా మార్చి జాతీయ రాజకీయాలు చేయాలని భావిస్తున్న టీఆర్ఎస్ ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మునుగోడులో భారీ ఆధిక్యం సాధించి జాతీయ పార్టీకి ప్రజామోదం ఉన్నదనే విషయాన్ని నిరూపించాలని, ఈ విజయమే పునాదిగా జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలని టీఆర్ఎస్ భావిస్తున్నది. ఇక్కడ ఓటమి టీఆర్ఎస్ పార్టీ కీలక ప్రణాళికలకు ప్రతికూలంగా ఉంటుంది. కాబట్టి, టీఆర్ఎస్ పార్టీ ఈ ఎన్నికను కీలకంగా తీసుకుంది.

Also Read: మునుగోడు ఓటర్ల చైతన్యం ... పోలింగ్ బూత్ ల వద్ద భారీ క్యూలైన్లు (వీడియో)

3. తెలంగాణలో మునుగోడు ఉపఎన్నికకు ఉన్న ప్రాధాన్యత బిహార్‌లో జరుగుతున్న మొకామా, గోపాల్‌గంజ్ స్థానాల ఉపఎన్నికలకూ ఉన్నది. ఇందుకు ఆ రాష్ట్రంలో జరిగిన కీలక మార్పులే కారణం. బీజేపీకి చేయిచ్చి ప్రతిపక్షంలోని ఆర్జేడీ, కాంగ్రెస్‌లతో బిహార్ సీఎం పార్టీ జేడీయూ జట్టుకట్టింది. ఈ కొత్త మార్పును ప్రజలు స్వాగతించారనే విషయాన్ని ఈ ఎన్నికలు తేలుస్తాయనేట్టుగా పార్టీల యోచనలు ఉన్నాయి.ఇక్కడ ఆర్జేడీ, బీజేపీలు ప్రాతినిధ్యం వహించిన మొకామా, గోపాల్‌గంజ్‌లకు ఉపఎన్నిక జరుగుతున్నాయి. 

4. హర్యానాలో మాజీ సీఎం భజన్ లాల్ చిన్న కొడుకు, ఆదమ్‌పూర్ ఎమ్మెల్యే కుల్దీప్ బిష్ణోయ్ ఆగస్టులో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరాడు. దీంతో ఈ స్థానానికి ఉపఎన్నిక నిర్వహిస్తున్నారు. ఈ ఎన్నికలో బీజేపీ టికెట్ పై బిష్ణోయ్ కుమారుడు భవ్య పోటీ చేస్తున్నాడు. ప్రత్యర్థిగా కాంగ్రెస్ నుంచి కేంద్ర మాజీ మంత్రి, మూడుసార్లు ఎంపీ, రెండు సార్లు ఎమ్మెల్యేగా చేసిన జయ ప్రకాశ్ బరిలో ఉన్నారు.

5. ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ ఎమ్మెల్యే అరవింద్ గిరి మరణించడంతో గోలా గోరఖ్‌నాథ్ సీటుకు ఉప ఎన్నిక జరుగుతున్నది. ఈ పోటీకి బీఎస్పీ, కాంగ్రెస్ దూరంగా నిలవడంతో సమాజ్‌వాదీ పార్టీ, బీజేపీల మధ్య పోటీగా మారింది. 

Also Read: చిన్నకొండూరులో మొరాయించిన ఈవీఎం: పోలింగ్ కేంద్రంలోనే కూర్చున్న ఓటర్లు

6. ఒడిశాలో బీజేపీ ఎమ్మెల్యే బిష్ణు చరణ్ సేథి మరణించడంతో ధామ్‌నగర్‌లో ఉప ఎన్నిక జరుగుతున్నది. గత అసెంబ్లీ ఎన్నికల్లో విజయం తర్వాత ఈ రీజియన్‌లో రాష్ట్రంలో అధికారంలోని బీజేడీ పట్టు సాధించింది. దీంతో ఇక్కడ బీజేపీకి, బీజేడీకి మధ్య పోటీ రసవత్తరంగా మారింది.

7. మహారాష్ట్రలో ఉద్ధవ్ ఠాక్రే సీఎంగా దిగిపోయాక, శివసేన పార్టీ చీలిపోయాక జరుగుతున్న తొలి ఎన్నిక ఇది. ఆంధేరీ ఈస్ట్‌‌కు ప్రాతినిధ్యం వహించిన శివసేన ఎమ్మెల్యే మరణించడంతో ఆయన భార్య ఈ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. ఈ ఎన్నిక నుంచి బీజేపీ, షిండే శివసేన వర్గం తప్పుకుంది. దీంతో ఉద్ధవ్ ఠాక్రే వర్గం నుంచి పోటీ చేసిన అభ్యర్థి గెలుపు దాదాపు ఖరారైంది.

Also Read: కేఏ పాల్ తో అట్లుంటది ... పరుగు పరుగున మునుగోడు పోలింగ్ బూత్ కు వెళ్లి... (వీడియో))

8. ఇవన్నీ ఉపఎన్నికలే అయినా.. రాష్ట్ర ప్రభుత్వాలను ప్రభావితం చేసేవి కాకపోయినా.. భిన్న కారణాల రీత్యా వీటికి ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఈ ఎన్నికల ఫలితాలు ఆదివారం వెలువడుతాయి.