Farm Laws: పంజాబ్, యూపీలో బీజేపీకి లైన్ క్లియర్!.. విపక్షాలకు నష్టమే?.. ‘మోడీ తరహా నిర్ణయం కాదిదీ’

నరేంద్ర మోడీ 2014లో ప్రధానిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి బీజేపీ బలంగా నిలబడి వాదన చేసిన సంస్కరణలపై వెనక్కి తగ్గింది లేదు. ఏడాది కాలంగా రైతులు ధర్నాలు చేసినా, పలుమార్లు చర్చలు విఫలమైనా కేంద్ర తన వైఖరి మార్చుకోలేదు. కానీ, సాగు చట్టాల రద్దు ప్రకటన ఆయన ప్రభుత్వం ఇప్పటి వరకు వెనుకంజ వేసిన దానిలో చాలా పెద్దదని చెబుతున్నారు. కాగా, ఈ నిర్ణయంతో పంజాబ్, యూపీ ఎన్నికల్లో లైన్ క్లియర్ చేసుకుందని, ఈ నిర్ణయంతో ప్రతిపక్షాలకు లబ్ది చేకూరే అవకాశం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి.
 

by repealing farm laws bjp made line clear for punjab, UP assembly elections

న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి Narendra Modi ఈ రోజు మూడు సాగు చట్టాల(Farm Laws)ను రద్దు(Repeal) చేస్తామని సంచలన నిర్ణయం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇది ఆయన వ్యవహార శైలికి విరుద్ధమైన నిర్ణయమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. తీవ్ర ఆందోళనలు జరిగినా సాధారణంగా ఆయన ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్న దాఖలాలు దాదాపు శూన్యం. 2014లో ఆయన అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆయన వెనుకడుగు(Backtrack) వేసిన అతిపెద్ద విధానపరమైన నిర్ణయం ఇదేనని వివరిస్తున్నారు. రైతులను, ముఖ్యం చిన్న సన్నకారు రైతులను బలోపేతం చేయడానికే ఈ చట్టాలు తెచ్చామని,  కానీ, కొందరిని మెప్పించడంలో విఫలమయ్యామని చెబుతూ ఆయన క్షమాపణలూ చెప్పారు.

ఇలా మోడీ ప్రభుత్వం వెనకడుగు వేసిన సందర్భం 2015లో ఉన్నది. భూ సేకరణ ఆర్డినెన్స్‌ను 2015లో మోడీ ప్రభుత్వ వెనక్కి తీసుకుంది. ఈ ఆర్డినెన్స్ వెనక్కి తీసుకోవాలనే డిమాండ్లు సాగు చట్టాలపై వినిపించినంతగా వ్యక్తం కాలేదు. కానీ, సాగు చట్టాలను వెనక్కి తీసుకోవాలని సుమారు ఏడాది కాలంగా ఢిల్లీ సరిహద్దులో రైతులు ఆందోళనలు చేస్తున్నారు. ఎన్నో దఫాలు చర్చలు జరిగినా.. ప్రభుత్వం తన వైఖరిపై కచ్చితంగా నిలబడింది. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ సాగు చట్టాలను రద్దు చేస్తామని ప్రకటించడం సంచలనమైంది.

Also Read: farm laws repeal: మూడు వ్యవసాయ చట్టాల రద్దు.. సంచలన నిర్ణయం తీసుకున్న ప్రధాని మోదీ

ఈ దెబ్బతో Punjab, Uttar Pradesh Assembly Electionsలో బీజేపీ లైన్ క్లియర్ చేసుకున్నదనీ కొన్ని విశ్లేషణలు వస్తున్నాయి. అటు ఇటుగా మరో మూడు నెలల్లో పంజాబ్, ఉత్తరప్రదేశ్‌లలో అసెంబ్లీ ఎలక్షన్లు జరగనున్నాయి. ఇప్పుడు ఢిల్లీ వద్ద ధర్నా చేస్తున్న రైతుల్లో మెజార్టీ ప్రజలు పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ నుంచే ఉన్నారు. అధికంగా పంజాబ్ నుంచే ఉన్నారు. అలాగే, ఉత్తరప్రదేశ్ పశ్చిమ జిల్లాల్లోనూ రైతు ఆందోళనల ప్రభావం తీవ్రంగా ఉన్నది.

మరోసారి కేంద్రంలో కొనసాగాలంటే అత్యధిక ఎంపీ స్థానాలుండే ఉత్తరప్రదేశ్‌లో పట్టు నిలుపుకోవడం బీజేపీకి చాలా అవసరం. ఇప్పటికే అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు, పర్యటనలు మోడీ సహా పలువురు బీజేపీ సీనియర్ నేతలు చేస్తూనే ఉన్నారు. కానీ, రైతు ఆందోళనలు ఎక్కడ కొర్రీలు పెడతాయో తెలియని పరిస్థితి. తాజా నిర్ణయంతో ఈ సమస్యను బీజేపీ అధిగమించింది. 

Also Read: Farm Laws: మన దేశంలో చట్టాన్ని ఎలా రద్దు చేస్తారో తెలుసా?

కాగా, పంజాబ్‌లో బీజేపీ మిత్రపక్షంగా ఉన్న శిరోమణి అకాలీ దళ్ ఈ సాగు చట్టాల కారణంగా ఎన్‌డీఏ నుంచి వైదొలిగింది. ఇప్పుడు బీజేపీకి అక్కడ పెద్దగా బలం లేకుండా పోయింది. కానీ, మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి సుముఖంగా ఉన్నారు. కానీ, ఆయన కూడా సాగు చట్టాల రద్దు కండీషన్ పెట్టారు. ఎందుకంటే ఆ రాష్ట్రంలో ప్రధానంగా రైతులే ఉన్నారు. సాగు చట్టాల రద్దు నిర్ణయంతో పంజాబ్‌లోనూ బీజేపీ ఎన్నికల్లో దీటుగా ఢీకొనడానికి ఆస్కారం ఏర్పడింది. రైతుల ప్రయోజనాల అంశం కలిసి రావడమే కాదు.. కెప్టెన్ అమరీందర్ బలం కూడా బీజేపీకి ఉపయోగపడనుంది.

తమకు దేశమే అన్నింటికన్నా ప్రధానమని, తమ ప్రభుత్వం రైతుల కోసం ఎన్నో ప్రయోజనాలు తెచ్చిందని, సాగు చట్టాలు అలాంటివే అయినప్పటికీ కొన్ని వర్గాలను సంతృప్తి పరచలేకపోయామని ప్రధాన మంత్రి ఈ రోజు ప్రకటనలో పేర్కొన్నారు. సాగు చట్టాల రద్దు నిర్ణయంతో రైతుల వ్యతిరేకతను అదిగమించడమే కాదు.. వారి మద్దతునూ కూడగట్టే ప్రకటన చేశారు. అయితే, ఈ రద్దు నిర్ణయం వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి కలిసి వస్తుందా? రాదా? అనే విషయం ఇప్పటికైతే చెప్పలేమని విశ్లేషకులు చెబుతున్నారు. కానీ, ప్రతిపక్షాలకు మాత్రం కలిసి రాదనే వివరిస్తున్నారు. సాగు చట్టాల రద్దు నిర్ణయాన్ని తమ విజయంగా ప్రతిపక్షాలు చూపెట్టుకునే ప్రయత్నాలు జరుగుతున్నా.. కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో విపక్షాలకు పెద్దగా మేలు జరుగదనేదే బలమైన వాదనగా వినిపిస్తున్నది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios