ఆధ్యాత్మిక గురువు, రచయిత డాక్టర్ ఆర్. రమణన్ నాయకత్వంలో దేశవ్యాప్తంగా వంద మంది బైకర్లు 'బుల్లెట్స్ ఎగైనెస్ట్ బుల్లెట్స్' అనే వినూత్న యాత్ర మొదలుపెట్టారు.
Kerala to Kashmir Bike Rally : ఉగ్రవాదాన్ని నిరసిస్తూ ర్యాలీలు, నిరసనలు, రాజకీయ ప్రసంగాలు మామూలే. కానీ వీటన్నిటికీ భిన్నంగా ఓ ఆధ్యాత్మిక గురువు, రచయిత డాక్టర్ ఆర్. రమణన్ నాయకత్వంలో దేశవ్యాప్తంగా వంద మంది బైకర్లు 'బుల్లెట్స్ ఎగైనెస్ట్ బుల్లెట్స్' అనే వినూత్న యాత్ర మొదలుపెట్టారు. కేరళలోని కలడి నుండి కాశ్మీర్‌లోని శారదా మందిరం వరకు 3,600 కి.మీ. ప్రయాణం జూన్ 1న ప్రారంభమైంది.
ఇది కేవలం ప్రయాణం కాదు… జాతీయత, ఆధ్యాత్మికతను వ్యక్తం చేయడం. దేశంలో పెరుగుతున్న ఉగ్రవాద ఘటనలకు శాంతియుతంగానే గట్టిగా సమాధానం చెప్పడానికి ఈ బైక్ ర్యాలీ చేపడుతున్నారు.
ఏప్రిల్ 22న పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి దేశాన్ని కుదిపేసింది. ఈ దాాడికి రెండు వారాల ముందు డాక్టర్ రమణన్ కాశ్మీర్‌లో ఉన్నారు. ఆ ఘటన ఆయనను ఎంతగానో కలచివేసింది.. అందుకే ఉగ్రవాదాానికి వ్యతిరేకంగా గళమెత్తి ఏదో ఒకటి చేయాలనుకున్నారు. ఈ ఆవేదనలోంచే 'బుల్లెట్స్ ఎగైనెస్ట్ బుల్లెట్స్' అనే ఆలోచన పుట్టింది. ఇక్కడ 'బుల్లెట్' అంటే తుపాకీ కాదు, హార్లే డేవిడ్‌సన్, రాయల్ ఎన్‌ఫీల్డ్ లాంటి బైక్స్! ఉగ్రవాదపు బుల్లెట్లకు భారతదేశ ప్రేమ, విశ్వాసం, బైక్ బుల్లెట్లతో సమాధానం చెప్పడమే ఈ యాత్ర లక్ష్యం.
'చలో ఎల్‌ఓసి': దేశభక్తి ఉద్యమం
'చలో ఎల్‌ఓసి' అనే వాట్సాప్ గ్రూప్ ద్వారా ఈ యాత్ర చేపడుతున్నారు. కొద్ది రోజుల్లోనే వేలాది మంది దేశభక్తులు వీరి యాత్రకు మద్దతు తెలిపారు. యువత, మహిళలు, వృద్ధులు, రైతులు, ఐటీ ఉద్యోగులు, విద్యార్థులు… ఇలా అన్ని వర్గాల ప్రజలు పాల్గొన్నారు. వీరిలో వంద మందిని ప్రయాణానికి ఎంపిక చేశారు.. ఇందులో 15 మంది మహిళలున్నారు. ఈ యాత్రలో పాల్గొనేవారి వయస్సు 20 నుండి 65 సంవత్సరాల మధ్య ఉంది.
ఈ ప్రయాణానికి ఒక్కొక్కరికి రూ.60,000 ఖర్చవుతున్నా ఎవరూ వెనకాడటంలేదు. ఇది నిధుల సేకరణ కోసం కాదు, స్వచ్ఛమైన దేశభక్తితో చేస్తున్న యాత్ర. అయితే ఈ యాత్రకు రాజకీయ, నైతిక మద్దతు కోసం బిజెపి కేరళ అధ్యక్షుడు రాజీవ్ చంద్రశేఖర్, గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్‌లతో ఈ యాత్ర గురించి చర్చించారు. ఇద్దరూ ఈ యాత్ర చేపడుతున్నవారిని ప్రశంసించి, అవసరమైన మద్దతు ఇస్తామని హామీ ఇచ్చారు. చంద్రశేఖర్ కూడా కొన్ని దశల్లో ఈ యాత్రలో పాల్గొంటానని చెప్పారు.
డాక్టర్ రమణన్ ఈ యాత్రను కేవలం భౌగోళిక ప్రయాణంగా కాకుండా దేశంకోసం సాగే ఆధ్యాత్మిక యాత్రగా భావిస్తున్నారు. ఆది శంకరాచార్యుల జన్మస్థలం కలడి నుండి ప్రారంభమయ్యే ఈ ప్రయాణం భారతదేశం మధ్యలోంచి సాగుతోంది. ఇది కేవలం రోడ్లపై ప్రయాణం కాదు… భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, దేశభక్తితో ముడిపడి ఉంది.
12 రోజులు, 3600 కి.మీ… ఒకే లక్ష్యం
జూన్ 1 నుండి 12 వరకు వంద మంది బైకర్లు అనేక రాష్ట్రాల గుండా ప్రయాణించి కాశ్మీర్‌లోని టీట్వాల్‌లో ఉన్న శారదా మందిరానికి చేరుకుంటారు. ఇది కేవలం శారీరక లేదా యాంత్రిక ప్రయాణం కాదు, ఒక భావజాల ఉద్యమం. ఈ యాత్రకు మణి కార్తీక్ (అధ్యక్షుడు), సుఖన్య కృష్ణ (కార్యదర్శి), సుమేష్ (కోశాధికారి) నాయకత్వం వహిస్తున్నారు.
శాంతియుత హెచ్చరిక
'బుల్లెట్స్ ఎగైనెస్ట్ బుల్లెట్స్' అనేది భారతదేశ ఆధునిక పౌరులు ఇచ్చే శక్తివంతమైన, శాంతియుత సందేశం. తుపాకులు లేకుండా, ధైర్యం, సంస్కారంతో ఉగ్రవాదానికి సమాధానం చెబుతున్న ఈ యాత్రకు దేశవ్యాప్తంగా ప్రశంసలు లభిస్తున్నాయి.
"దేశ వ్యతిరేక శక్తులకు తుపాకులతో కాదు, సంస్కారం, దేశభక్తితో సమాధానం చెప్పాలి" అనే సందేశంతో సాగుతున్న ఈ ఘనమైన యాత్ర దేశ ఐక్యత జెండాను ఎగురవేస్తోంది.
