పులి వచ్చినా బెదరని గేదెలు.. ఐకమత్యంతో, గుంపుగా వెళ్లి దానిపైనే దాడి.. గాయాలతో క్రూర మృగం మృతి.. వీడియో వైరల్
గేదెల గుంపు ఏకంగా పులిపైనే దాడి చేసింది. దీంతో ఆ క్రూర మృగానికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఫారెస్టు అధికారులు వచ్చి, దానికి చికిత్స అందించినా ఫలితం లేకపోయింది. పరిస్థితి విషమించి పులి చనిపోయింది.

సాధారణంగా పులి చూస్తే ఎవరైనా భయపడతారు. జంతువులు కూడా దానికి అతీతమేమీ కాదు. ఆ క్రూరమృగాన్ని చూసే సరికే అవి కూడా ఆమడ దూరం పరిగెడుతాయి. తమ ప్రాణాలను కాపాడుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తాయి. కానీ మహారాష్ట్రలో ఓ వింత ఘటన చోటు చేసుకుంది. పులిని చూసి గేదెల గుంపు ఏ మాత్రం భయపడలేదు. పైగా దానిపైనే దాడి చేసి హతమార్చాయి. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
మహారాష్ట్ర ఫారెస్ట్ ఆఫీసర్లు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ పులి చంద్రపూర్ జిల్లా మూల్ తాలూకాలో ఉన్న కొన్ని గ్రామాల్లో సంచరిస్తోంది. స్థానికులను, జంతువులను భయపెడుతోంది. ఈ క్రమంలో తాజాగా గురువారం కూడా ఎస్ గావ్ గ్రామానికి సమీపంలో ఉన్న పచ్చిక బయళ్లలో పశువులు మేపుతున్న ఓ కాపరిపైకి ఆ మృగం దాడి చేయబోయింది. ఆ సమయంలో అతడి దగ్గర గొడ్డలి ఉంది. దీంతో ఆ కాపరి ఆ ఆయుధంతో ఎదురు తిరిగాడు. దీంతో అది తోకముడుచుకొని వెళ్లిపోయింది.
అనంతరం బెంబాడా గ్రామం పరిధిలోని అడవి ప్రాంతంలోని గడ్డిలో మేస్తున్న ఆవులు, గేదెల గుంపుపై దాడి చేసేందుకు ప్రయత్నించింది. అయితే ఆ సాదు జంతువులన్నీ ఆ పులిని చూసి పారిపోలేదు. కలిసికట్టుగా, ధైర్యంగా నిలబడ్డాయి. గేదెలన్నీ కలిసి పులిపై దాడి చేశాయి. దీంతో దానికి గాయాలు అయ్యాయి. దీనిని అక్కడే ఉన్న పశువుల కాపరులు ఫోన్ల ద్వారా వీడియో తీశారు. అయితే ఈ ఘటనపై సమాచారం అందడంతో ఫారెస్ట్ ఆఫీసర్లు అక్కడికి చేరుకున్నారు. గాయపడిని క్రూర మృగాన్ని చంద్రపూర్ కు తీసుకెళ్లారు. కానీ అక్కడి చికిత్స పొందుతున్న సమయంలోనే పరిస్థితి విషమించడతో రాత్రి చనిపోయింది. కాగా.. పశువులు పులిపై దాడి చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.