BSNL 4G Launch : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒడిశా నుంచి స్వదేశీ 4జీ నెట్‌వర్క్‌ను ప్రారంభించనున్నారు. తద్వారా యూపీలోని 240 గ్రామలతో పాటు మారుమూల, సరిహద్దు ప్రాంతాలకు హై-స్పీడ్ ఇంటర్నెట్ అందుబాటులోకి వస్తుంది. 

BSNL 4G Launch : డిజిటల్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ దిశగా మరో చారిత్రాత్మక అడుగు ముందుకు పడనుంది. రేపు (శనివారం) ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒడిశాలోని ఝార్సుగూడ నుంచి దేశపు మొట్టమొదటి పూర్తి స్వదేశీ 4జీ నెట్‌వర్క్‌ను జాతికి అంకితం చేయనున్నారు. ఇది కేవలం ఒక టెక్నికల్ లాంచ్ మాత్రమే కాదు భారతదేశ స్వదేశీ సామర్థ్యాలకు, డిజిటల్ సంకల్పానికి కొత్త గుర్తింపునిచ్చే క్షణం. ఈ కార్యక్రమాన్ని లక్నోలోని ఇందిరా గాంధీ ప్రతిష్ఠాన్‌లో (ఐజీపీ) ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు… ఇక్కడికి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ రానున్నారు.

ఈ విప్లవాత్మక చొరవతో ఉత్తరప్రదేశ్‌కు పెద్ద ప్రయోజనం చేకూరుతుంది. రాష్ట్రంలోని 240 గ్రామాల్లోని 24 వేల మందికి పైగా ప్రజలు మొదటిసారిగా హై-స్పీడ్ 4జీ సేవలను ఉపయోగించుకోగలుగుతారు.

యూపీలో వేగంగా డిజిటల్ విస్తరణ

బీఎస్ఎన్ఎల్ ప్రకారం… యూపీలో ఇప్పటివరకు 6659 సైట్లలో 4జీ సేవలు ఏర్పాటయ్యాయి. వీటిలో 141 సైట్లు డిజిటల్ భారత్ నిధి (డీబీఎన్) ద్వారా సిద్ధమయ్యాయి, దీనికోసం యోగి ప్రభుత్వం గ్రామసభ భూమిని ఉచితంగా అందుబాటులో ఉంచింది.

  • భారత్-నేపాల్ సరిహద్దులో ఎస్‌ఎస్‌బీకి 68 సైట్లు మంజూరయ్యాయి.
  • చందౌలీ, మీర్జాపూర్, సోన్‌భద్ర వంటి నక్సల్ ప్రభావిత జిల్లాల్లో 2జీ సేవలను 4జీకి అప్‌గ్రేడ్ చేస్తున్నారు.

22 నెలల్లో సిద్ధమైన స్వదేశీ టెక్నాలజీ

సి-డాట్, తేజస్, టీసీఎస్ కలిసి కేవలం 22 నెలల్లోనే పూర్తి స్వదేశీ 4జీ టెక్నాలజీని అభివృద్ధి చేశాయి. దీన్ని సాఫ్ట్‌వేర్ ద్వారా సులభంగా 5జీకి అప్‌గ్రేడ్ చేయవచ్చు. ఈ చొరవతో యూపీతో సహా దేశవ్యాప్తంగా 26,700 కనెక్టివిటీ లేని గ్రామాలకు సేవలు అందుతాయి, 20 లక్షల మందికి పైగా కొత్త వినియోగదారులు ప్రయోజనం పొందుతారు. పూర్తిగా స్వదేశీ 4జీ టెలికాం స్టాక్‌ను అభివృద్ధి చేసి, అమలు చేసిన ఐదో దేశంగా భారత్ నిలిచింది.

 బీఎస్ఎన్ఎల్ పునరాగమనం, ఆర్థిక పటిష్ఠత

చాలాకాలంగా ఇబ్బందులు పడుతున్న బీఎస్ఎన్ఎల్ ఇటీవల అద్భుతంగా పుంజుకుంది.

  • 2024-25 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో ₹262 కోట్లు, నాలుగో త్రైమాసికంలో ₹280 కోట్ల లాభం నమోదు చేసింది.
  • కంపెనీ వార్షిక నష్టం 58% తగ్గి ₹2247 కోట్లకు చేరింది.
  • నిర్వహణ ఆదాయం 7.8% పెరిగి ₹20,841 కోట్లకు చేరింది.
  • EBITDA రెట్టింపై ₹5,396 కోట్లకు, మార్జిన్ 23%కి మెరుగుపడింది.

ఈ స్వదేశీ 4జీ నెట్‌వర్క్ గ్రామీణ, సరిహద్దు ప్రాంతాలకు డిజిటల్ సేవలను అందించడమే కాకుండా, జాతీయ భద్రతను కూడా బలోపేతం చేస్తుంది. ఈ చొరవ ఆత్మనిర్భర్ భారత్ దిశగా ఒక మైలురాయి మాత్రమే కాదు, రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాల్లో అభివృద్ధికి కొత్త మార్గాన్ని కూడా తెరుస్తుందని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు.