ఆమె మెడలో మూడు ముళ్లు పడి కనీసం నెల రోజులు కూడా గడవలేదు. చేతి గోరింటాకు, కాళ్లకు రాసిన పారాణి ఇంకా పోనేలేదు. గుమ్మానికి కట్టిన తోరణాలు ఇంకా పచ్చిగానే ఉన్నాయి. అంతలోనే ఆమె తుది శ్వాస విడిచింది. పదహారు రోజుల పండగనాటు బలవన్మరణానికి పాల్పడింది. ఈ సంఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... తిరుప్పూరు జిల్లా  ఉడు మలైపే విలామరత్తుపట్టికి చెందిన షణ్ముగ వేల్‌, జీవరత్నం దంపతుల కుమారుడు రఘుపతి (32) విండ్‌ మిల్లులో పనిచేస్తు న్నాడు. జనవరి 30న రఘుపతికి పొల్లాచ్చి సమీపం జమీన్‌ఊత్తుకుళికి చెందిన రామసామి అనే కొబ్బరి వ్యాపారి కుమార్తె దీప (18)తో వివాహం జరిగింది. పెళ్లయిన తర్వాత దీప భర్తతోపాటు విలామరత్తుపట్టి అత్తవారింట కాపురానికి వెళ్ళింది.

పెళ్లి జరిగిన పదహారో రోజుకి సరిగ్గా... దీప బలవన్మరణానికి పాల్పడింది. విషయం తెలుసుకున్న దీప తల్లిదండ్రులు హుటాహుటిన ఆమె అత్తారింటికి వెళ్లారు. పెళ్లి కూతురులా తమ ముందు కదలాడిన తమ కుమార్తె... శవంలా మారి కనిపించడంతో ఆమె తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

Also Read పెళ్లిలో డ్యాన్స్ వేస్తూ యువకుడు హఠాన్మరణం...

కాగా.. తమ కుమార్తె ది ఆత్మహత్య కాదని... అత్తింటివారే హత్య చేశారంటూ దీప తండ్రి ఆరోపిస్తున్నాడు. ఈ మేరకు ఆయన పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. తన కుమార్తె.. ఆత్మహత్య చేసుకోవడానికి ముందు కూడా తనతో మాట్లాడిందని.. తాను సంతోషంగా ఉన్నాననే చెప్పిందని ఆయన చెప్పాడు. ఇంతలోనే ఇలా చావు వార్త వినాల్సి వస్తుందని కలలో కూడా ఊహించలేదన్నారు.

తమ కుమార్తె పెళ్లి ఖర్చు కూడా వరుడు కుటుంబీకులే పెట్టుకున్నారని.. నగలు కూడా వాళ్లే పెట్టుకొని పెళ్లి చేశారని చెప్పాడు. అయితే... ఆత్మహత్య చేసుకునేంత పిరికిది తమ కూతురు కాదని వారు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.