ఢిల్లీలోని ఓ విమెన్ కాలేజీలో సమీపంలోని కొందరు దుండగులు గోడ దూకి యువతులను వేధిస్తున్నట్టు తెలిసింది. ఇటీవలే నిర్వహించిన దివాలీ ఫెస్ట్‌లో బయటి నుంచి కొందరు పురుషులు లోనికి వచ్చారని ఓ యువతి వివరించింది. తమ హాస్టల్‌కు కూడా వెళ్లి ఓ బ్రా దొంగిలించి ఊరేగించారని తెలిపింది.
న్యూఢిల్లీ: మహిళా లోకం సాధికారత కోసం ప్రయత్నిస్తూనే వారి భద్రత కోసం పోరాటం చేయాల్సిన దుస్థితిలో ఉన్నది. ఒక వైపు వివక్ష సహజమవ్వడం, పురోభివృద్ధికి అడుగులు వేద్దామంటే చుట్టూ కదలనివ్వని కంచెలు. సాధికారతకు తొలి మెట్టు చదువే. మహిళల కోసం ప్రత్యేకంగా కళాశాలలూ ప్రభుత్వాలు నడుపుతున్నాయి. ప్రైవేటు కాలేజీలూ ఉన్నాయి. కానీ, ఆ మహిళా కాలేజీల్లోనూ భద్రత కరువైంది. సాధికారత అనే విషయాన్ని పక్కనపెట్టి నిరంతరం భయాందోళనలతో గడుపుతున్నామని ఢిల్లీలోని ఓ కాలేజీ విద్యార్థులు చెప్పడం ప్రస్తుతం కలకలం రేపుతున్నది. కాలేజీలోకి గోడ దూకుతున్న ఓ వీడియో ఇప్పుడు వైరల్ అవుతున్నది.
ఢిల్లీలోని మిరండా హౌజ్ కాలేజీ కేవలం మహిళలు మాత్రమే విద్యను అభ్యసించే సంస్థ. ఈ సంస్థలో మహిళల భద్రత గాలికి వదిలిపెట్టినట్టుగానే ఉన్నదనే వార్తలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. ఈ కాలేజీలో అక్టోబర్ 16వ తారీఖు క్యాంపస్‌లో దివాళీ ఫెస్ట్ నిర్వహించారు. ఆ సమయంలో కాలేజీ క్యాంపస్‌లోకి కొందరు దుండగులు అక్రమంగా గోడలు దూకి ఎంటర్ అయ్యారు.
Also Read: అప్పులు సెటిల్ చేయడానికి బాలికల వేలం.. వివాదాలకు పరిష్కారంగా వారి తల్లుల రేప్!
పోలీసులు కూడా వారిని లోనికి అనుమతించడం చూసి తాను ఆశ్చర్యపోయినట్టు ఓ విద్యార్థిని తెలిపింది. కొంత మంది మరీ అభ్యంతరకరంగా కామెంట్లు చేశారని పేర్కొంది. కొందరైతే.. తమ హాస్టల్‌కూ వచ్చారని వివరించింది. ఓ యువతి బ్రాను దొంగిలించారని తెలిపింది. దాన్ని చేతిలో పట్టుకుని కాలేజీ క్యాంపస్‌లో ఊరేగారని పేర్కొంది.
ఆ కాలేజీలో సెకండ్ ఇయర్ చదువుతున్న ఓ విద్యార్థిని ఈ విషయాలు చెబుతూ.. కొందరు పురుషులు ఎప్పుడూ తమపై అసభ్యకరమైన కామెంట్లు చేస్తుంటారని, అభ్యంతరకర స్లోగన్స్ ఇచ్చేవారని వివరించింది. ఇది రోజూ జరిగే తంతుగా మారిపోయిందని పేర్కొంది. ఎప్పుడు ఎవరు ఎటు వైపు నుంచి వచ్చి తమను తాకుతారో అనే భయంతో ఉంటారని తెలిపింది. ఎప్పుడూ తమ శరీరంపై శాలువాలు, ఇతర వస్త్రాలను ధరించుకునే భయంతో వణుకుతూ ఉంటామని వివరించింది. మరీ దారుణమైన విషయం ఏమంటే.. ఈ కాలేజీలో ఉన్నవారందరికీ ఇది చాలా సాధారణ విషయంగా మారిపోయిందని తెలిపింది.
20 ఏళ్లు.. 30 ఏళ్ల క్రితం ఇక్కడ చదువుకున్న వారు కూడా తమ సమస్యలు విని బాధపడ్డారని, వారు కూడా ఇలాంటివన్నీ ఎదుర్కొన్నారని వివరించినట్టు సదరు స్టూడెంట్ తెలిపింది.
