Asianet News TeluguAsianet News Telugu

అప్పులు సెటిల్ చేయడానికి బాలికల వేలం.. అంగీకరించకుంటే వారి తల్లుల రేప్!

రాజస్తాన్‌లోని బిల్వారాలో స్టాంప్ పేపర్‌లపై రాసుకుని అమ్మాయిలను వేలం వేస్తున్న ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ నిబంధనలు పాటించకుంటే ఆ బాలికల తల్లులను రేప్ చేయాలనే ఆదేశాలను కుల పంచాయతీలు ఇచ్చాయి. ఈ కథనాలు రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపాయి. దీనిపై మహిళా కమిషన్లు ఆగ్రహించాయి.
 

girls auction over loan repayment in rajasthan, or rape mothers
Author
First Published Oct 28, 2022, 5:01 PM IST

న్యూఢిల్లీ: రాజస్తాన్‌లోని బిల్వారా జిల్లాలో దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. అక్కడ అప్పులను తిరిగి చెల్లించకుంటే.. వారి కూతుళ్లను స్టాంప్ పేపర్ పై వేలం వేస్తున్నట్టు తెలిసింది. అప్పులు చెల్లించలేని వారి 8 నుంచి 18 ఏళ్ల కూతుళ్లను వేలం వేస్తారని, వారిని వ్యభిచార రొంపిలోకి దింపే బ్రోకర్లు స్టాంప్ పేపర్లపై కొనుగోలు చేస్తారని కథనాలు వచ్చాయి. ఇలా అభం శుభం తెలియని బాలికలను ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ముంబయి, ఢిల్లీ, బయటి దేశాలకూ పంపిస్తున్నట్టు ఆరోపణలు వచ్చాయి. ఒక వేళ కుల పంచాయతీలో ఖరారైన షరతులను అంగీకరించకపోతే.. ఆ వివాదానికి పరిష్కారంగా తల్లుల అత్యాచారాన్ని పేర్కొంటున్నట్టు వార్తలు వచ్చాయి. ఈ వార్తలు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. మహిళలను బానిసలుగా చేసే ఈ విధానాలపై తీవ్ర వ్యతిరేకత వస్తున్నది. ఈ వార్తా కథనాలపై జాతీయ మహిళా కమిషన్ స్పందించింది.

వీటిని దర్యాప్తు చేయడానికి ఎన్‌సీడబ్ల్యూ ఇద్దరు సభ్యులతో ఓ కమిటీ ఏర్పాటు చేసినట్టు వివరించింది. బిల్వారా జిల్లాకు టీమ్‌ను పంపిస్తున్నట్టు వివరించింది. నవంబర్ 1వ తేదీన రాజస్తాన్ సీఎస్, బిల్వారా ఎస్పీని తాను కలువబోతున్నట్టు ఎన్‌సీడబ్ల్యూ చైర్‌పర్సన్ రేకా శర్మ శుక్రవారం తెలిపారు. ఇలాంటి ఘటనలు గత కొన్నేళ్లుగా జరుగుతున్నా.. రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. ఆ గ్రామంలో చాలా వివాదాలకు బాలికలను స్టాంప్ పేపర్ పై వ్యభిచారానికి అమ్మేస్తున్నట్టు కమిషన్ ఆరోపించింది. సంబంధిత సెక్షన్‌లతో ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని డీజీపీకి లేఖ రాసింది. నిందితులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేసింది.

స్టాంప్ పేపర్‌లపై మైనర్ బాలికలను అమ్మేస్తున్నట్టు వచ్చిన కథనాలపై రాజస్తాన్ మహిళా కమిషన్ కూడా రియాక్ట్ అయింది. డీజీపీకి, బిల్వారా కలెక్టర్‌కు నోటీసులు పంపింది. నిజనిర్ధారణ రిపోర్టును వారం రోజుల్లో సమర్పించాలని ఆదేశించింది.

Also Read: అండమాన్‌లో జాబ్ ఫర్ సెక్స్ రాకెట్.. ఇద్దరు ప్రభుత్వ అధికారుల భాగోతం బట్టబయలు

ఈ విషయమై నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా రాజస్తాన్ ప్రభుత్వానికి నోటీసులు పంపింది. బాలికలను స్టాంప్ పేపర్‌లపై అమ్మడం, చివరకు ఆ షరతలను అంగీకరించకుంటే వివాదానికి పరిష్కారంగా ఆ బాలిక తల్లులను అత్యాచారం చేయాలనే ఆదేశాలు కుల పంచాయతీలో ఇస్తున్నారనే విషయంపై సీరియస్ అయింది.

రాజస్తాన్ మంత్రి ప్రతాప్ కచరియవాస్ మాత్రం ఈ కథనాలను కొట్టివేశారు. 

అక్టోబర్ 26న ప్రచురితమైన కొన్ని కథనాలు రాజస్తాన్‌లో కుల పంచాయతీలు ఈ నేరాలకు పాల్పడుతున్నాయని పేర్కొన్నాయి. ఇక్కడ ఏవైనా గొడవలు జరిగితే వారు పోలీసు స్టేషన్‌కు వెళ్లరని, కుల పెద్దల వద్దకు వెళ్లుతారని తెలిపాయి. అక్కడ వారు కొన్ని షరతులు విధిస్తారు. ఆ షరతులను సదరు నిందితులు, బాధితులు అంగీకరించకపోతే.. ఆ బాలికల తల్లులను రేప్ చేయాలనే ఆదేశాలను ఈ పంచాయతీలు వెలువరిస్తాయని రిపోర్ట్ చేశాయి.

Follow Us:
Download App:
  • android
  • ios