Asianet News TeluguAsianet News Telugu

‘ప్రపంచాన్ని గుడ్డిగా అనుసరించం’.. ఇండియాలో ప్రికాషన్ డోసు అందరికీ ఉండకపోవచ్చు

ప్రపంచ దేశాలను భారత్ గుడ్డిగా అనుసరించబోదని బూస్టర్ డోసు పంపిణీపై నేషనల్ షనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆన్ ఇమ్యునైజేషన్ తెలిపింది. స్థానిక సవాళ్లను దృష్టిలో పెట్టుకునే ఆ నిర్ణయం ఉంటుందని స్పష్టంగా ఉన్నది. బూస్టర్ డోసు వేసిన దేశాల్లో కరోనా కేసుల పెరుగుదలలో ఏ మార్పు కనిపించలేదు. దీంతో అన్ని వయస్సుల వారికి ప్రికాషన్ డోసు వేసే విధానాంపై కేంద్రం పునరాలోచనలో పడింది.
 

booster dose may not distribute in india for all ages
Author
New Delhi, First Published Jan 27, 2022, 1:09 PM IST

న్యూఢిల్లీ: బూస్టర్ డోసు(Booster Dose) అందించే విషయమై భారత దేశ ప్రతినిధులు ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) అధికారులతో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. అందులో బూస్టర్ డోసు అందిస్తున్న పలు దేశాల గురించి చర్చించారు. బూస్టర్ డోసు ప్రభావం ఎలా ఉన్నదనే విషయంపై ఆయా దేశాల వివరాలను విశ్లేషించారు. ఈ సమావేశం అనంతరం భారత ఉన్నత అధికారులు ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ కీలక విషయాన్ని వెల్లడించారు. భారత దేశం మిగతా ప్రపంచ దేశాలను గుడ్డిగా అనుసరించబోదని స్పష్టం చేశారు. అన్ని వయసుల వారికీ ప్రికాషన్ డోసు(Precaution Dose) అందించే విధానంపై పునరాలోచన చేస్తున్నట్టు నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆన్ ఇమ్యునైజేషన్ తెలిపింది.

ప్రపంచ ఆరోగ్య సంస్థతో సమావేశం తర్వాత ఓ అధికారి మాట్లాడుతూ, బూస్టర్ డోసును తమ పౌరులకు అందిస్తున్న దేశాలను పరిశీలించామని, రియల్ వరల్డ్ డేటాను విశ్లేషించామని తెలిపారు. ఈ మూడో డోసు ఇచ్చిన దేశాల్లో కరోనా కేసుల పెరుగుదలలో తేడా ఏమీ కనిపించలేదని వివరించారు. అంటే బూస్టర్ కొత్త కేసులను నియంత్రించలేకపోయిందని అభిప్రాయపడ్డారు. ఈ విషయాన్ని పక్కన పెడితే.. తాము మన దేశంలో ఈ అంటువ్యాధి ఎలా ఉన్నదనే విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలని, తమకు అందుబాటులో ఉన్న సైన్సు పరిజ్ఞానాన్ని ఆధారంగా చేసుకుని తమ నిర్ణయాలు తీసుకుంటామని తెలిపారు.

ఈ లోకల్ డేటాతోపాటు ప్రజా ఆరోగ్య నిపుణులూ కరోనా మహమ్మారి వ్యాప్తి తీరుతెన్నులను విశ్లేషిస్తున్నారు. ఆ వైరస్ స్వభావం, కొత్త వేరియంట్ల పరిణామం, రీఇన్ఫెక్షన్లు, టీకా వేసుకున్నాక ఇన్ఫెక్షన్లు వంటి విషయాలను ఆ నిపుణులు పరిశీలిస్తున్నారు. ఈ అంశాలతోపాటు ఇప్పుడు టీకా కేవలం వ్యాధి తీవ్రతను తగ్గించేదైతే చాలదని పేర్కొన్నారు. ఈ వైరస్ ఇతరులకు సోకకుండా ముకుతాడు వేసేలా టీకా ఉండాలని, తద్వారా సామాజిక వ్యాప్తిని నివారించగమని వివరించారు.

భారత దేశం కూడా ఇప్పుడు బూస్టర్ డోసు అందిస్తున్న సంగతి తెలిసిందే. హెల్త్, ఫ్రంట్‌లైన్ వర్కర్లు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న 60 ఏళ్లు పైబడినవారికీ ఈ ప్రికాషన్ డోసు వేస్తున్నారు.

భారత్‌లో కరోనా వైరస్ (Coronavirus) విజృంభణ కొనసాగుతుంది. గత 24 గంటల్లో దేశంలో కొత్తగా 2,86,384 కరోనా కేసులు నమోదయ్యాయి. కిందటి రోజుతో పోలిస్తే కేసుల సంఖ్య కొద్దిగా పెరిగింది. తాజా కేసులతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 4,03,71,500కి చేరింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గురువారం బులిటెన్ విడుదల చేసింది. తాజాగా కరోనాతో 573 మంది మృతిచెందారు. దీంతో దేశంలో మొత్తం కరోనా మరణాల (Corona deaths) సంఖ్య 4,91,700కి చేరింది. తాజాగా కరోనా నుంచి 3,06,357 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు దేశంలో కరోనాను జయించిన వారి సంఖ్య 3,76,77,328కి పెరిగింది. ప్రస్తుతం దేశంలో 22,02,472 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. 

మరోవైపు దేశంలో కరోనా రోజువారి పాజిటివిటీ రేటు 19.59 శాతంగా ఉంది. వీక్లీ పాజిటివిటీ రేట్ 17.75 శాతంగా ఉంది. ఇక, దేశంలో కరోనా రికవరీ రేటు 93.33 శాతం, యాక్టివ్ కేసులు.. 5.46 శాతం, మరణాలు.. 1.22 శాతంగా ఉన్నట్టుగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. 

Follow Us:
Download App:
  • android
  • ios