ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబాను మావోయిస్టులతో సంబంధాల కేసులో నిర్దోషిగా తేలుస్తూ ఆయనకు పడిన జీవిత ఖైదును ఎత్తేస్తూ 2022లో తీర్పు ఇచ్చిన బాంబే హైకోర్టు నాగ్‌పూర్ బెంచ్ న్యాయమూర్తి రోహిత్ దేవ్ తాజాగా రాజీనామా చేశారు. శుక్రవారం ఆయన బహిరంగ కోర్టులో తన రాజీనామాను ప్రకటించడంతో న్యాయవాదులంతా నిర్ఘాంతపోయారు.
ముంబయి: బాంబే హైకోర్టు న్యాయమూర్తి రోహిత్ దేవ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన ఆత్మగౌరవానికి వ్యతిరేకంగా పనిచేయలేను అని పేర్కొంటూ రాజీనామాను ప్రకటించారు. బహిరంగ కోర్టులో శుక్రవారం ఆయన ఈ ప్రకటన చేశారు. దీంతో అందరూ షాక్ అయ్యారు. అనంతరం, ఆ ఆయన కోర్టు ముందు ఉన్న లిస్ట్ అయి ఉన్న కేసులన్నింటినీ డిశ్చార్జ్ చేశారు. ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబా కేసుపై ఆయన గతంలో తీర్పు ఇచ్చి ఉన్నారు. ఆయన తీర్పును సుప్రీంకోర్టు పక్కనపెట్టింది.
కోర్టులో హాజరై ఉన్న న్యాయవాదులను ఉద్దేశించి జస్టిస్ దేవ్ మాట్లాడుతూ.. ‘నేను నా రాజీనామా పత్రాన్ని సమర్పించానని చెప్పడానికి చింతిస్తున్నాను. నా ఆత్మగౌరవానికి వ్యతిరేకంగా నేను పని చేయలేను. మీరంతా హార్డ్ వర్క్ చేయండి’ అంటూ అన్నారు. రాజీనామా చేయడానికి గల కారణాన్ని ఆయన స్పష్టంగా చెప్పలేదు. పలుమార్లు లాయర్లతో కచ్చితత్వంతో, కఠినత్వంతో వ్యవహరించానని, అందుకు క్షమాపణలు కోరుతున్నట్టు పేర్కొన్నారు.
‘కోర్టులో హాజరైన మీ అందరికీ నేను క్షమాపణలు చెబుతున్నాను. మీరు మరింత మెరుపడాలనే మిమ్మల్ని తిట్టాను. అంతేకానీ, ఎవరినీ బాధపట్టాలనే ఉద్దేశం నాకు లేదు. మీరంతా నా కుటుంబం వంటివారే’ అని జస్టిస్ రోహిత్ దేవ్ వివరించారు. ఆయన నిర్ణయంతో న్యాయవాదులంతా షాక్ అయ్యారు. అనంతరం, మొత్తం బోర్డులోని కేసులన్నింటినీ డిశ్చార్జ్ చేశారు. బాంబే హైకోర్టుకు చెందిన నాగ్‌పూర్ బెంచ్‌కు ఆయన సారథ్యం వహిస్తున్నారు.
Also Read: ఇవాళ కాకుంటే రేపు నిజం గెలుస్తుంది: సుప్రీంకోర్టు తీర్పుపై రాహుల్ గాంధీ
2017 జూన్‌లో జస్టిస్ దేవ్‌ను బాంబే హైకోర్టు న్యాయమూర్తిగా అపాయింట్ చేసింది. 2025 డిసెంబర్‌లో ఆయన రిటైర్ కావాల్సి ఉన్నది.
జస్టిస్ రోహిత్ దేవ్ ఇచ్చిన కొన్ని కీలక తీర్పుల్లో ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబా కేసు కూడా ఉన్నది. మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయనే కేసులో ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబాను 2022లో ఆయన నిర్దోషిగా తేలుస్తూ తీర్పు ఇచ్చారు. ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబాకు పడిన జీవిత ఖైదునూ ఆయన ఎత్తేశారు. ఉపా కింద వ్యాలిడ్ శాంక్షన్ లేనందున ఈ విచారణ మొత్తం శూన్యం అని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే, సుప్రీంకోర్టు ఆ తర్వాత నాగ్‌పూర్ బెంచ్ ఆదేశాలను పక్కనపెట్టింది. ఈ కేసును మరోసారి విచారించాలని ఆదేశించింది.
