పాట్నా: కరోనా రోగులు చికిత్స పొందుతున్న వార్డులోనే డెడ్ బాడీ గంటల తరబడి ఉంది. డెడ్ బాడీ మంచంపై ఉండడంతో ఇతర రోగులు భయాందోళనలకు గురయ్యారు. ఈ వార్డులో చికిత్స పొందుతున్న ఓ రోగి కుటుంబసభ్యుడు ఈ తతంగాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ఈ వీడియో వైరల్ గా మారింది. ఈ ఘటన బీహార్ రాష్ట్రంలో చోటు చేసుకొంది.

also read:సిద్దిపేట ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం: ఐసీయూలోనే కరోనా రోగి డెడ్‌బాడీ

బీహార్ రాష్ట్రంలోని నలంద మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో ఆదివారం నాడు కరోనాతో బాధపడుతున్న వ్యక్తి చికిత్స పొందుతూ మరణించాడు. ఆ డెడ్ బాడీని మంచంపైనే వదిలేశారు. మృతదేహాన్ని తీసుకెళ్లలేదు. ఇదే వార్డులో మరో ఏడుగురు రోగులు కూడ ఉన్నారు. 

ఈ మృతదేహం ఉన్న మంచం పక్కనే మరో మహిళా రోగి బెడ్ ఉంది. ఈ విషయాన్ని ఆమె తన కొడుకుకు చెప్పింది. తల్లిని చూసేందుకు వచ్చిన కొడుకు ఈ విషయాన్ని చూసి తన ఫోన్ లో ఈ దృశ్యాలను రికార్డు చేశాడు. 

డెడ్ బాడీ గంటల తరబడి మంచంపై ఉండడం వల్ల ఈ గదిలో చికిత్స పొందుతున్న ఇతర రోగులు భయానికి గురయ్యారని ఆ వీడియోలో అతను చెప్పాడు. డెడ్ బాడీపై సరైన వస్త్రాలు కూడ కప్పలేదు. 

also read:వరుసగా ఆరో రోజు 30 వేలు దాటిన కరోనా కేసులు: ఇండియాలో మొత్తం 11,55,191కి చేరిక

ఇదే ఆసుపత్రిలోని మరో వార్డులో కూడ ఇద్దరు కరోనా పేషెంట్లు మరణిస్తే అలాగే వదిలేశారని ఓ రోగి బంధువు సౌరభ్ గుప్తా ఆరోపించాడు. ఈ వార్డుకు ఆదివారం నుండి ఒక్క డాక్టర్ కూడ రాలేదని ఆయన ఆరోపించారు. ఈ వార్డు నుండి తమ బంధువును పాట్నాలోని ఎయిమ్స్ ఆసుపత్రికి తీసుకెళ్తున్నట్టుగా ఆయన చెప్పారు. 

రోగులకు సరైన వైద్యం అందించడం లేదనే ఆరోపణలను నలంద మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ హీరాలాల్ మాతో ఖండించారు. సోమవారం నాడు ఒక్క రోజే ఐదుగురు మరణించారని ఆయన చెప్పారు. బాన్స్ ఘాట్ స్మ‌శాన‌వాటిక‌లో రాత్రి 8 గంట‌ల త‌ర్వాతే అనుమ‌తి ఉండటంతో వారిని అప్ప‌టివ‌ర‌కు బెడ్ల‌పైనే వ‌దిలేశామ‌న్నారు.. త‌మ ఆస్ప‌త్రిలో మార్చురీ గ‌ది లేద‌ని ఆయన వివరించారు.