పేరు మార్పుతో పని తీరులో మార్పు రాదని బీజేపీ సోషల్ మీడియాలో ఓ వీడియోను పోస్టు చేసింది. విపక్షాల కూటమికి ఇండియాగా పేరు మార్పునకు ఈ వీడియోకు సంబంధం లేదని వ్యాఖ్యానించింది.
న్యూఢిల్లీ: పేరు మార్పుతో పని మారదని విపక్షాలపై పరోక్షంగా బీజేపీ సెటైర్లు వేసింది. ట్విట్టర్ వేదికగా బీజేపీ ఓ వీడియోను షేర్ చేసింది. ఓ స్కూల్ విద్యార్ధి పేరు మార్చుకొన్న కూడ అతనికి పరీక్షల్లో మార్పులు ఆశించిన స్థాయిలో రాలేదు. పేరు మార్చుకోక ముందున్న పరిస్థితే నెలకొంది. పేరు మార్చుకోవడం వల్ల ఉపయోగం లేదు. పనితీరు మారాలని టీచర్ విద్యార్ధికి సలహా ఇస్తారు. పని తీరు మార్చుకొంటేనే ఫలితం మారుతుందని టీచర్ అతనికి సూచించారు. ఈ వీడియో చివరలో యూపీఏ పేరును ఇండియాగా మార్పు చేసిన అంశానికి సంబంధం లేదని కూడ పేర్కొంది.
గత నెలలో బెంగుళూరులో విపక్ష పార్టీలు రెండు రోజుల పాటు సమావేశమయ్యాయి. ఈ సమావేశంలో విపక్ష కూటమి పేరును ఇండియాగా మార్చాయి. విపక్ష పార్టీల కూటమికి ఇండియాగా మార్చడంపై ఢిల్లీ హైకోర్టులో కొందరు పిటిషన్లు కూడ దాఖలు చేశారు.
వచ్చే ఎన్నికల్లో బీజేపీని ఓడించాలని విపక్షాలు కూటమిగా ఏర్పడ్డాయి. విపక్ష పార్టీలను ఏకతాటిపైకి తీసుకువచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ కీలకంగా వ్యవహరించింది. పార్లమెంట్ సమావేశాల్లో కూడ ఈ కూటమి ఐక్యంగా ముందుకు సాగుతుంది.