విపక్షాలపై బీజేపీ ఓ పాటను రూపొందించింది. అవిశ్వాస తీర్మానంపై నరేంద్ర మోడీ చేసిన విమర్శలపై ఓ పాటను రూపొందించింది బీజేపీ.
న్యూఢిల్లీ: విపక్షాలపై బీజేపీ ఓ పాటను రూపొందించింది. ట్విట్టర్ వేదికగా ఈ వీడియోను పోస్టు చేసింది. నరేంద్ర మోడీ ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీ అవిశ్వాసం ప్రతిపాదించింది. ఈ నెల 8వ తేదీ నుండి 10వ తేదీ వరకు అవిశ్వాసంపై చర్చ జరిగింది. అవిశ్వాసంపై విపక్షాలకు ప్రధాని మోడీ గురువారంనాడు లోక్ సభలో సమాధానం ఇచ్చారు. విపక్షాలపై పదునైన విమర్శలు చేశారు. మోడీ ప్రసంగంలో విపక్షాలపై చేసిన విమర్శలను ఆధారంగా చేసుకుని బీజేపీ ఓ పాటను రూపొందించింది.ఈ పాటను ట్విట్టర్ వేదికగా పోస్టు చేసింది.
హృదయంలోనే ప్రేమ ఉంటుందని.. ఇది దుకాణంలో దొరకదని బీజేపీ సెటైర్లు వేసింది. తొమ్మిదేళ్ల కాలంలో మోడీ సర్కార్ పేద ప్రజల కోసం అమలు చేసిన పథకాలను ఆ పాటలో ప్రస్తావించారు. అంతేకాదు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ప్రజలకు జరిగిన అన్యాయాల గురించి ప్రస్తావించింది.
అవకాశం దొరికినప్పుడల్లా విపక్షాలపై బీజేపీ విమర్శలు చేస్తుంది. మణిపూర్ అంశంపై ప్రధానమంత్రి నరేంద్రమోడీ లోక్ సభలో ప్రకటన చేయించాలనే ఉద్దేశ్యంతో విపక్షాలు మోడీ సర్కార్ పై అవిశ్వాసం ప్రతిపాదించాయి. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో మణిపూర్ అంశంపై చర్చకు విపక్షాలు పట్టుబడుతున్నాయి. ఈ విషయమై ప్రతి రోజూ పార్లమెంట్ ఉభయ సభల్లో విపక్షాలు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే.