ఢిల్లీలో మున్సిపల్ ఎన్నికలు వాయిదాపై సీఎం అరవింద్ కేజ్రీవాల్ తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో ఆప్ విజయం సాధిస్తుందని తెలిసే కేంద్ర ప్రభుత్వం ఇలాంటి చర్యలు తీసుకుంటోందని ఆరోపించారు. 

న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీ (delhi)లో మున్సిప‌ల్ ఎన్నిక‌లు (muncipal election) వాయిదా వేయొద్ద‌ని సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ (arvind kejriwal) ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ (narendra modi)ని కోరారు. ఎన్నిక‌లు వాయిదా వేడ‌యం ప్రజాస్వామ్యాన్ని బలహీనపరుస్తుందని తెలిపారు. ఈ ఎన్నిక‌ల్లో ఆప్ తీవ్రంగా ప్ర‌భావం చూపుతుంద‌ని గ్రహించే ఈ ఎన్నిక‌లను వాయిదా వేయాల‌ని అనుకుంటున్నార‌ని ఆరోపించారు. 

మే 18తో ఢిల్లీలో మూడు మున్సిప‌ల్ కార్పొరేష‌న్ల పాల‌క మండ‌లి గ‌డువు ముగిసిపోనుంది. అయితే దీని కోసం త్వ‌ర‌లో ఎన్నిక‌లు నిర్వ‌హించాల్సి ఉంది. కానీ మూడు కార్పొరేష‌న్ల‌ను ఏకీకృతం చేసేందుకు బడ్జెట్ సెషన్‌లో బిల్లును తీసుకురావాలని కేంద్రం యోచిస్తోందని, లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ కమ్యూనికేషన్‌ను పోల్ ప్యానెల్ పరిశీలిస్తున్నందున ఎన్నికల షెడ్యూల్ ప్రకటనను వాయిదా వేయాలని నిర్ణయించుకున్నట్లు ఢిల్లీ రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది. ఎన్నిక‌లు నిర్వ‌హించేందుకు ఇంకా త‌గిన స‌మ‌యం ఉంద‌ని చెప్పింది. కాగా ప్ర‌స్తుతం ఈ మూడు మున్సిపల్ కార్పొరేషన్లు (దక్షిణ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్, ఉత్తర ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్, తూర్పు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్) బీజేపీ నియంత్ర‌ణ‌లో ఉన్నాయి. 

ఎన్నిక‌ల వాయిదా విష‌యంలో అర‌వింద్ కేజ్రీవాల్ స్పందించారు. ‘‘ ప్రజలు ఈ చర్యను ప్రశ్నిస్తున్నారు. కేంద్రంలో ఏడెనిమిదేళ్ల నుంచి బీజేపీ అధికారంలో ఉంది. అప్ప‌టి నుంచి ఎందుకు (ఏకీకరణ) చేయలేదు ’’ అని కేజ్రీవాల్ ప్రశ్నించారు. ఢిల్లీలో ఆప్‌ వేవ్‌ ఉందని, ఎన్నికల్లో ఓడిపోతామని బీజేపీకి తెలుసు. అందుకే ఇలాంటి నిర్ణ‌యాలు తీసుకుంటున్నార‌ని ఆరోపించారు. ‘‘ ఒక వేల రేపు మూడు మున్సిపల్ కార్పొరేషన్లను క్ల‌బ్ చేస్తే వారు అంతా ఒకే ఆఫీసులో కూర్చుంటారు. ఉద్యోగులు దానికి అవసరమైన మార్పులు చేస్తారు. కానీ దీనికి ఎన్నికలను ఎందుకు వాయిదా వేయాలి ? రేపు భారతదేశం పార్లమెంటరీ వ్యవస్థ నుంచి అధ్య‌క్ష తర‌హా పాల‌నకు వెళ్లాలంటే ఎన్నిక‌లు వాయిదా ప‌డ‌తాయా ? రెండు రాష్ట్రాలు క‌లిసి ఒక్క రాష్ట్రంగా ఏర్పడితే ఎన్నికలు వాయిదా పడతాయా ? ఇవి సంబంధం లేని చ‌ర్య‌లు ’’ అని ఆయన వ్యాఖ్యానించారు. 

‘‘ ఎన్నికలు జరగనివ్వండి.. ప్రభుత్వాలు వస్తుంటాయి, పోతాయని నేను ప్రధాని నరేంద్ర మోదీని చేతులు జోడించి కోరుతున్నాను. దేశమే ముఖ్యం తప్ప రాజకీయ పార్టీలు కాదు. ఎన్నికల కమిషన్‌పై ఒత్తిడి చేస్తే, అది సంస్థ‌లు నిర్వీర్యం అవుతాయి. సంస్థ‌లను బలహీనపరచకూడదు. ఇలా చేయ‌డం వ‌ల్ల ప్రజాస్వామ్యం, దేశం బ‌ల‌హీన‌ప‌డుతుంది.’’ అని ఆయ‌న అన్నారు. ఎన్నికలను వాయిదా వేయాలని లేఖ అందిన గంటలోపే రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకుందని ముఖ్యమంత్రి చెప్పారు. ‘‘సంస్థలు అంత తేలికగా నిర్వీర్యం చేయబడితే, అది మన దేశానికి, ప్రజాస్వామ్యానికి తీవ్రమైన ముప్పు’’ అని కేజ్రీవాల్ అన్నారు.

‘‘ నేను రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను, సార్, దయచేసి ఒత్తిడికి గురికావద్దు. మీరు ఎలాంటి ఒత్తిడికి లోనవుతున్నారో నాకు తెలియదు. ED రైడ్ లేదా CBI రైడ్ లేదా ఇన్‌కమ్ ట్యాక్స్ రైడ్, లేదా మరేదైనా కావచ్చు. లేకపోతే ఈ ఏడాది పదవీ విరమణ చేయనున్న రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు పదవీ విరమణ తర్వాత అనుకూలమైన పోస్టింగ్ ఇస్తానని వాగ్దానం చేసి ఉండవచ్చు. అయితే ఏది ఏమైనా సర్ దయచేసి ఒత్తిడికి లేదా అత్యాశకు లోనుకావద్దు” అని కేజ్రీవాల్ అన్నారు.

కాగా, స్థానిక ఎన్నికలను పర్యవేక్షించడం తమ పరిధిలోకి రాదని కేంద్ర ఎన్నికల సంఘం నేడు స్పష్టం చేసింది. ఢిల్లీ మున్సిపల్ ఎన్నికలపై సీపీఐ(ఎంఎల్) నేత చేసిన ట్వీట్‌కు స్పందించి ఈ మేరకు సమాధానం ఇచ్చింది. ఎన్నికలను వాయిదా వేయడాన్ని ఆందోళనకరమైన పరిణామంగా సీపీఐ (ఎంఎల్) నాయకురాలు సుచేతా దే (Sucheta De) అభివర్ణించారు. పోల్ ప్యానెల్ ఒత్తిడితో లొంగకూడదని ఆమె ట్వీట్ చేశారు.