Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణలో విద్యా వికాసానికి మోకాలడ్డుతున్న బీజేపీ - బోయినపల్లి వినోద్ కుమార్

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో విద్యా అభివృద్ధికి అడ్డు ప‌డుతోంద‌ని రాష్ట్ర ప్ర‌ణాళిక సంఘం ఉపాధ్య‌క్షుడు బోయినప‌ల్లి వినోద్ కుమార్ ఆరోపించారు. న‌వోద‌య‌లు, ట్రిపుల్ ఐటీ వంటి విద్యా సంస్థ‌ల‌ను మంజూరు చేయ‌డం లేద‌ని అన్నారు. 

BJP is kneeling for the development of education in Telangana - Boinapalli Vinod Kumar
Author
Hyderabad, First Published Jan 28, 2022, 3:57 PM IST

తెలంగాణ లో విద్యా వికాసానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మోకాలడ్డుతున్నదని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ ఆరోపించారు. రాష్ట్రానికి కొత్తగా విద్యా సంస్థలను మంజూరు చేయడం లేదని అన్నారు. శుక్ర‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో నవోదయ విద్యాలయాలు, కరీంనగర్ లో ట్రిపుల్ ఐ.టీ, హైదరాబాద్ లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ( ఐ.ఐ.ఎస్.ఇ.ఆర్ ), ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ( ఐ.ఐ.ఎం ) వంటి పలు విద్యా సంస్థలు మంజూరు చేయాల‌ని తెలంగాణ ఎప్ప‌టి నుంచో కోరుతోంద‌ని తెలిపారు. అయినా వాటిని కేంద్ర ప్ర‌భుత్వం మంజూరు చేయ‌కుండా రాష్ట్రానికి తీరని అన్యాయం చేస్తుంద‌ని ఆరోపించారు. 

రాష్ట్రం నుంచి నలుగురు బీజేపీ ఎంపీలు ఉన్నా.. విద్యా సంస్థల మంజూరులో తమతో కలిసి రావడం లేదని వినోద్ కుమార్ ఆరోపించారు. క‌నీసం ఈ విష‌యంలో వారు సొంతంగా కూడా ఎలాంటి ప్ర‌య‌త్నాలు చేయ‌డ‌డం లేద‌ని అన్నారు. రాష్ట్రంలో బీజేపీ ఎంపీల వైఖరి ఏమాత్రం ఆమోదయోగ్యంగా లేదని అన్నారు. ఇప్పటికైనా వారు చిత్తశుద్ధితో రాష్ట్రం కోసం కృషి చేయాలని డిమాండ్ చేశారు. పరిపాలనా సౌలభ్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం 33 జిల్లాలను ఏర్పాటు చేసిందని అన్నారు. అయితే కొత్త జిల్లాల్లో జిల్లాకు ఒకటి చొప్పున నవోదయ విద్యాలయం ఏర్పాటు చేయాల్సిన బాధ్య‌త కేంద్ర ప్ర‌భుత్వంపై ఉంద‌ని తెలిపారు. అయితే ఈ విష‌యంలో కేంద్రం స్పందించ‌డం లేద‌ని ఆరోపించారు. రాష్ట్రంలో హైదరాబాద్ లో త‌ప్ప 9 ఉమ్మ‌డి జిల్లాలో నవోదయ విద్యాలయాలు ఉన్నాయ‌ని అన్నారు. కానీ నిబంధ‌న‌ల ప్రకారం.. మరో 23 నవోదయ విద్యాలయాలు రావాల్సి ఉంద‌ని తెలిపారు. కొత్తగా 23 నవోదయలు వ‌స్తే ఎంతో మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు మేలు జ‌రుగుతుంద‌ని అన్నారు. కానీ కేంద్ర ప్ర‌భుత్వ మొండి వైఖ‌రి వల్ల చాలా మంది విద్యార్థుల‌కు అన్యాయం జ‌రుగుతోంద‌ని తెలిపారు. వెంటనే రాష్ట్రంలోని కొత్త జిల్లాలో న‌వోద‌య విద్యాల‌య‌లు, అలాగే క‌రీంగ‌న‌ర్ లో ట్రిపుల్ ఐటీ, ఐ.ఐ.ఎస్.ఈ.ఆర్, ఐ.ఐ.ఎం ఏర్పాటు చేయాల‌ని డిమాండ్ చేశారు. 

షర్మిలది అవగాహన రాహిత్యం- వినోద్ కుమార్..
వైఎస్ఆర్ టీపీ నాయకురాలు షర్మిల రైతు బీమా విషయంలో అవగాహనా రాహిత్యంతో మాట్లాడుతున్నారని వినోద్ కుమార్ ఆరోపించారు. వాస్త‌వాలు తెలుసుకొని మాట్లాడాల‌ని సూచించారు. తెలంగాణ ప్ర‌భుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు బంధు, రైతు బీమా ప‌థ‌కాలు విజయవంతంగా కొన‌సాగుతున్నాయ‌ని తెలిపారు. సీఎం కేసీఆర్ ఎల్ ఐసీని ఒప్పించి రైతు బీమా ప‌థ‌కాన్ని అమ‌లు చేస్తున్నార‌ని చెప్పారు. ఆ సంస్థ‌ల నిబంధ‌న‌ల ప్ర‌కారం 60 ఏళ్ల లోపు ఉన్న వారికే బీమా సౌకర్యం ఉందని వ‌ర్తిస్తుంద‌ని తెలిపారు. కేంద్రం, వివిధ రాష్ట్రాలు అమ‌లు చేస్తున్న బీమా ప‌థ‌కాలు అన్నీ 60 ఏళ్ల లోపు ఉన్న వారికే వ‌ర్తిస్తున్నాయ‌న్న విష‌యం శ‌ర్మిల‌కు తెలియదా అని ప్ర‌శ్నించారు. ఇంత గొప్ప ప‌థ‌కాలను మెచ్చుకోవాల్సింది పోయి విమర్శించ‌డం స‌రికాద‌ని వినోద్ కుమార్ అన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios