Chennai: యావత్ దేశ సంక్షేమం కొద్దిమంది సంక్షేమానికే పరిమితమైందని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ అన్నారు. ప్రభుత్వ యాజమాన్యంలోని ఎయిరిండియాను ఇప్పుడు ప్రైవేటీకరించారని తెలిపారు. భారతదేశం అంతటా విమానాశ్రయాలు, ఓడరేవులు ప్రైవేటు సంస్థల చేతుల్లోకి వెళ్తున్నాయనీ, రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని ప్రధాని మోడీ ఇచ్చిన హామీ నెరవేరనప్పటికీ, పేదలు, అణగారిన వర్గాల జీవన ప్రమాణాలు కూడా మెరుగుపడలేదని స్టాలిన్ అన్నారు.
Tamil Nadu Chief Minister and DMK Chief MK Stalin: తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ తన పోడ్‌కాస్ట్ 'స్పీకింగ్ ఫర్ ఇండియా' మొదటి ఎపిసోడ్ లో పలు అంశాలను ప్రస్తావిస్తూ కేంద్రంలోని బీజేపీ సర్కారుపై తీవ్ర విమర్శలతో విరుచుకుపడ్డారు. యావత్ దేశ సంక్షేమం కొద్దిమంది సంక్షేమానికే పరిమితమైందని అన్నారు. ప్రభుత్వ యాజమాన్యంలోని ఎయిరిండియాను ఇప్పుడు ప్రైవేటీకరించారని తెలిపారు. భారతదేశం అంతటా విమానాశ్రయాలు, ఓడరేవులు ప్రైవేటు సంస్థల చేతుల్లోకి వెళ్తున్నాయనీ, రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని ప్రధాని మోడీ ఇచ్చిన హామీ నెరవేరనప్పటికీ, పేదలు, అణగారిన వర్గాల జీవన ప్రమాణాలు కూడా మెరుగుపడలేదని స్టాలిన్ అన్నారు.
'మతాన్ని బీజేపీ అస్త్రంగా చేసుకుంది'
బీజేపీపై విమర్శలకు పదును పెడుతూ, పార్టీ తన లోపాలను కప్పిపుచ్చుకోవడానికి మతాన్ని ఆయుధంగా తీసుకుందని ఎంకే స్టాలిన్ విమర్శించారు. ప్రజల మతపరమైన మనోభావాల మంటను రెచ్చగొడుతున్నారనీ, దాని మండే జ్వాలల వెచ్చదనాన్ని ఆస్వాదిస్తున్నారని ఆరోపించారు. 2002 గుజరాత్ అల్లర్లను ప్రస్తావిస్తూ, రాష్ట్రంలో బీజేపీ హింస, విద్వేష బీజాలు నాటిందని సీఎం ఆరోపించారు. '2023లో ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్ లో చెలరేగిన మతపరమైన మంటలు మణిపూర్ ను దగ్ధం చేశాయి. హర్యానాలో మతోన్మాదం మంటలు అమాయక ప్రజల ప్రాణాలను, ఆస్తులను బలితీసుకుంటున్నాయన్నాని పేర్కొన్నారు. ఇప్పటికైనా దీనికి ముగింపు పలకకపోతే భారత్ ను, భారతీయులను ఎవరూ కాపాడలేరని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ హెచ్చిరించారు.
భారతదేశ భిన్నత్వం, సమాఖ్య వ్యవస్థ, ప్రజాస్వామ్యానికి ముప్పు వాటిల్లినప్పుడల్లా దానిని కాపాడటానికి డీఎంకే ముందంజలో ఉందని అన్నారు. డీఎంకే దేశానికి ప్రధానమంత్రులను, రాష్ట్రపతిలను అందించిందనీ, చారిత్రక ప్రాముఖ్యత కలిగిన మరో కర్తవ్యం మన ముందుకు వచ్చిందని స్టాలిన్ అన్నారు. వచ్చే ఏడాది జరిగే రాజకీయ పోరాటాన్ని (ఎన్నికలను) ప్రస్తావిస్తూ, ఎవరు అధికారంలోకి రావాలో నిర్ణయించడం కంటే ఎవరు అధికారంలోకి రాకూడదనేదే 2024 ఎన్నికలకు ముఖ్యమని అన్నారు. తొమ్మిదేళ్ల బీజేపీ పాలనలో అనేక కుంభకోణాలు జరిగాయనీ, అవి రాష్ట్రాలను సర్వనాశనం చేశాయన్నారు. జీఎస్టీ రాష్ట్రాల ఆర్థిక హక్కులను హరించివేసిందని తెలిపారు. తమిళనాడు ఆర్థిక స్వయంప్రతిపత్తి హక్కును కోల్పోయిందనీ, జీఎస్టీ పరిహారాన్ని మరో రెండేళ్లు పొడిగించాలని రాష్ట్రాలు పదేపదే విజ్ఞప్తి చేసినా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు.
తమిళనాడు ఏటా పన్నుల ద్వారా కేంద్ర ప్రభుత్వానికి పెద్ద మొత్తంలో నిధులు ఇస్తుందనీ, కేంద్ర ప్రభుత్వానికి పన్నుల ఆదాయంగా చెల్లించే ప్రతి రూపాయికి కేవలం 29 పైసలు మాత్రమే రాష్ట్రానికి తిరిగి వస్తోందన్నారు. "2014 నుంచి గత ఏడాది వరకు మన రాష్ట్రం కేంద్ర ప్రభుత్వానికి చెల్లించిన పన్ను రూ.5 లక్షల 16 వేల కోట్లు. కానీ, దానికి ప్రతిఫలంగా మనకు వచ్చినది 2 లక్షల 8 వేల కోట్ల రూపాయలు మాత్రమే. ప్రతి రాష్ట్రం నుంచి తమకు అందే మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం పూర్తిగా ఇవ్వజాలదని వాదిస్తే, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అది ఎలా సాధ్యం అవుతుందని" ప్రశ్నించారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వ పన్ను నమూనాను తప్పుపట్టారు. బీజేపీ ప్రభుత్వం ప్రతిపక్షాలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందన్నారు.
