మహారాష్ట్రలో కాంగ్రెస్, శివసేన, ఎన్సీపీ కూటమికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అక్కడ జరిగిన ఆరు ఎమ్మెల్సీ ఎన్నికల్లో నాలుగు సీట్లను బీజేపీ కైవసం చేసుకుంది. కాంగ్రెస్, శివసేన పార్టీలు ఒక్కో సీటుతో సరిపెట్టుకున్నాయి. మహారాష్ట్రలో ఈ నెల 10వ తేదీన ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి. ఇందులో నాలుగు స్థానాల్లో పోటీ లేకుండానే గెలుపు ఖరారయ్యాయి. కాగా, ఎన్నికలు జరిగిన రెండు స్థానాలను బీజేపీ గెలుచుకుంది. 

ముంబయి: మహారాష్ట్రలో ప్రతిపక్ష బీజేపీ, అధికార మహావికాస్ అఘాదీల మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదాలు జరుగుతున్న సందర్భంలో ఎమ్మెల్సీ ఎన్నికలు కీలకంగా మారాయి. ఈ ఎన్నికల ఫలితాలపై అన్ని పార్టీలు సహా ప్రజల్లోనూ ఆసక్తి నెలకొంది. ఈ ఎన్నికల ఫలితాలు ఈ రోజు వెలువడ్డాయి. ఇందులో బీజేపీ ఘన విజయం సాధించింది. మొత్తం ఆరు స్థానాలకు గాను నాలుగు స్థానాలను కమలం పార్టీ తన ఖాతాలో వేసుకుంది. దీనిపై కమలం పార్టీ నేతలు, ముఖ్యంగా ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ట్విట్టర్‌లో హర్షాన్ని వ్యక్తం చేశారు.

మహారాష్ట్రలో ఆరు స్థానాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడింది. ఇందులో నాలుగు స్థానాల్లో ఎన్నికల కంటే ముందే గెలుపు ఖరారైంది. నాలుగు స్థానాల్లో పోటీ లేకుండానే గెలుపు తేలిపోయింది. రెండు స్థానాలను బీజేపీ గెలుచుకోగా, కాంగ్రెస్, శివసేన పార్టీలు చెరో స్థానాన్ని గెలుచుకున్నాయి. కాగా, రెండు స్థానాలకు పోటీ జరిగింది. ఈ రెండు స్థానాలనూ బీజేపీ గెలుచుకోవడంతో కమలం పార్టీ శ్రేణుల్లో సంబురాల్లో మునిగిపోయాయి. ఈ ఫలితాలు కాంగ్రెస్, శివసేన, ఎన్సీపీలతో కూడిన అధికార కూటమి మహావికాస్ అఘాదీకి ఘోర ఎదురు దెబ్బ అని బీజేపీ నేతలు అంటున్నారు.

Also Read: MLC Elections | అధికార పార్టీ టీఆర్ఎస్‌లో క్రాస్ ఓటింగ్ క‌ల‌వ‌రం !

ముంబయి నుంచి రెండు స్థానాల్లో ఎన్నికలు జరగకుండానే గెలుపు ఖరారైంది. కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ కొప్పార్కర్ తాను స్వతంత్రంగా వేసిన నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు. దీంతో శివసేన అభ్యర్థి సునీల్ షిండే, బీజేపీ అభ్యర్థి రాజన్ సింగ్ పోటీ లేకుండా గెలిచారు. కాగా, కొల్హాపూర్‌లో బీజేపీ అభ్యర్థి అమల్ మహాదిక్ తన నామినేషన్ వెనక్కి తీసుకోవడంతో కాంగ్రెస్ అభ్యర్థి సతేజ్ పాటిల్ గెలిచారు. ధూలే, నందుర్బార్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి గౌరవ్ వాణి నామినేషన్ ఉపసంహరించుకోవడంతో బీజేపీ అభ్యర్థి అమ్రిష్ పాటిల్ విజయాన్ని కైవసం చేసుకున్నారు.

Scroll to load tweet…

కాగా, నాగ్‌పూర్, అకోలా-బుల్దానా-వాషిం లోకల్ సీట్లకు ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో అధికార, ప్రతిపక్షాల మధ్య ఢీ అంటే ఢీ అన్నట్టుగా పోటీ జరిగింది. ఈ నెల 10వ తేదీన ఎన్నికలు జరిగాయి. ఈ రెండు స్థానాలనూ ప్రతిపక్షంలోని బీజేపీ గెలుచుకుంది. నాగ్‌పూర్ నుంచి బీజేపీ అభ్యర్థి చంద్రశేఖర్ బావంకులే విజయం సాధించారు. చంద్రశేఖర్ బావంకులే బీజేపీ అభ్యర్థి అయినప్పటికీ దేవేంద్ర ఫడ్నవీస్‌కు వైరి శిబిరం అని ఊహాగానాలు ఉన్నాయి. ఈ స్థానంలో మహావికాస్ అఘాదీకి ఎదురుదెబ్బ తగిలింది. ఈ స్థానం నుంచి పోటీ చేయాలని ముందుగా ఖరారు చేసుకున్న కాంగ్రెస్ అభ్యర్థిని బరిలో నుంచి తొలగించారు. మరో అభ్యర్థిని నిలబెట్టారు. ఎన్నికలకు అతి సమీపంలో ఈ మార్పు జరగడంతో బీజేపీకి కలిసి వచ్చింది.

Also Read: ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ జోరు... అసెంబ్లీ ఎన్నికలపై మంత్రి జగదీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

అకోలా ఎమ్మెల్సీ సీటునూ బీజేపీ కైవసం చేసుకుంది. ఈ సీటు గతంలో శివసేన పార్టీకి చెందినది. తాజా ఎమ్మెల్సీ ఎన్నికల్లో శివసేన నుంచి బీజేపీ గెలుచుకున్నట్టు అయింది. ఈ విజయంపై దేవేంద్ర ఫడ్నవీస్ ట్వీట్ చేస్తూ రాష్ట్రంలో బీజేపీకి ఉన్న బలమైన మద్దతును ఈ ఫలితాలు తెలియజేస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.