Asianet News TeluguAsianet News Telugu

ఢిల్లీని ఈశాన్య భారతానికి దగ్గర చేశాం .. ‘‘అద్భుతమైన మిజోరం’’ బీజేపీ లక్ష్యం : నరేంద్ర మోడీ

దేశ రాజధాని ఢిల్లీని ఈశాన్య ప్రాంత ప్రజల దరిదాపుల్లోకి తీసుకెళ్లింది బీజేపీయేనని.. అంటే ఢిల్లీ ఇక దూరం కాదని, ఢిల్లీ మీ గుమ్మం దగ్గరే వుందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు . మిజోరంలో 100 ఆసుపత్రులలో సుమారు 4.5 లక్షల మందికి ఉచిత వైద్యం అందించే ఆయుష్మాన్ భారత్ పథకాన్ని కూడా ప్రధాని ప్రస్తావించారు. 

BJP committed to create marvellous Mizoram, says PM Narendra Modi ksp
Author
First Published Nov 5, 2023, 4:40 PM IST

వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మిజోరం ప్రజలను ఉద్దేశించి ఈరోజు ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగించారు. 2014కు ముందు, మిజోరం వంటి ఈశాన్య రాష్ట్రాలను ప్రజలు శారీరకంగా, మానసికంగా ఢిల్లీకి దూరంగా వుండేవారని భావించారని అన్నారు. బీజేపీ ఈ దూర భావాన్ని గుర్తించిందని..  2014లో ఎన్డీయే ప్రభుత్వంలో భాగంగా అధికారంలోకి వచ్చిన తర్వాత ఈశాన్య రాష్ట్రాల ఆకాంక్షలు, అవసరాలను పరిష్కరించడం, అంతరాన్ని తగ్గించడానికి ప్రాధాన్యతనిచ్చిందని మోడీ పేర్కొన్నారు.

గత తొమ్మిదేళ్లలో 60 సార్లు ఈశాన్య రాష్ట్రాలను సందర్శించిన ఘనత తనకు దక్కిందని.. ఇది కాకుండా పెద్ద ఎత్తున అభివృద్ధి, కనెక్టివిటీ పనులు కూడా భౌతిక దూరాన్ని తగ్గించాయని ప్రధాని గుర్తుచేశారు. దేశ రాజధాని ఢిల్లీని ఈశాన్య ప్రాంత ప్రజల దరిదాపుల్లోకి తీసుకెళ్లింది బీజేపీయేనని.. అంటే ఢిల్లీ ఇక దూరం కాదని, ఢిల్లీ మీ గుమ్మం దగ్గరే వుందని మోడీ తెలిపారు. 

గతంలో మిజోరంను సందర్శించిన సమయంలో రవాణా సదుపాయాలు మెరుగు పరుస్తానిన హామీ ఇచ్చానని ప్రధాని గుర్తుచేశారు. తాము తీసుకున్న చర్యల కారణంగా అన్ని రంగాల్లో మార్పులు చోటు చేసుకున్నాయని.. స్వాతంత్య్రం వచ్చిన 7 దశాబ్ధాల్లో చేయని పనిని రైల్వేలో చేశామని మోడీ తెలిపారు. రోడ్డు మార్గాల విషయానికి వస్తే.. 2013-14 వరకు ఈశాన్య ప్రాంతంలో జాతీయ రహదారుల మొత్తం పొడవు 8,500 కిలోమీటర్లని.. 2022-23లో తాము దానిని రెట్టింపు చేసి 15,700 కిలోమీటర్లకు పెంచామని నరేంద్ర మోడీ గుర్తుచేశారు. 

మిజోరంలో 100 ఆసుపత్రులలో సుమారు 4.5 లక్షల మందికి ఉచిత వైద్యం అందించే ఆయుష్మాన్ భారత్ పథకాన్ని కూడా ప్రధాని ప్రస్తావించారు. దీనికి అదనంగా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి వంటి పథకాల ద్వారా రైతులకు మద్ధతు ఇవ్వడం గురించి కూడా మోడీ పేర్కొన్నారు. దాదాపు 1,75,000 మంది మిజోరం రైతులు ఆర్ధిక సాయం పొందుతున్నారని మోడీ తెలిపారు. పంటల బీమా, నీటిపారుదల, సహజ వ్యవసాయంతో పాటు రైతులు తమ ఉత్పత్తులను మార్కెట్‌కు తీసుకెళ్లడం వంటి అన్ని రంగాల్లో రైతులకు సాధికారత కల్పించేందుకు బీజేపీ కృషి చేస్తోందని ప్రధాని వెల్లడించారు. 

కరోనా సమయంలో పీఎం గరీభ్ కళ్యాణ్ అన్న యోజన పథకం ప్రారంభైందని ఆయన గుర్తుచేశారు. ఈ పథకం కింద గడిచిన మూడేళ్లుగా దేశంలోని 80 కోట్ల మంది పేద ప్రజలకు ఉచిత రేషన్ అందించామని మోడీ తెలిపారు. ఈ పథకాన్ని మరో ఐదేళ్ల పాటు పొడిగించాలని బీజేపీ ప్రభుత్వం నిర్ణయించిందని ఆయన పేర్కొన్నారు. ఏ పేదవాడు ఆకలితో ఉండకూడదని ప్రతి పేదవాడు ఉచిత రేషన్ పొందాలన్నదే తమ ధ్యేయమన్నారు. స్వచ్ఛ భారత్ మిషన్‌లో మిజోరం ప్రజలు చేస్తున్న కృషికి ప్రధాని నరేంద్ర మోడీ ధన్యవాదాలు తెలిపారు. మిజోరంను 100 శాతం ఫంక్షనల్ పబ్లిక్ టాయిలెట్లతో రాష్ట్రంగా మార్చింది మీరేనని.. క్లీన్ అండ్ గ్రీన్ మిజోరంను నిర్మిస్తున్నది మీరేనని ప్రజలను ప్రశంసించారు. 

ప్రతి గ్లోబల్ స్పోర్ట్స్ టోర్నమెంట్‌లో భారతదేశ జెండాను రెపరపలాడిస్తున్న క్రీడాకారుల్లో మిజోరం యువత వుందని మోడీ తెలిపారు. ఈశాన్య భారతదేశంలో క్రీడల పట్ల మక్కువ ఎక్కువని.. ఈ ప్రాంతంలో క్రీడా మౌలిక సదుపాయాలను పెంచడానికి తాము కట్టుబడి వున్నామని ప్రధాని పేర్కొన్నారు. భవిష్యత్తులో యువ క్రీడాకారుల కోసం స్పోర్ట్స్ అకాడమీలు, స్కాలర్‌షిప్‌లను సృష్టించడంపై తాము దృష్టి పెడుతున్నామని నరేంద్ర మోడీ అన్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios