ఐదు రాష్ట్రాల ఎన్నికలు : సెప్టెంబర్ 30న బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ, అభ్యర్ధుల ఎంపికపై చర్చ
ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణ, మిజోరం రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థులను ఖరారు చేసేందుకు భారతీయ జనతా పార్టీ (బిజెపి) కేంద్ర ఎన్నికల కమిటీ సెప్టెంబర్ 30, అక్టోబర్ 1న ఢిల్లీలో కీలక సమావేశాన్ని నిర్వహించనుంది.

ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణ, మిజోరం రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థులను ఖరారు చేసేందుకు భారతీయ జనతా పార్టీ (బిజెపి) కేంద్ర ఎన్నికల కమిటీ సెప్టెంబర్ 30, అక్టోబర్ 1న ఢిల్లీలో కీలక సమావేశాన్ని నిర్వహించనుంది. ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, హోంమంత్రి అమిత్ షాతో పాటు ఎన్నికల కమిటీలోని ఇతర ముఖ్యనేతలు ఈ సమావేశంలో పాల్గొంటారని సంబంధిత వర్గాలు తెలిపాయి. అంతకుముందు బీజేపీ కేంద్ర కార్యాలయంలో సెప్టెంబర్ 13న కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశాన్ని నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ ఎన్నికలపై చర్చించారు.
ఈ సమావేశంలో జేపీ నడ్డా, అమిత్ షాతో పాటు ఎన్నికల కమిటీ సభ్యులు, మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ సహా ఇతర కీలక నేతలు పాల్గొన్నారు. ఆగస్ట్ 17న మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు గాను 39 మందితో బీజేపీ తన తొలి అభ్యర్ధుల జాబితాను విడుదల చేసింది. అలాగే.. సెప్టెంబర్ 25న మరో 39 మందితో రెండవ జాబితాను ప్రకటించింది. ఈ లిస్ట్‌లో కేంద్ర మంత్రులు నరేంద్ర సింగ్ తోమర్, ప్రహ్లాద్ సింగ్ పటేల్‌లకు కూడా స్థానం కల్పించింది. మరో కేంద్ మంత్రి ఫగ్గన్ సింగ్ కులస్తే నివాస్ నుంచి పోటీ చేయనున్నారు.
ALso Read: ఈసారి గెలవాల్సిందే , రాజస్థాన్ ఎన్నికలపై కమలనాథుల ఫోకస్ .. రాత్రంతా షా, నడ్డా భేటీ
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ సమత్ర వ్యూహంతో ముందుకు సాగుతోంది. ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో అన్ని సీట్లు ఏ, బీ, సీ, డీగా వర్గీకరించారు. ఏ వర్గంలో పార్టీలో నిలకడగా మంచి పనితీరు కనబరిచిన స్థానాలు వుంటాయి. బీ కేటగిరీలో బీజేపీ గెలుపు, ఓటములు సమానంగా వున్న సీట్లు వుంటాయి. సీ కేటగిరీలో పార్టీ బలహీనంగా వున్న స్థానాలు వుంటాయి. గడిచిన మూడు ఎన్నికల్లో బీజేపీ ఓడిన స్థానాలను డీ కేటగిరీ కిందకు చేర్చారు.