సారాంశం

ఈసారి ఎట్టి పరిస్ధితుల్లోనూ రాజస్థాన్‌లో జెండా పాతాలని కమలనాథులు భావిస్తున్నారు.  దీనిలో భాగంగా బుధవారం రాత్రి హోంమంత్రి అమిత్ షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలు.. రాజస్థాన్ పార్టీ నేతలతో రాత్రంతా మంతనాలు జరిపారు. 

ఐదేళ్ల క్రితం జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో రాజస్థాన్‌లో భారతీయ జనతా పార్టీ ఓటమి పాలై.. కాంగ్రెస్ పార్టీ గెలిచింది. అయితే ఈసారి ఎట్టి పరిస్ధితుల్లోనూ రాజస్థాన్‌లో జెండా పాతాలని కమలనాథులు భావిస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేసేశారు. హిందీ బెల్ట్‌లో అత్యంత కీలకమైన రాజస్థాన్‌ను ఈసారి వదులుకోకూడదని బీజేపీ నేతలు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్ధుల ఎంపికలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. దీనిలో భాగంగా బుధవారం రాత్రి హోంమంత్రి అమిత్ షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలు.. రాజస్థాన్ పార్టీ నేతలతో రాత్రంతా మంతనాలు జరిపారు. 

దాదాపు ఆరున్నర గంటల పాటు సాగిన ఈ సమావేశంలో అభ్యర్ధుల ఎంపిక, ఎన్నికల ప్రచారంలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించినట్లుగా తెలుస్తోంది. అలాగే రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల బరిలో ఇద్దరు కేంద్ర మంత్రులు నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. వీరిలో కేంద్ర జలశక్తి మంత్రి రాజేంద్ర సింగ్ షెకావత్, న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్‌వాల్ వున్నారు. రాజస్థాన్‌లో బీజేపీకి పట్టున్న మేవాడ్, వాగడ్, సేఖావతి, హడౌతి, మార్‌వార్ ప్రాంతాల్లో బరిలోకి దింపే అభ్యర్ధులు, లోక్‌సభ ఎన్నికలపైనా చర్చించినట్లుగా జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. 

మరోవైపు .. ఎప్పటిలాగే సీఎం అభ్యర్ధి ఎవరన్నది ప్రకటించకుండానే ఎన్నికలకు వెళ్లాలని బీజేపీ నిర్ణయించింది. దీనిపై ఇప్పటికే మాజీ ముఖ్యమంత్రి వసుంధరా రాజేకు కూడా తెలిపినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఒకవేళ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే.. సీఎం రేసులో చాలా మంది పేర్లే వినిపిస్తున్నాయి. వసుంధర రాజేతో పాటు గజేంద్ర సింగ్ షెకావత్, రాజ్యసభ ఎంపీ డాక్టర్ కిరోడి లాల్ మీనా, ఎంపీలు దియా కుమార్, రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్, సుఖ్‌వీర్ సింగ్ జౌన్‌పురియా తదితరులు వున్నారు.