ఫిబ్రవరిలో సీఎస్‌గా బాధ్యతలు.. అంతలోనే, కరోనాతో బీహార్ చీఫ్ సెక్రటరీ కన్నుమూత
వైరస్ బారిన పడి సీనియర్ ఐఏఎస్ అధికారి, బిహార్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) అరుణ్‌కుమార్ సింగ్ కన్నుమూశారు. ఇటీవల కోవిడ్ సోకడంతో ఆయన ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
దేశంలో కరోనా వైరస్ కరాళ నృత్యం చేస్తున్న సంగతి తెలిసిందే. పాజిటివ్‌గా తేలిన వారు చికిత్స కోసం ఆసుపత్రులకు పరిగెత్తుతున్నారు. ఇప్పటికే కోవిడ్ వల్ల లక్షలాది మంది ప్రజలు మరణించారు. వీరిలో పలువురు రాజకీయ నాయకులు, సినీ తారలు, క్రీడాకారులు, వివిధ రంగాల ప్రముఖులు కూడా వున్నారు.
తాజాగా వైరస్ బారిన పడి సీనియర్ ఐఏఎస్ అధికారి, బిహార్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) అరుణ్‌కుమార్ సింగ్ కన్నుమూశారు. ఇటీవల కోవిడ్ సోకడంతో ఆయన ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
Also Read:రెమిడెసివర్ కొరతపై కేంద్రం కీలక నిర్ణయం..
ఈ క్రమంలో శుక్రవారం ఆరోగ్యం విషమించడంతో అరుణ్ ప్రాణాలు విడిచారు. 1985 బ్యాచ్ బిహార్ క్యాడర్‌కు చెందిన అరుణ్ కుమార్... జేడీయూ అధినేత నీతీశ్ కుమార్ నేతృత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఈ ఏడాది ఫిబ్రవరిలోనే ఆయన సీఎస్‌గా నియమితులయ్యారు. గతంలో రాష్ట్రంలోని పలు విభాగాల్లో కీలక హోదాల్లో పనిచేశారు.
మరోవైపు సీఎస్ అరుణ్‌కుమార్ మరణంపై బిహార్ సీఎం నీతీశ్ కుమార్ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఈ మేరకు నీతీశ్ ట్వీట్ చేశారు. గొప్ప స్నేహశీలి అని, పలు హోదాల్లో విశేష సేవలందించారని ముఖ్యమంత్రి కొనియాడారు. ఆయన మరణం రాష్ట్ర పరిపాలనా రంగానికి తీరని లోటన్నారు. అరుణ్‌కుమార్ సింగ్ అంత్యక్రియలను అధికార లాంఛనాలతో నిర్వహిస్తామని నితీశ్ కుమార్ ప్రకటించారు.
కరోనా మహమ్మారి నుంచి కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ మాస్కులు తప్పకుండా ధరించాలని, శానిటైజ్ చేసుకోవాలని, సామాజిక దూరం పాటించాలని ఏషియానెట్ విజ్ఢప్తి చేస్తోంది. సాధ్యమైనంత త్వరగా కరోనా టీకా తీసుకోవాలని కూడా కోరుతోంది. అందరం కలిసి కరోనా వ్యాప్తిని అరికడుదాం, మనల్ని మనం రక్షించుకుందాం. #ANCares #IndiaFightsCorona