రెండో రోజు బెంగుళూరులో ప్రారంభమైన విపక్షాల భేటీ: సీట్ల పంపకం, కూటమి పేరుపై చర్చ
బెంగుళూరులో విపక్ష పార్టీల సమావేశం రెండో రోజు ప్రారంభమైంది. నిన్న సాయంత్రం నుండి బెంగుళూరులో విపక్ష పార్టీల భేటీ జరుగుతున్న విషయం తెలిసిందే.

బెంగుళూరు: విపక్ష పార్టీల సమావేశం బెంగుళూరులో మంగళవారంనాడు మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమైంది. నిన్నటి నుండి బెంగుళూరులో విపక్ష పార్టీలు సమావేశమౌతున్నాయి. పాట్నా సమావేశానికి కొనసాగింపుగా ఈ సమావేశం కొనసాగుతుంది. ఈ సమావేశానికి 26 పార్టీల నుండి 53 మంది ప్రతినిధులు హాజరయ్యారు.
సమావేశం ప్రారంభం కాగానే కేరళ మాజీ సీఎం ఉమెన్ చాందీ మృతికి సంతాపం తెలిపింది. ఈ సమావేశంలో ఆరు అంశాలపై ప్రధానంగా చర్చించనున్నారు. సీట్ల భాగస్వామ్యం, కూటమి పేరు, కామన్ మినిమమ్ ప్రోగ్రాం వంటి అంశాలపై చర్చించనున్నారు. కూటమిని కోఆర్డినేట్ చేయడానికి సబ్ కమిటీని ఏర్పాటు చేయనున్నారు. నిన్నఈ సమావేశానికి హాజరు కాని ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ ఇవాళ ఈ సమావేశంలో పాల్గొన్నారు.
ఇవాళ సాయంత్రం న్యూఢిల్లీలో ఎన్డీఏ పక్షాల సమావేశం జరగనుంది. గతంలో పాట్నాలో జరిగిన సమావేశానికి కొనసాగింపుగా విపక్ష పార్టీల సమావేశం జరుగుతుంది. పాట్నా సమావేశానికి 14 పార్టీల ప్రతినిధులు హాజరయ్యారు. అయితే బెంగుళూరు భేటీకి 26 పార్టీల ప్రతినిధులు హాజరయ్యారు.
also read:అవినీతిని అడ్డుకునే చర్యలను వ్యతిరేకిస్తున్నాయి: బెంగుళూరులో విపక్షాల భేటీపై మోడీ ఫైర్
2024 పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీని అధికారంలోకి రాకుండా చూసేందుకుగాను విపక్షాలు కూటమిగా పోటీ చేయాలని భావిస్తున్నాయి. అయితే బీజేపీ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండేందుకు ఏ రకమైన వ్యూహంతో వెళ్లాలనే దానిపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఆయా రాష్ట్రాల్లో బహుముఖ పోటీని నివారించాలని భావిస్తున్నాయి.
విపక్ష పార్టీల సమావేశానికి బీహార్ సీఎం నితీష్ కుమార్ కసరత్తు చేశారు. విపక్షాలకు చెందిన పలువురు నేతలతో ఆయన సమావేశాలు నిర్వహించారు. విపక్ష పార్టీల సమావేశానికి పాట్నా వేదికగా నిలిచింది. ఆ తర్వాత సమావేశం బెంగుళూరులో జరుగుతుంది. బెంగుళూరు సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను బెంగుళూరు డిక్లరేషన్ తో ప్రకటించాలని నేతలు భావిస్తున్నారు.ఇవాళ సాయంత్రం విపక్ష పార్టీల కూటమి తీసుకున్న నిర్ణయాలను మీడియాకు వివరించనున్నారు.