కేరళలో వలస కార్మికుడికి రూ. 75 లక్షల లాటరీ.. వెంటనే పోలీసు స్టేషన్‌కు పరుగుతీశాడు.. ఎందుకో తెలుసా?
కేరళలో ఓ వలస కార్మికుడు రూ. 75 లక్షల లాటరీ గెలుచుకున్నాడు. వెంటనే అభద్రతా భావంతో మంగళవారం రాత్రి సమీప పోలీసు స్టేషన్‌కు వెళ్లాడు. లాటరీ డబ్బులు తీసుకున్న తర్వాత తన స్వరాష్ట్రం బెంగాల్‌కు తిరిగి వెళ్లాలని అనుకుంటున్నాడు.

తిరువనంతపురం: కేరళకు బెంగాల్ నుంచి వలస వచ్చిన కార్మికుడు రూ. 75 లక్షల లాటరీ గెలుచుకున్నాడు. వెంటనే అతను సమీప పోలీసు స్టేషన్‌కు పరుగుతీశాడు. రూ. 75 లక్షల లాటరీ గెలిచానని తెలుసుకోగానే ఆయన ఒంట్లో అభద్రతా భావం సర్రున పాకింది. తనకు, తన ప్రైజ్ మనీకి రక్షణ కల్పించాలని పోలీసులను కోరాడు. ఆ లాటరీ గెలిచిన తర్వాత ఉండే ఫార్మాలిటీస్‌ను పోలీసులు ఆయనకు వివరించి చెప్పారు. మంగళవారం రాత్రి ఆయన మువత్తుపుజా పోలీసు స్టేషన్‌కు పరుగెత్తుకు వెళ్లాడు.
పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఎస్‌కే బాదేశ్ కొన్నాళ్ల క్రితం కేరళకు వలస వచ్చాడు. కేరళ ప్రభుత్వ లాటరీల్లో చాలా సార్లు పాల్గొన్నాడు. ఎన్నోసార్లు తాను గెలుస్తానని ఆశగా ఎదురుచూశాడు. కాని విజయం తనను ఎప్పుడూ వరించలేదు. మంగళవారం రాత్రి స్త్రీ శక్తి లాటరీ తగిలింది. రిజల్ట్ చూస్తుండగా తనకు లాటరీ తగిలిందని గమనించాడు.
వెంటనే అతను పోలీసు స్టేషన్‌కు వెళ్లాడు. ఎవరైనా తన టికెట్ దొంగిలిస్తారేమోనని భయపడ్డాడు. తనకు ఫార్మాలిటీస్ కూడా తెలియదు. కాబట్టి, రక్షణ కోసం పోలీసులను ఆశ్రయించాడు. వారిని ఫార్మాలిటీల గురించి అడిగాడు.
పోలీసులు ఎస్‌కే బాదేశ్‌కు ఫార్మాలిటీ గురించి వివరించి చెప్పారు.
Also Read: సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎన్నికలు రద్దు: గెజిట్ విడుదల
ఎస్‌కే బాదేశ్ ఎర్నాకుళంలోని చోట్టనికరలో రోడ్డు పని చేస్తున్నాడు. అదే సమయంలో లాటరీ టికెట్ కొన్నాడు. అతనికి మలయాళం రాదు. కాబట్టి, మిత్రుడు కుమార్‌ను రప్పించి అతని సహాయం తీసుకున్నాడు.
లాటరీ గెలుచుకున్న తర్వాత ఎస్‌కే బాదేశ్ తిరిగి బెంగాల్ వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నాడు. తనకు డబ్బు రాగానే వెళ్లిపోవాలని నిశ్చయించుకున్నాడు. లాటరీలో వచ్చిన డబ్బుతో తన ఇంటికి రిపేర్ చేయించి, వ్యవసాయాన్ని ఇంకొంత విస్తరించాలని అనుకుంటున్నాడు.