బీబీసీ డాక్యుమెంటరీపై నిషేధం: కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు.. 3 వారాల్లోగా స్పందించాలని ఆదేశాలు
New Delhi: తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా, న్యాయవాది ప్రశాంత్ భూషణ్ లు బీబీసీ డాక్యుమెంటరీ నిషేధంపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. గుజరాత్ అల్లర్లపై వివాదాస్పద బీబీసీ డాక్యుమెంటరీపై నిషేధానికి సంబంధించి మూడు వారాల్లోగా సమాధానమివ్వాలని కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.

Supreme Court issues notice to Centre: ప్రధాని నరేంద్ర మోడీ పై బీబీసీ డాక్యుమెంటరీ ఇంకా దుమారం రేపుతూనే ఉంది. ఇప్పటికే రాజకీయంగా రచ్చ సృష్టించిన బీబీసీ డాక్యుమెంటరీపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. దేశంలో దానిని చూడకుండా ఆంక్షలు విధించింది. ఇంటర్నెట్ నుంచి బీబీసీ డాక్యుమెంటరీ లింకులను తొలగించింది. అయితే, దీనిపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. కోర్టులను ఆశ్రయించారు. ఈ క్రమంలోనే సుప్రీంకోర్టు ఈ అంశంపై వివరణ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.
వివరాల్లోకెళ్తే.. గుజరాత్ అల్లర్లపై వివాదాస్పద బీబీసీ డాక్యుమెంటరీపై నిషేధానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసు జారీ చేసింది . దీనిపై మూడు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని కేంద్రాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. బీబీసీ డాక్యుమెంటరీ 'ఇండియా: ది మోడీ క్వశ్చన్'లో, గుజరాత్ అల్లర్లకు సంబంధించి ప్రధాని మోడీకి వ్యతిరేకంగా అనేక వాదనలు చేయబడ్డాయి, దీని కోసం కేంద్రం సోషల్ మీడియా, ఆన్‌లైన్ ఛానెల్‌లలో దానిని నిషేధించింది.
నిషేధాన్ని తొలగించాలని డిమాండ్
బీబీసీ డాక్యుమెంటరీపై నిషేధం విధించిన తర్వాత దేశవ్యాప్తంగా దుమారం రేగింది. ఆ తర్వాత నిషేధానికి వ్యతిరేకంగా సీనియర్ జర్నలిస్టు ఎన్.రామ్, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మోయిత్రా, న్యాయవాది ప్రశాంత్ భూషణ్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. బీబీసీ (బ్రిటీష్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్) డాక్యుమెంటరీలో చూపిన నిజాన్ని చూసి ప్రభుత్వం భయపడుతోందని పిటిషనర్లు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ నిషేధం దురుద్దేశపూరితమైనదనీ, ఏకపక్షంతోపాటు రాజ్యాంగ విరుద్ధమని పిటిషన్‌లో పేర్కొన్నారు.
అనేక విశ్వవిద్యాలయాలలో స్క్రీనింగ్..
వివాదాస్పద బీబీసీ డాక్యుమెంటరీపై నిషేధం ఉన్నప్పటికీ, కొన్ని విద్యార్థి సంఘాలు దేశవ్యాప్తంగా వివిధ యూనివర్సిటీ క్యాంపస్‌లలో దీనిని ప్రదర్శించాయి. దీని తర్వాత చాలా చోట్ల హింస కూడా కనిపించింది. దాని స్క్రీనింగ్‌ను నిలిపివేయడానికి ఢిల్లీలోని అంబేద్కర్ విశ్వవిద్యాలయంలో విద్యుత్‌ను కూడా నిలిపివేశారు. కేరళలో అయితే, రాజకీయ ఘర్షణకు దారి తీసింది.
పూర్తి నిషేధానికి సంబంధించి పిటిషన్..
మరోవైపు బీబీసీ డాక్యుమెంటరీని భారత్ లో పూర్తిగా నిషేధించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ ను తక్షణమే లిస్టింగ్ కోసం పునఃపరిశీలించాలని సుప్రీంకోర్టును పిటిషనర్లు కోరారు. ఈ విషయాన్ని శుక్రవారం ప్రస్తావించాలని పిటిషనర్ తరఫు న్యాయవాదిని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనాన్ని కోరారు. బీబీసీ, దాని సిబ్బందిపై విచారణ జరపాలని కోరుతూ హిందూసేన అధ్యక్షుడు విష్ణు గుప్తా, రైతు బీరేంద్ర కుమార్ సింగ్ దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు విచారించింది. బిబిసి డాక్యుమెంటరీ భారతదేశం-ప్రధాని మోడీ ప్రపంచ ఎదుగుదలకు వ్యతిరేకంగా లోతైన కుట్రను కలిగి ఉందని పిటిషన్ లో పేర్కొన్నారు.
న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు వ్యాఖ్యలు
2002 గుజరాత్ అల్లర్లపై బీబీసీ డాక్యుమెంటరీని అడ్డుకోవాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన వారిపై కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు మండిపడ్డారు. సోషల్ మీడియాలో 'ఇండియా: ది మోదీ క్వశ్చన్' డాక్యుమెంటరీని బ్లాక్ చేయాలన్న కేంద్రం నిర్ణయాన్ని సవాలు చేస్తూ ఎన్ రామ్, ప్రముఖ పాత్రికేయుడు, సామాజిక కార్యకర్త న్యాయవాది ప్రశాంత్ భూషణ్ తదితరులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వేలాది మంది సామాన్య పౌరులు న్యాయం కోసం ఎదురుచూస్తూ తేదీల కోసం ఎదురుచూస్తున్న సుప్రీంకోర్టు విలువైన సమయాన్ని ఇలా వృథా చేస్తున్నారని కిరణ్ రిజిజు అన్నారు.