శివసేన వ్యవస్థాపకుడు బాల్ థాక్రే మనవడు నిహార్ థాక్రే .. సీఎం ఏక్‌నాథ్ షిండే వర్గంలో చేరారు. శివసేన తన చేతి నుంచి జారిపోకుండా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న ఉద్ధవ్ థాక్రేకు నిహార్ వ్యవహారం మింగుడు పడటం లేదు.  

మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రేకు మరో షాక్ తగిలింది. శివసేన వ్యవస్థాపకుడు బాల్ థాక్రే మనవడు నిహార్ థాక్రే .. సీఎం ఏక్‌నాథ్ షిండే వర్గంలో చేరారు. అంతేకాదు.. త్వరలో ఈస్ట్ అంథేరికి జరగనున్న ఉపఎన్నికలో ఉద్థవ్ వర్గానికి వ్యతిరేకంగా ప్రచారం నిర్వహించనున్నారు నిహార్. అంధేరి ఈస్ట్ నియోజకవర్గంలో నవంబర్ 3న ఉపఎన్నికలు నిర్వహించనున్నారు. షిండే క్యాంప్ మద్ధతుతో బీజేపీ పార్టీ పటేల్‌ను పోటీకి దింపింది. అటు ఉద్థవ్ థాక్రే వర్గం రితుజా లాట్కేను అభ్యర్ధిగా ఎంపిక చేసింది. శివసేన రెండు వర్గాలుగా జరుగుతున్న ఎన్నిక కావడం.. ప్రజలు, పార్టీ కేడర్ ఎవరి వైపు వున్నారో తెలిపే అవకాశం కావడంతో ఇరు వర్గాలు ఉపఎన్నికను సీరియస్‌గా తీసుకున్నాయి. 

కాగా... శివసేన రెబల్ ఎమ్మెల్యేల తిరుగుబాటుతో మహారాష్ట్రలోని మహా వికాస్ అఘాడి ప్రభుత్వం కుప్పకూలిన సంగతి తెలిసిందే. దీంతో ఉద్ధవ్ థాక్రే సీఎం పదవి నుంచి తప్పుకున్నారు. ఈ క్రమంలో బీజేపీ మద్ధతుతో ఏక్‌నాథ్ షిండే సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. తర్వాతి నుంచి అసలైన శివసేన తమదేనంటూ ఆయన ఏకంగా కోర్టును కూడా ఆశ్రయించారు. ఈ క్రమంలో తనకు మద్ధతు కూడగట్టే పనిలోనూ ముఖ్యమంత్రి బిజీగా వున్నారు. ఉద్ధవ్ థాక్రే కూడా వ్యూహాత్మకంగా పావులు కదుపుతూ వుండటంతో మహారాష్ట్రలో రాజకీయం హాట్ హాట్‌గా వుంది. 

ALso Read:సొంత కుటుంబం నుంచి అందని సాయం.. షిండేను కలిసిన నిహార్ థాక్రే, షాక్‌లో ఉద్ధవ్

అయితే సొంత కుటుంబ సభ్యుల నుంచి ఆయనకు వరుస షాకులు తగులుతున్నాయి. ఉద్ధవ్ థాక్రే సొదరుడు బిందు మాధవ్ థాక్రే (బాల్ థాక్రే పెద్ద కుమారుడు) తనయుడే నిహార్ థాక్రే . ఈ వ్యవహారంతో ఉద్ధవ్ ఉలిక్కిపడ్డారు. శివసేన తన చేతి నుంచి జారిపోకుండా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న మాజీ ముఖ్యమంత్రికి నిహార్ వ్యవహారం మింగుడు పడటం లేదు. 

ఇకపోతే బిందు మాధవ్ థాక్రే 1996లో ఓ రోడ్డు ప్రమాదంలో కన్నుమూశారు. ఆయన కుమారుడు నిహార్ రాజకీయాల్లో అంత యాక్టీవ్‌గా లేరు. లాయర్‌గా తన ప్రాక్టీస్ చూసుకుంటున్నారు. గతేడాది డిసెంబర్‌లో బీజేపీ నేత హర్షవర్థన్ పాటిల్ కుమార్తె అంకితా పాటిల్‌ను నిహార్ పెళ్లాడారు. దీనికి ముందు ఉద్ధవ్ థాక్రేకు మరో సోదరుడైన జైదేవ్ థాక్రే మాజీ భార్య స్మితా థాక్రే కూడా ఇటీవల సీఎం ఏక్‌నాథ్ షిండేతో సమావేశం కావడం మరాఠా రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.