మహారాష్ట్రలో శివసేన పార్టీపై ఆధిపత్యం కోసం ఉద్ధవ్ థాక్రే - సీఎం ఏక్‌నాథ్ షిండే వర్గాల మధ్య పోరు జరుగుతున్న వేళ బాల్‌థాక్రే పెద్ద కుమారుడు బిందు మాధవ్ థాక్రే తనయుడు నిహార్ థాక్రే ఇవాళ ముఖ్యమంత్రిని కలిశారు.
శివసేన (shivsena) రెబల్ ఎమ్మెల్యేల తిరుగుబాటుతో మహారాష్ట్రలోని (maharashtra) మహా వికాస్ అఘాడి ప్రభుత్వం (maha vikas aghadi) కుప్పకూలిన సంగతి తెలిసిందే. దీంతో ఉద్ధవ్ థాక్రే (uddhav thackeray) సీఎం పదవి నుంచి తప్పుకున్నారు. ఈ క్రమంలో బీజేపీ మద్ధతుతో ఏక్‌నాథ్ షిండే (eknath shinde) సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. తర్వాతి నుంచి అసలైన శివసేన తమదేనంటూ ఆయన ఏకంగా కోర్టును కూడా ఆశ్రయించారు. ఈ క్రమంలో తనకు మద్ధతు కూడగట్టే పనిలోనూ ముఖ్యమంత్రి బిజీగా వున్నారు. ఉద్ధవ్ థాక్రే కూడా వ్యూహాత్మకంగా పావులు కదుపుతూ వుండటంతో మహారాష్ట్రలో రాజకీయం హాట్ హాట్‌గా వుంది.
అయితే సొంత కుటుంబ సభ్యుల నుంచి ఆయనకు వరుస షాకులు తగులుతున్నాయి. తాజాగా ఉద్ధవ్ థాక్రే సొదరుడు బిందు మాధవ్ థాక్రే (బాల్ థాక్రే పెద్ద కుమారుడు) తనయుడు నిహార్ థాక్రే (nihar thackeray) శుక్రవారం ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేను కలిసి మద్ధతు ప్రకటించారు. ఈ వ్యవహారంతో ఉద్ధవ్ ఉలిక్కిపడ్డారు. శివసేన తన చేతి నుంచి జారిపోకుండా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న మాజీ ముఖ్యమంత్రికి నిహార్ వ్యవహారం మింగుడు పడటం లేదు.
ఇకపోతే బిందు మాధవ్ థాక్రే 1996లో ఓ రోడ్డు ప్రమాదంలో కన్నుమూశారు. ఆయన కుమారుడు నిహార్ రాజకీయాల్లో అంత యాక్టీవ్‌గా లేరు. లాయర్‌గా తన ప్రాక్టీస్ చూసుకుంటున్నారు. గతేడాది డిసెంబర్‌లో బీజేపీ నేత హర్షవర్థన్ పాటిల్ కుమార్తె అంకితా పాటిల్‌ను నిహార్ పెళ్లాడారు. దీనికి ముందు ఉద్ధవ్ థాక్రేకు మరో సోదరుడైన జైదేవ్ థాక్రే మాజీ భార్య స్మితా థాక్రే కూడా ఇటీవల సీఎం ఏక్‌నాథ్ షిండేతో సమావేశం కావడం మరాఠా రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.
కాగా.. తొలుత అధికారం కోసం సీఎం ఏక్ నాథ్ షిండే నేతృత్వంలో తిరుగుబాటు చేసిన శివసేన తిరుగుబాటుదారులు.. తాజాగా పార్టీని, పార్టీ గుర్తుపై అధిపత్యం సాధించాలని, పార్టీని తమ హస్తగతం చేసుకోవాలని భావిస్తున్నారు. ఈ క్రమంలో షిండే వర్గం ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించింది. తమదే అసలైన శివసేన అని, తనకే పార్టీ ఎమ్మెల్యే, ఎంపీల మద్దతు ఉందని షిండే వర్గం పేర్కొంది. ఈ క్రమంలో నిజమైన శివసేనగా గుర్తించాలని కోరుతూ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని వర్గం చేసిన పిటిషన్‌పై ఎన్నికల కమిషన్ చర్యలను వ్యతిరేకిస్తూ చెందిన ఉద్ధవ్ ఠాక్రే వర్గం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
ఈ క్రమంలో రెండు వర్గాల వారికి ఆగస్టు 8లోగా పార్టీ, దాని ఎన్నికల గుర్తులపై (విల్లు మరియు బాణం) తమ తమ వాదనలకు మద్దతుగా పత్రాలను సమర్పించాలని ఎన్నికల సంఘం ఇటీవల ఆదేశించడంతో ఈ పరిణామం ప్రాముఖ్యతను సంతరించుకుంది.పార్టీ శాసనసభా, సంస్థాగత విభాగాల మద్దతు లేఖలు, ప్రత్యర్థి వర్గాల వ్రాతపూర్వక ప్రకటనలతో సహా అవసరమైన పత్రాలను సమర్పించాలని ఇరువర్గాలను కోరినట్లు ఎన్నికల సంఘం వర్గాలు తెలిపాయి. శివసేన ప్రధాన కార్యదర్శి సుభాష్ దేశాయ్ పెండింగ్‌లో ఉన్న పిటిషన్‌తో పాటు తాజా దరఖాస్తును దాఖలు చేశారు. ఇందులో ఎన్నికల సంఘాన్ని పార్టీగా మార్చేందుకు సుప్రీంకోర్టు అనుమతి కూడా కోరింది.
ఈ క్రమంలో ఉద్ధవ్ ఠాక్రే సుప్రీంకోర్టును ఆశ్రయించారు. నిజమైన శివసేనగా గుర్తించబడటానికి ఏకనాథ్ షిండే వర్గం ఎత్తుగడపై ఎన్నికల కమిషన్ చర్యలపై స్టే విధించాలని పిటిషన్ దాఖాలు చేశారు. శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు స్వీకరించింది. ఈ పిటిషన్ ను సోమవారం విచారించనుంది. తనకు 55 మంది ఎమ్మెల్యేల్లో 40 మంది ఎమ్మెల్యేలు, 18 మంది లోక్‌సభ ఎంపీల్లో 12 మంది తమకు మద్దతుగా ఉన్నారని షిండే టీమ్ ఎన్నికల కమిషన్‌కు లేఖ రాశారు. థాకరే వర్గం అప్పుడు సుప్రీంకోర్టును ఆశ్రయించింది. వ్యతిరేక శిబిరంలోని నాయకులపై ఇరువర్గాలు తరలించిన అనర్హత నోటీసులపై సుప్రీం కోర్టు నిర్ణయం తీసుకుంటే తప్ప నిజమైన శివసేన ఏది అని ఎన్నికల సంఘం నిర్ణయించదు.
